రోమా పత్రిక 7

7
ధర్మశాస్త్రం నుండి విడుదల, క్రీస్తుతో బంధం
1సహోదరి సహోదరులారా, ధర్మశాస్త్రాన్ని ఎరిగినవారితో నేను మాట్లాతున్నాను. ఒక మనిషి జీవించి ఉన్నంత వరకు మాత్రమే ధర్మశాస్త్రానికి అతనిపై అధికారం ఉంటుందని మీకు తెలుసా? 2ఉదాహరణకు, ఒక వ్యక్తిని పెళ్ళి చేసుకున్న స్త్రీ ఆ వ్యక్తి బ్రతికి ఉన్నంత వరకు అతనితో బంధం కలిగి ఉంటుంది గాని భర్త చనిపోతే అతనితో ఆమెకు బంధాన్ని ఏర్పరచిన ధర్మం నుండి ఆమె విడుదల పొందుతుంది. 3అయితే ఆమె తన భర్త బ్రతికి ఉండగానే మరొక వ్యక్తితో శారీరక సంబంధాన్ని కలిగి ఉంటే ఆమె వ్యభిచారిణి అవుతుంది. ఒకవేళ ఆమె భర్త చనిపోతే ఆ ధర్మం నుండి ఆమె విడుదల పొందుకున్నది కాబట్టి ఆమె మరొక వ్యక్తిని పెళ్ళి చేసుకుంటే ఆమె వ్యభిచారిణి కాదు.
4కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవుని కోసం ఫలించేలా, మరణించి సజీవంగా తిరిగి లేచిన క్రీస్తును చేరుకునేలా మీరు కూడా క్రీస్తు శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయమై మరణించారు. 5మనం శరీర సంబంధులుగా#7:5 శరీర సంబంధులుగా ఈ సందర్భాలలో గ్రీకు పదం మానవుల పాపస్ధితిని తెలియచేస్తుంది. మనం ఉన్నప్పుడు ధర్మశాస్త్రం వలన కలిగే పాప ఆలోచనలు మనలో పని చేస్తున్నాయి కాబట్టి మనం మరణాన్ని ఫలంగా పొందుకుంటున్నాము. 6కాని ఇప్పుడు, మనల్ని బంధించి ఉంచిన దాని విషయమై చనిపోయి, ధర్మశాస్త్రం నుండి విడుదలను పొందాము కాబట్టి, వ్రాయబడి ఉన్న నియమం ప్రకారం కాకుండా ఆత్మానుసారమైన నూతన మార్గంలో మనం సేవిస్తాము.
ధర్మశాస్త్రం, పాపం
7అయితే మనం ఏమనాలి? ధర్మశాస్త్రాన్ని పాపమనా? కానే కాదు! ఒకవేళ ధర్మశాస్త్రం లేకపోతే పాపం అంటే ఏమిటో నాకు తెలిసేది కాదు. “మీరు ఆశించకూడదు”#7:7 నిర్గమ 20:17; ద్వితీ 5:21 అని ధర్మశాస్త్రం చెప్పకపోతే ఆశించడం అంటే ఏమిటో నిజంగా నాకు తెలిసేది కాదు. 8అయితే పాపం ఆజ్ఞను ఆధారం చేసుకుని నాలో అన్ని రకాల దురాశలను పుట్టించింది. ధర్మశాస్త్రం లేకపోతే పాపం మరణిస్తుంది. 9ఒకప్పుడు ధర్మశాస్త్రం లేకపోయిన నేను సజీవంగానే ఉన్నాను, అయితే ఆజ్ఞలు ఇవ్వబడినప్పుడు పాపం జీవంలోనికి వచ్చింది, నేను మరణించాను. 10జీవాన్ని ఇవ్వడానికి ఉద్దేశించబడిన ఆ ఆజ్ఞలే మరణాన్ని తీసుకువచ్చాయని నేను తెలుసుకున్నాను. 11అయితే పాపం ఆజ్ఞను ఆధారం చేసుకుని నన్ను మోసగించి ఆ ఆజ్ఞల ద్వారానే నన్ను మరణానికి గురిచేసింది. 12కాబట్టి ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది. ఆజ్ఞలు పరిశుద్ధమైనవి, నీతి కలిగినవి, మంచివి.
13అయితే మంచిది నాకు మరణాన్ని తీసుకువచ్చిందా? ఎన్నడు కాదు! అయితే, పాపం మంచిని ఉపయోగించి నాకు మరణాన్ని తెచ్చింది. పాపాన్ని పాపంగా చూపించే క్రమంలో ఆజ్ఞల ద్వారా పాపం మరింత పాపపూరితమైనది.
14ధర్మశాస్త్రం ఆత్మకు సంబంధించిందని మనకు తెలుసు, కాని నేను ఆత్మహీనుడను కాబట్టి పాపానికి దాసునిగా అమ్ముడుపోయాను. 15నేను చేసిన దానిని నేను గ్రహించలేదు. నేను చేయాలనుకున్న దానిని చేయలేదు కాని దేనిని ద్వేషిస్తానో దానినే చేశాను. 16చేయకూడదని అనుకున్నా దానినే నేను చేస్తే, ధర్మశాస్త్రం మంచిదని నేను ఒప్పుకుంటాను. 17ఇదంతా చేస్తున్నది నేను కాదు నాలో నివసిస్తున్న పాపమే. 18నాకున్న పాప స్వభావాన్ని#7:18 లేదా శరీరాన్ని బట్టి మంచిది ఏదీ నాలో నివసించదని నాకు తెలుసు కాబట్టి, మంచి చేయాలనే కోరిక నాకు ఉన్నప్పటికీ దానిని నేను చేయలేకపోతున్నాను. 19నేను చేయాలనుకున్న మంచిని చేయడం లేదు కాని, చేయకూడదని అనుకుంటున్న చెడునే నేను చేస్తున్నాను. 20అయితే ఇప్పుడు నేను చేయకూడదని అనుకుంటున్న దానిని నేను చేస్తే, అలా చేస్తున్నది నేను కాదు నాలో నివసిస్తున్న పాపమే.
21కాబట్టి నేను మంచి చేయాలని అనుకుంటున్నప్పటికి నాలో చెడు ఉందనే నియమాన్ని నేను గమనించాను. 22నా అంతరంగాన్ని బట్టి దేవుని ధర్మశాస్త్రంలో నేను ఆనందిస్తున్నాను. 23కాని మరొక నియమం నాలో ఉన్నట్లు నాకు కనబడుతుంది. అది నా మనస్సులోని నియమంతో పోరాడుతూ నాలో పని చేస్తున్న పాపనియమానికి నన్ను బందీగా చేస్తుంది. 24నేను ఎంత దౌర్భాగ్యుడిని! మరణానికి బందీగా ఉన్న నా శరీరం నుండి నన్ను ఎవరు రక్షించగలరు? 25మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నాకు విడుదలను ఇచ్చే దేవునికి వందనాలు!
అయితే నా మనస్సులో నేను దేవుని ధర్మశాస్త్రానికి దాసుడను, కాని నాకున్న పాప స్వభావంలో#7:25 లేదా శరీరంలో నేను పాపనియమానికి దాసుడను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

రోమా పత్రిక 7: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి