కీర్తనలు 56
56
కీర్తన 56
సంగీత దర్శకునికి. “దూరపు సింధూర వృక్షాల మీద ఉన్న ఒక పావురం” అనే రాగం మీద పాడదగినది. శ్రేష్ఠమైన దావీదు కీర్తన. ఫిలిష్తీయులు దావీదును గాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించినది.
1నా దేవా! నాపై దయ చూపండి,
ఎందుకంటే నా శత్రువులు వేగంగా వెంటాడుతున్నారు;
రోజంతా వారు తమ దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు.
2నా విరోధులు రోజంతా నన్ను వెంటాడుతున్నారు;
వారి అహంకారంలో అనేకులు నా మీద దాడి చేస్తున్నారు.
3నాకు భయం వేసినప్పుడు, నేను మీయందు నమ్మకం ఉంచుతాను.
4దేవునిలో ఆయన వాగ్దానాన్ని కీర్తిస్తాను
దేవునిలో నేను నమ్ముతాను భయపడను.
మానవమాత్రులు నన్నేమి చేయగలరు?
5రోజంతా వారు నా మాటలను వక్రీకరిస్తారు;
వారి పథకాలన్నీ నా పతనం కొరకే.
6నా ప్రాణం తీయాలనే ఆశతో
వారు కుట్ర చేస్తారు, పొంచి ఉంటారు,
నా కదలికలు గమనిస్తారు.
7వారి దుష్టత్వాన్ని బట్టి వారు తప్పించుకోనివ్వకండి;
దేవా, మీ కోపంలో వారి దేశాలను కూలద్రోయండి.
8నా బాధలను లెక్కించండి;
నా కన్నీటిని మీ తిత్తిలో నింపండి
అవి మీ గ్రంథంలో వ్రాయబడలేదా?
9నేను మీకు మొరపెట్టినప్పుడు
నా శత్రువులు వెనుకకు తగ్గుతారు.
దాన్ని బట్టి దేవుడు నా పక్షాన ఉన్నాడు అని నేను తెలుసుకుంటాను.
10దేవునిలో, ఆయన వాగ్దానాన్ని స్తుతిస్తాను,
అవును, యెహోవాయందు, ఆయన వాగ్దానాన్ని కీర్తిస్తాను.
11నేను దేవునిలో నమ్ముకున్నాను నేను భయపడను.
మనుష్యులు నన్నేమి చేయగలరు?
12నా దేవా, నేను మీకు మ్రొక్కుబడులను చెల్లించాల్సి ఉంది;
నా కృతజ్ఞత అర్పణలను మీకు చెల్లిస్తాను.
13ఎందుకంటే మీరు మరణం నుండి నన్ను విడిపించారు
తొట్రిల్లకుండ నా పాదాలను
దేవుని ఎదుట నేను జీవపువెలుగులో
నడవడానికి శక్తినిచ్చారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 56: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.