నెహెమ్యా 11

11
యెరూషలేములో క్రొత్తగా నివసించేవారు
1ప్రజల నాయకులు యెరూషలేములో స్థిరపడ్డారు. మిగిలిన ప్రజల్లో పదిమందిలో ఒకరు మాత్రమే పరిశుద్ధ యెరూషలేములో నివసించేలా మిగతా తొమ్మిదిమంది తమ సొంత పట్టణాల్లోనే నివసించేలా చీట్లు వేశారు. 2యెరూషలేములో నివసించడానికి ఇష్టపూర్వకంగా వచ్చిన వారిని ప్రజలు దీవించారు.
3యెరూషలేములో స్థిరపడిన ప్రాంతీయ నాయకులు వీరే, (ఇశ్రాయేలీయులలో కొంతమంది, యాజకులు, లేవీయులు, ఆలయ సేవకులు, సొలొమోను సేవకుల వారసులు యూదా పట్టణాల్లో వివిధ పట్టణాల్లో ఉన్న తమ సొంత స్థలాల్లో నివసించారు, 4యూదా, బెన్యామీను వారిలో మరికొంతమంది యెరూషలేములో నివసించారు):
యూదా వారసుల నుండి:
అతాయా, ఇతడు పెరెసు వారసుడైన మహలలేలు కుమారుడైన షెఫట్యాకు పుట్టిన అమర్యా కుమారుడైన జెకర్యాకు పుట్టిన ఉజ్జియా కుమారుడు;
5మయశేయా, ఇతడు షేలా వారసుడైన జెకర్యా కుమారుడైన యోయారీబుకు పుట్టిన అదాయా కుమారుడైన హజాయాకు పుట్టిన కొల్-హోజె కుమారుడైన బారూకు కుమారుడు.
6యెరూషలేములో నివసించిన పెరెసు వారసులు 468 మంది, వీరంతా అసాధారణమైన పోరాట యోధులు.
7బెన్యామీను వారసుల నుండి:
సల్లు, ఇతడు యెషయా కుమారుడైన ఇతీయేలుకు పుట్టిన మయశేయా కుమారుడైన కోలాయాకు పుట్టిన పెదాయా కుమారుడైన యోవేదుకు పుట్టిన మెషుల్లాము కుమారుడు, 8అతని అనుచరులైన గబ్బయి సల్లయి అనేవారితో కలిపి 928 మంది.
9జిఖ్రీ కుమారుడైన యోవేలు వీరి అధికారి; హస్సెనూయా కుమారుడైన యూదా ఆ పట్టణపు నూతన భాగానికి ముఖ్య అధికారి.
10యాజకుల నుండి:
యోయారీబు కుమారుడైన యెదాయా, యాకీను;
11శెరాయా దేవుని ఆలయానికి అధికారిగా ఉన్నాడు. ఇతడు అహీటూబు కుమారుడైన మెరాయోతుకు పుట్టిన సాదోకు కుమారుడైన మెషుల్లాముకు పుట్టిన హిల్కీయా కుమారుడు; 12ఆలయ పని చేసే వీరి బంధువులు 822 మంది;
అదాయా, ఇతడు మల్కీయా కుమారుడైన పషూరుకు పుట్టిన జెకర్యా కుమారుడైన అమ్జీకు పుట్టిన పెలల్యా కుమారుడైన యెరోహాము కుమారుడు. 13కుటుంబ పెద్దలుగా ఉన్న వీరి బంధువులు 242 మంది.
అమష్షయి, ఇతడు ఇమ్మేరు కుమారుడైన మెషిల్లేమోతుకు పుట్టిన అహజై కుమారుడైన అజరేలు కుమారుడు. 14అతని బంధువులు 128 మంది, వీరు అసాధారణ పోరాట యోధులు.
హగ్గేదోలిము కుమారుడైన జబ్దీయేలు వీరి ముఖ్య అధికారి.
15లేవీయుల నుండి:
షెమయా, ఇతడు బున్నీకి పుట్టిన హషబ్యా కుమారుడైన అజ్రీకాముకు పుట్టిన హష్షూబు కుమారుడు.
16దేవుని మందిరంలో బయటి పనులకు పర్యవేక్షకులుగా ఉన్న లేవీయుల పెద్దలు షబ్బెతై, యోజాబాదు;
17కృతజ్ఞతాస్తుతులు ప్రార్థన నడిపించే నాయకుడు ఆసాపు కుమారుడైన జబ్దికి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్యా;
అతని సహకారులలో రెండవవాడైన బక్బుక్యా;
యెదూతూను కుమారుడైన గాలాలుకు పుట్టిన షమ్మూయ కుమారుడైన అబ్దా.
18పరిశుద్ధ పట్టణంలో ఉన్న లేవీయుల సంఖ్య 284 మంది.
19ద్వారపాలకుల్లో:
అక్కూబు, టల్మోను గుమ్మాలను కాపలా కాసేవారి సహాయకులు 172 మంది.
20మిగిలిన ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు యూదా పట్టణాల్లో తమకు కేటాయించిన స్వాస్థ్యంలో నివసించారు.
21ఆలయ సేవకులు ఓఫెలు కొండమీద నివసించారు. వీరికి జీహా, గిష్పా అధికారులు.
22యెరూషలేములోని లేవీయులకు ఉజ్జీ అధికారి; ఇతడు మీకా కుమారుడైన మత్తన్యాకు పుట్టిన హషబ్యా కుమారుడైన బానీ కుమారుడు. దేవుని ఆలయ సేవల బాధ్యత వహించిన సంగీతకారులైన ఆసాపు వారసులలో ఒకడు ఉజ్జీ. 23సంగీతకారులు రాజు ఆదేశాల ప్రకారం పని చేయాలి, కాబట్టి వారి దినచర్య క్రమబద్ధం చేయబడింది.
24యూదా కుమారుడైన జెరహు వారసులలో ఒక్కడైన మెషేజబేలు కుమారుడైన పెతహయా ప్రజలకు సంబంధించిన అన్ని వ్యవహారాలలో రాజుకు సలహాదారునిగా ఉన్నాడు.
25ఇక గ్రామాలు వాటి పొలాలకు సంబంధించి యూదా ప్రజల్లో కొంతమంది కిర్యత్-అర్బాలో దాని చుట్టుప్రక్కల గ్రామాల్లో, దీబోనులో దాని చుట్టుప్రక్కల గ్రామాల్లో, యెకబ్సెయేలులో దాని గ్రామాల్లో, 26యెషూవలో, మొలాదాలో, బేత్-పెలెతులో, 27హజర్-షువలులో, బెయేర్షేబలో వాటి చుట్టుప్రక్కల గ్రామాల్లో, 28సిక్లగులో, మెకోనాలో దాని చుట్టుప్రక్కల గ్రామాల్లో, 29ఎన్-రిమ్మోనులో, జోరహులో, యర్మూతులో, 30జానోహలో, అదుల్లాములో వాటి గ్రామాల్లో, లాకీషులో దానికి పొలాల్లో అజేకాలో దాని చుట్టుప్రక్కల గ్రామాల్లో నివసించారు. వారు బెయేర్షేబ నుండి హిన్నోము లోయవరకు నివసించారు.
31గెబాలో స్థిరపడిన బెన్యామీనీయులు మిక్మషులో, అయ్యాలో, బేతేలు వాటి చుట్టుప్రక్కల గ్రామాల్లో, 32అనాతోతులో, నోబులో, అనన్యాలో, 33హాసోరులో, రామాలో, గిత్తయీములో, 34హదీదులో, సెబోయిములో, నెబల్లాటులో, 35లోదులో, పనివారి లోయ అని పిలిచే ఓనోలో నివసించారు.
36యూదాలోని లేవీయులలో కొన్ని గుంపులు బెన్యామీనులో నివసించారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

నెహెమ్యా 11: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి