నెహెమ్యా 9
9
తమ పాపాలు ఒప్పుకున్న ఇశ్రాయేలీయులు
1అదే నెల ఇరవై నాలుగవ రోజున ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనెపట్టలు కట్టుకుని తలమీద బూడిద వేసుకుని వచ్చారు. 2ఇశ్రాయేలీయులు విదేశీయులకు వేరుగా నిలబడి తమ పాపాలను తమ పూర్వికుల పాపాలను ఒప్పుకున్నారు. 3వారు ఉన్న చోటే నిలబడి ఒక పూటంతా తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివారు. మరో పూట తమ పాపాలు ఒప్పుకుంటూ తమ దేవుడైన యెహోవాను ఆరాధిస్తూ గడిపారు. 4లేవీయులలో యెషూవ, బానీ, కద్మీయేలు, షెబన్యా, బున్నీ, షేరేబ్యా, బానీ, కెనానీ అనేవారు మెట్ల మీద నిలబడి తమ దేవుడైన యెహోవాకు బిగ్గరగా మొరపెట్టారు. 5అప్పుడు లేవీయులైన యెషూవ, కద్మీయేలు, బానీ, హషబ్నెయా, షేరేబ్యా, హోదీయా, షెబన్యా, పెతహయా అనేవారు మెట్ల మీద నిలబడి, “లేచి నిలబడండి, మీకు నిత్యం దేవునిగా ఉన్న యెహోవాను స్తుతించండి” అని చెప్పి ఇలా స్తుతించారు:
“మీ దివ్యమైన నామం స్తుతించబడుతుంది. సమస్త ఆశీర్వాదాలకు స్తుతులకు మించి హెచ్చింపబడుతుంది. 6మీరు మాత్రమే యెహోవా. మీరే మహాకాశాలను, ఆకాశాలను, వాటి నక్షత్ర సమూహాలన్నిటిని, భూమిని, దానిలో ఉన్న సమస్తాన్ని, సముద్రాలను, వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించారు. వాటన్నిటికి జీవాన్ని ఇచ్చారు. పరలోక సమూహాలన్ని మిమ్మల్ని ఆరాధిస్తున్నాయి.
7“యెహోవా దేవా, అబ్రామును ఏర్పరచుకుని, అతన్ని కల్దీయుల ఊరు అనే చోటు నుండి బయటకు తీసుకువచ్చి అతనికి అబ్రాహాము అని పేరు పెట్టింది మీరే. 8అతని హృదయం మీ పట్ల నమ్మకంగా ఉందని గుర్తించి కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజ్జీయులు యెబూసీయులు గిర్గాషీయుల దేశాన్ని అతని వారసులకు ఇస్తానని అతనితో నిబంధన చేశారు. మీరు నీతిమంతులు కాబట్టి మీ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు.
9“మా పూర్వికులు ఈజిప్టులో శ్రమపడడం మీరు చూశారు; ఎర్ర సముద్రం దగ్గర వారి మొర విన్నారు. 10ఫరో, అతని సేవకులు, అతని దేశ ప్రజలందరు ఇశ్రాయేలీయుల పట్ల ఎంత అహంకారంతో ప్రవర్తించారో మీకు తెలుసు కాబట్టి మీరు వారి ఎదుట అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచకక్రియలు చేశారు. ఈ రోజు వరకు మీ నామాన్ని ఘనపరిచేలా చేశారు. 11మీ ప్రజల ఎదుట సముద్రాన్ని రెండుగా చీల్చగా వారు పొడినేల మీద నడిచివెళ్లారు. లోతైన నీళ్లలో రాయి వేసినట్లుగా మీ ప్రజలను వెంటాడుతూ వచ్చిన వారిని అగాధ జలాల్లో పడేశారు. 12మీరు పగలు మేఘస్తంభంలా రాత్రి వారు వెళ్లే మార్గంలో వెలుగు ఇవ్వడానికి అగ్ని స్తంభంలా వారిని నడిపించారు.
13“మీరు సీనాయి పర్వతం మీదికి దిగివచ్చి పరలోకం నుండి వారితో మాట్లాడారు. వారికి న్యాయమైన సరియైన నియమాలు, చట్టాలు మేలైన శాసనాలు, ఆజ్ఞలు ఇచ్చారు. 14పరిశుద్ధ విశ్రాంతి దినాన్ని ఆచరించాలని మీరు వారికి తెలియజేశారు. మీ సేవకుడైన మోషే ద్వారా ఆజ్ఞలు, శాసనాలు, ధర్మశాస్త్రాన్ని నియమించారు. 15మీరు వారి ఆకలి తీర్చడానికి పరలోకం నుండి ఆహారాన్ని ఇచ్చి దాహం తీర్చడానికి బండలో నుండి నీళ్లు రప్పించారు; మీరు వారికి ఇస్తానని ప్రమాణం చేసిన దేశానికి వెళ్లి స్వాధీనం చేసుకోమని చెప్పారు.
16“అయితే మా పూర్వికులు అహంకారంతో ప్రవర్తించి మీ ఆజ్ఞలకు లోబడకుండా తిరుగుబాటు చేశారు. 17మీకు అవిధేయులుగా ఉండి, మీరు వారి మధ్య చేసిన అద్భుతాలను మరచిపోయారు. ఈజిప్టులో తమ బానిసత్వానికి తిరిగి వెళ్లడానికి ఒక నాయకుని ఏర్పరచుకుని తిరుగుబాటు చేశారు. అయితే మీరు క్షమించే దేవుడవు దయా కనికరం ఉన్నవారు, త్వరగా కోప్పడరు, అపరిమితమైన ప్రేమ ఉన్నవారు కాబట్టి వారిని విడిచిపెట్టలేదు. 18వారు పోతపోసిన దూడను తయారుచేసి, ఈజిప్టు నుండి మమ్మల్ని బయటకు తీసుకువచ్చిన దేవుడు ఇదే అని చెప్పినా తీవ్రమైన దేవదూషణ చేసినా మీరు వారిని విడిచిపెట్టలేదు.
19“మీ గొప్ప కనికరాన్ని బట్టి ఎడారిలో మీరు వారిని విడిచిపెట్టలేదు. పగలు మేఘస్తంభం దారి చూపడం ఆపలేదు; రాత్రి అగ్నిస్తంభం వారి మార్గాలకు వెలుగివ్వడం మానలేదు. 20వారికి బోధించడానికి మీరు మీ దయగల ఆత్మను ఇచ్చారు. మీరు వారికి ఇచ్చిన మన్నాను ఇవ్వడం మానలేదు. వారికి నీళ్లు ఇచ్చి వారి దాహం తీర్చారు. 21మీరు నలభై సంవత్సరాల పాటు వారిని పోషించారు. ఎడారిలో కూడా వారికి ఏమీ తక్కువ కాలేదు. వారి బట్టలు చిరిగిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు.
22“మీరు వారికి రాజ్యాలను దేశాలను ఇచ్చారు. మారుమూల సరిహద్దులను కూడా వారికి కేటాయించారు. వారు హెష్బోను రాజు సీహోను దేశాన్ని బాషాను రాజు ఓగు దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. 23మీరు వారి పిల్లలను నక్షత్రాలంత విస్తారంగా చేసి, వారి పితరులకు మీరు వెళ్లి స్వాధీనం చేసుకుంటారని వాగ్దానం చేసిన దేశంలోకి వారిని తీసుకువచ్చారు. 24వారి పిల్లలు ఆ దేశంలోనికి వెళ్లి దానిని స్వాధీనం చేసుకున్నారు. మీరు ఆ దేశంలో నివసిస్తున్న కనానీయులను వారి ఎదుట అణచివేశారు. తమకు నచ్చిన విధంగా చేయడానికి కనానీయులను వారి రాజులతో ఆ దేశ ప్రజలతో కలిపి వారి చేతికి అప్పగించారు. 25వారు కోటగోడలు ఉన్న పట్టణాలను సారవంతమైన భూమిని స్వాధీనం చేసుకున్నారు. అన్ని రకాల మంచి వస్తువులతో నిండిన ఇల్లు, త్రవ్విన బావులు, ద్రాక్షతోటలు, ఒలీవతోటలు, విస్తారమైన పండ్లచెట్లు స్వాధీనపరచుకున్నారు. వారు తిని తృప్తి చెందారు. మీ గొప్ప మంచితనాన్ని చూసి ఆనందించారు.
26“అయినా వారు మీ పట్ల అవిధేయత చూపించి మీపై తిరుగుబాటు చేశారు; మీ ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేశారు. మీ వైపు తిరగాలని వారిని హెచ్చరించిన ప్రవక్తలను చంపారు; ఘోరమైన దేవదూషణ చేశారు. 27కాబట్టి మీరు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించారు. వారు బాధించబడిన సమయంలో మీకు మొరపెట్టినప్పుడు పరలోకంలో నుండి మీరు వారి మొర విన్నారు. మీ గొప్ప కృపను బట్టి వారిని శత్రువు చేతిలో నుండి విడిపించడానికి వారికి విమోచకులను ఇచ్చారు.
28“వారికి విశ్రాంతి లభించిన వెంటనే మీ ఎదుట చెడు చేశారు కాబట్టి శత్రువులు వారి మీద ప్రభుత్వం చేసేలా వారిని తిరిగి శత్రువు చేతికే అప్పగించారు. వారు తిరిగి మీకు మొరపెట్టినప్పుడు పరలోకంలో నుండి మీరు వారి మొర విన్నారు. కరుణ చూపించి అనేకసార్లు వారిని విడిపించారు.
29“వారిని మీ ధర్మశాస్త్రం వైపు మరలించడానికి మీరు వారిని హెచ్చరించారు, అయితే వారు గర్వించి మీ ఆజ్ఞలకు లోబడక ‘వాటిని పాటించే మనుష్యులు వాటి ద్వారా జీవిస్తాడు’ అని మీరు చెప్పిన మీ శాసనాలకు వ్యతిరేకంగా వారు పాపం చేశారు. 30మీరు వారిని ఎన్నో సంవత్సరాలు ఓర్పుతో సహించారు. మీ ఆత్మ చేత ప్రవక్తల ద్వారా వారిని హెచ్చరించారు. అయినా వారు మీ మాట వినలేదు, కాబట్టి మీరు వారిని వారి పొరుగు దేశాలకు అప్పగించారు. 31అయితే మీ గొప్ప కనికరాన్ని బట్టి మీరు వారిని పూర్తిగా నాశనం చేయలేదు, విడిచిపెట్టలేదు. మీరు దయా కనికరంగల దేవుడవు.
32“మా దేవా! గొప్ప దేవా! మహా బలవంతుడా! పరిస్థితులతో సంబంధం లేకుండా మీరు చేసిన మీ ప్రేమ నిబంధన నెరవేరుస్తున్నారు. అష్షూరు రాజుల కాలం నుండి ఈ రోజు వరకు మా మీదికి, మా రాజులు నాయకుల మీదికి, మా యాజకులు ప్రవక్తల మీదికి, మా పూర్వికుల మీదికి మీ ప్రజలందరి మీదికి వచ్చిన శ్రమలు మీ దృష్టికి చిన్న విషయంగా ఉండకూడదు. 33మాకు జరిగినదాని అంతటిలో మీరు నీతిమంతులుగానే ఉన్నారు; మేము దుర్మార్గంగా ప్రవర్తించినప్పుడు మీరు నమ్మకంగా ప్రవర్తించారు. 34మా రాజులు, మా నాయకులు, మా యాజకులు, మా పూర్వికులు మీ ధర్మశాస్త్రాన్ని పాటించలేదు; మీరు పాటించమని హెచ్చరించిన మీ ఆజ్ఞలు శాసనాలను లక్ష్యపెట్టలేదు. 35వారు తమ రాజ్య పరిపాలనలోను మీరు వారికిచ్చిన విశాలమైన సారవంతమైన దేశంలో మీరు వారిపట్ల చేసిన గొప్ప మేలులు అనుభవిస్తూ కూడా వారు మిమ్మల్ని సేవించలేదు, తమ దుష్టత్వాన్ని విడిచి మీ వైపు తిరగలేదు.
36“ఇదిగో ఈ రోజు మేము బానిసలుగా ఉన్నాము, దాని ఫలాలను తిని దానిలో ఉన్న మంచి వాటన్నిటిని అనుభవించమని మా పూర్వికులకు మీరిచ్చిన దేశంలో మేము బానిసలుగా ఉన్నాము. 37మా పాపాల కారణంగా దాని అపారమైన పంటంతా మీరు మామీద నియమించిన రాజులు అనుభవిస్తున్నారు. తమకు ఇష్టం వచ్చినట్లు మా శరీరాల మీద మా పశువులమీద అధికారం చెలాయిస్తున్నారు. మేము చాలా శ్రమ అనుభవిస్తున్నాము.
ప్రజల ఒప్పందము
38“వీటన్నిటిని బట్టి మేము వ్రాతపూర్వకంగా ఒక్క ఖచ్చితమైన ఒప్పందాన్ని చేసుకున్నాము; మా నాయకులు మా లేవీయులు మా యాజకులు దానిపై తమ ముద్రలు వేసి ఆమోదించారు.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
నెహెమ్యా 9: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.