సంఖ్యా 19
19
శుద్ధి జలం
1యెహోవా మోషే అహరోనులతో ఇలా చెప్పారు: 2యెహోవా ఆజ్ఞాపించిన నియమానికి ఇది అవసరం: ఇశ్రాయేలీయులు లోపం లేని లేదా మచ్చలేని కాడి మోయని ఎర్రని పెయ్యను మీ దగ్గరకు తేవాలని చెప్పండి. 3దానిని యాజకుడైన ఎలియాజరుకు ఇవ్వాలి; అతని ఎదుట శిబిరం బయట దానిని వధించాలి. 4అప్పుడు యాజకుడైన ఎలియాజరు దాని రక్తంలో కొంత వ్రేలితో తీసుకుని సమావేశ గుడారం ముందు భాగం వైపు ఆ రక్తాన్ని ఏడుసార్లు చిలకరించాలి. 5అతడు చూస్తుండగా ఆ పెయ్య కాల్చివేయబడాలి. దాని చర్మం, మాంసం, రక్తం, పేడ అంతా కాల్చివేయబడాలి. 6అప్పుడు యాజకుడు కొంత దేవదారు కర్రను, హిస్సోపు చెట్టురెమ్మను ఎర్ర దారాన్ని తీసుకుని పెయ్యను కాల్చి నిప్పులో వెయ్యాలి. 7తర్వాత యాజకుడు తన బట్టలు ఉతుక్కుని నీటితో స్నానం చేయాలి. తర్వాత అతడు శిబిరంలో ప్రవేశించవచ్చు గాని సాయంత్రం వరకు ఆచారరీత్య అపవిత్రుడే. 8ఆ పెయ్యను దహించు వ్యక్తి తన బట్టలు ఉతుక్కుని నీటితో స్నానం చేయాలి, సాయంత్రం వరకు అతడు అపవిత్రుడే.
9పవిత్రుడైనవాడు ఆవు పెయ్య బూడిదను పోగు చేసి శిబిరం బయట ఆచార ప్రకారం శుభ్రమైన చోట ఉంచాలి. అది శుద్ధి జలంలో వాడబడడానికి ఇశ్రాయేలు సమాజం ద్వారా పెట్టబడాలి; అది పాపపరిహారబలి. 10పెయ్య బూడిదను పోగుచేసిన వ్యక్తి కూడా తన బట్టలు ఉతుక్కోవాలి, అతడు సాయంత్రం వరకు అపవిత్రునిగా ఉంటాడు. ఇది ఇశ్రాయేలీయులకు, వారి మధ్య నివసిస్తున్న విదేశీయులకు నిత్య కట్టుబాటుగా ఉంటుంది.
11“మానవ శవాన్ని ఎవరైనా తాకితే వారు ఏడు రోజులు అపవిత్రులై ఉంటారు. 12వారు మూడవ రోజు, ఏడవ రోజు తమను తాము శుద్ధి చేసుకోవాలి; అప్పుడు వారు శుద్ధులవుతారు. అయితే వారు మూడవ రోజు, ఏడవ రోజు శుద్ధి చేసుకోకపోతే అపవిత్రంగానే ఉంటారు. 13ఒక మనుష్యుని మృతదేహాన్ని తాకిన తర్వాత తమను తాము శుద్ధి చేసుకోకపోతే, యెహోవా సమావేశ గుడారాన్ని అపవిత్రం చేసినవారవుతారు. అలాంటి వారిని ఇశ్రాయేలు నుండి బహిష్కరించాలి. ఎందుకంటే, శుద్ధి జలం వారి మీద చిలకరింపబడలేదు, వారు అపవిత్రులుగా ఉన్నారు. వారి అపవిత్రత వారి మీద ఉంటుంది.
14“ఇదీ గుడారంలో మనుష్యులెవరైనా చనిపోతే దానికి సంబంధించిన నియమం: ఎవరైనా డేరాలో ప్రవేశిస్తే, దానిలో ఉంటే, వారు ఏడు రోజులపాటు అపవిత్రులుగా ఉంటారు. 15మూత పెట్టి ఉంచని ప్రతి పాత్ర అపవిత్రమే.
16“ఎవరైనా బయట ఉన్నప్పుడు ఖడ్గం చేత చంపబడిన వారిని లేదా సహజ మరణం పొందినవారిని, లేదా మానవుల ఎముకలు కానీ, సమాధి కానీ ముట్టుకుంటే, వారు ఏడు రోజులు అపవిత్రులుగా ఉంటారు.
17“ఎందుకంటే అపవిత్రమైన వ్యక్తి కోసం, కాల్చబడిన పాపపరిహారబలి యొక్క బూడిద కొంత పాత్రలో వేసి, వాటి మీద పారే తాజా నీరు పొయ్యాలి. 18అప్పుడు ఆచార ప్రకారం పవిత్రంగా ఉన్న వ్యక్తి కొంత హిస్సోపు తీసుకుని, నీటిలో ముంచి గుడారం అన్ని అలంకరణలు అక్కడ ఉన్న ప్రజలను చిలకరించాలి. అతడు మానవ ఎముక లేదా సమాధిని తాకిన వారి మీద లేదా చంపబడిన ఎవరైనా లేదా సహజ మరణం పొందినవారి మీద కూడా చిలకరించాలి. 19పవిత్రుడైన పురుషుడు అపవిత్రుల మీద మూడవ రోజు, ఏడవ రోజు చిలకరించాలి, ఏడవ రోజు వారిని పవిత్రపరచాలి. పవిత్రపరచబడే వారు వారి బట్టలు ఉతుక్కుని నీటితో స్నానం చేయాలి, ఆ సాయంత్రం వారు శుద్ధులవుతారు. 20కానీ అపవిత్రులైనవారు తమను తాము శుద్ధి చేసుకోకపోతే, వారు సమాజం నుండి బహిష్కరించబడాలి, వారు యెహోవా పరిశుద్ధాలయాన్ని అపవిత్ర పరిచిన వారు. శుద్ధి జలం వారి మీద చిలకరింపబడలేదు కాబట్టి వారు అపవిత్రులు. 21ఇది వారికి నిత్య కట్టుబాటుగా ఉంటుంది.
“శుద్ధి జలం చిలకరించు పురుషుడు కూడా తన బట్టలు ఉతుక్కోవాలి. ఎవరైనా శుద్ధి జలం తాకితే సాయంత్రం వరకు వారు అపవిత్రులు. 22అపవిత్రమైనవారు ఏది ముట్టిన అది అపవిత్రమే, ఎవరైనా దానిని ముట్టుకుంటే సాయంత్రం వరకు వారు అపవిత్రులుగా ఉంటారు.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
సంఖ్యా 19: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapistaging.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fte.png&w=128&q=75)
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.