రోమా పత్రిక 2

2
న్యాయమైన దేవుని తీర్పు
1ఇతరులకు తీర్పు తీర్చే వారెవరైనా సరే తప్పించుకునే అవకాశం లేదు. మీరు ఏ విషయంలో ఇతరులకు తీర్పు తీరుస్తున్నారో ఆ విషయంలో మీకు మీరే తీర్పు తీర్చుకుంటున్నారు, ఎందుకంటే తీర్పు తీరుస్తున్న మీరు కూడా అవే పనులు చేస్తున్నారు. 2అలాంటి కార్యాలు చేసేవారి పట్ల సత్యాన్ని అనుసరించి దేవుని తీర్పు ఉంటుందని మనకు తెలుసు. 3కాబట్టి అలాంటివి చేసేవారికి తీర్పు తీరుస్తూ వాటినే చేస్తూ ఉన్న సాధారణ మనుష్యులైన మీరు దేవుని తీర్పును తప్పించుకోగలరని అనుకుంటున్నారా? 4దేవుని దయ మిమ్మల్ని పశ్చాత్తాపం వైపు నడిపిస్తుందని తెలియక ఆయన దయ, సహనం, ఓర్పు అనే ఐశ్వర్యాన్ని త్రోసివేస్తారా?
5అయితే మీ మొండితనం, పశ్చాత్తాపంలేని హృదయాన్నిబట్టి దేవుని న్యాయమైన తీర్పు తీర్చబడే దేవుని ఉగ్రత దినాన దేవుని ఉగ్రతను మీకు మీరే పోగు చేసుకుంటున్నారు. 6దేవుడు “వారందరికి వారు చేసిన కార్యాలను బట్టి ప్రతిఫలమిస్తారు.”#2:6 కీర్తన 62:12; సామెత 24:12 7పట్టువదలకుండా మంచిని చేస్తూ మహిమ, ఘనత, నిత్యత్వాన్ని వెదికేవారికి ఆయన నిత్యజీవాన్ని ఇస్తారు. 8కానీ స్వలాభాన్ని చూసుకుంటూ సత్యాన్ని తిరస్కరించి చెడ్డపనులను చేసేవారి మీదికి దేవుని కోపం, ఉగ్రత వస్తుంది. 9చెడు చేసే ప్రతీ వ్యక్తికి అనగా మొదట యూదులకు, తర్వాత యూదేతరులకు ఇబ్బంది, బాధ ఉంటుంది; 10అయితే మంచి పనులు చేసే వారందరికి అనగా మొదట యూదులకు తర్వాత యూదేతరులకు మహిమ, ఘనత, సమాధానాలు కలుగుతాయి. 11ఎందుకంటే దేవుడు పక్షపాతం చూపించరు.
12ధర్మశాస్త్రం లేకుండా పాపం చేసిన వారందరు ధర్మశాస్త్రం లేకుండానే నశిస్తారు. ధర్మశాస్త్రం క్రింద ఉండి పాపం చేసేవారు ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పుపొందుతారు. 13ఎందుకంటే, ధర్మశాస్త్రాన్ని వినేవారు దేవుని దృష్టిలో నీతిమంతులు కారు కాని దానికి లోబడేవారే నీతిమంతులుగా ప్రకటించబడతారు. 14ధర్మశాస్త్రం లేని యూదేతరులు స్వతహాగా ధర్మశాస్త్రానికి సంబంధించిన పనులు చేస్తే, వారు ధర్మశాస్త్రం లేనివారైనప్పటికీ, తమకు తామే ధర్మశాస్త్రంగా ఉన్నారు. 15ధర్మశాస్త్ర సారం తమ హృదయాల మీద రాసి ఉన్నట్లుగా వారు చూపిస్తారు. అలాంటివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిస్తుంది. వారి ఆలోచనలు కొన్ని సమయాల్లో వారిని నిందిస్తాయి మరికొన్ని సమయాల్లో వారిని కాపాడతాయి. 16నా సువార్తలో చెప్పిన ప్రకారం, దేవుడు యేసు క్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యాలను తీర్పు తీర్చే దినాన ఇలా జరుగుతుంది.
యూదులు, ధర్మశాస్త్రం
17ఒకవేళ మిమ్మల్ని మీరు యూదులుగా పిలుచుకుంటూ, మీరు ధర్మశాస్త్రం మీద ఆధారపడుతూ దేవునిలో అతిశయిస్తున్నట్లయితే; 18మీరు ఆయన చిత్తాన్ని తెలుసుకొని, ఉన్నతమైనదాన్ని ఆమోదిస్తే, మీరు ధర్మశాస్త్రం యొక్క ఉపదేశం వల్లనే. 19మీరు గ్రుడ్డివారికి మార్గదర్శి అని, చీకటిలో ఉన్నవారికి వెలుగు అని మీకు నమ్మకం ఉంటే, 20చీకటిలో ఉన్నవారికి వెలుగు అని, మూర్ఖులకు బోధకులు అని, చిన్న పిల్లలకు గురువులు అని మీకు మీరు అనుకుంటే, ఎందుకంటే ధర్మశాస్త్రంలో జ్ఞానం సత్యం మిళితమై ఉన్నాయి 21అలాంటప్పుడు ఇతరులకు బోధించే మీరు, మీకు మీరు బోధించుకోరా? దొంగతనం చేయవద్దని ప్రకటిస్తున్న మీరే దొంగతనం చేస్తారా? 22వ్యభిచరించవద్దు అని ప్రజలకు చెప్పే మీరే వ్యభిచరిస్తారా? విగ్రహాలను అసహ్యించుకునే మీరే గుళ్లను దోచుకుంటారా? 23ధర్మశాస్త్రాన్ని బట్టి అతిశయించే మీరే ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తూ దేవున్ని అవమానిస్తారా? 24“నిన్ను బట్టే దేవుని నామం యూదేతరుల మధ్య దూషించబడుతుంది”#2:24 యెషయా 52:5; యెహె 36:20,22 అని లేఖనాల్లో వ్రాయబడి ఉంది.
25మీరు ధర్మశాస్త్రాన్ని పాటిస్తేనే సున్నతికి విలువ ఉంటుంది గాని మీరు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తే, మీరు సున్నతి చేయబడని వారుగా అయ్యారు. 26అలా అని సున్నతి పొందనివారు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే, వారు సున్నతి చేయబడినవారిగా ఎంచబడరా? 27శారీరకంగా సున్నతి పొందకపోయినా ధర్మశాస్త్రం ప్రకారం జీవిస్తున్నవారు, ధర్మశాస్త్రాన్ని సున్నతిని కలిగి ఉన్నప్పటికీ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా జీవిస్తున్న మీకు తీర్పు తీరుస్తారు.
28పైకి మాత్రమే యూదులైనవారు నిజంగా యూదులు కారు; శరీరంలో బాహ్యంగా పొందిన సున్నతి నిజంగా సున్నతి కాదు. 29అయితే అంతరంగంలో కూడా యూదులుగా ఉన్నవారే యూదులు. ఆత్మ వలన హృదయం పొందే సున్నతియే సున్నతి అవుతుంది కాని వ్రాయబడిన నియమాల ప్రకారం పొందింది కాదు. అలాంటి వారికి ఘనత మనుష్యుల నుండి కాదు గాని దేవుని నుండే కలుగుతుంది.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

రోమా పత్రిక 2: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి