తీతు పత్రిక 3

3
రక్షించబడిందే మంచి చేయడానికి
1పరిపాలకులకు అధికారులకు లోబడుతూ విధేయత కలిగి మంచి పనులను చేయడానికి సిద్ధంగా ఉండాలని, 2ఎవరినీ నిందించకూడదని, శాంతియుతంగా వివేకం కలిగి ఉండాలని, అందరి పట్ల ఎల్లప్పుడూ సౌమ్యంగా మెలగాలని ప్రజలకు జ్ఞాపకం చేయి.
3ఒకప్పుడు మనం కూడా అవివేకులుగా, అవిధేయులుగా, మోసపోయిన వారిగా అన్ని రకాల వ్యామోహాలకు సుఖాలకు బానిసలుగా ఉన్నాము. మనం ఓర్వలేనితనంతో, అసూయతో, ద్వేషింపబడుతూ ఒకరిని ఒకరం ద్వేషిస్తూ జీవించాము. 4మన రక్షకుడైన దేవుడు తన దయ ప్రేమను వెల్లడి చేసినప్పుడు, 5ఆయన మనల్ని రక్షించారు, మనం చేసిన నీతిపనులను బట్టి కాదు కాని, తన కనికరం చేతనే మనం రక్షించబడ్డాము. ఆయన మన పాపాలను కడిగి, పరిశుద్ధాత్మ ద్వారా మనకు క్రొత్త జన్మనిచ్చి క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు. 6ఆయన మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా మనపై ధారాళంగా ఆత్మను కుమ్మరించాడు. 7ఆయన కృప వల్ల మనల్ని నీతిమంతులుగా ప్రకటించి, మనం నిత్యజీవాన్ని పొందుతామని నమ్మకాన్ని ఇచ్చాడు. 8ఇది నమ్మదగిన మాట. కాబట్టి దేవుని నమ్మినవారు మంచి పనులను చేయడానికి శ్రద్ధతో పూనుకొనేలా నీవు ఈ విషయాలను మరింత గట్టిగా బోధించాలని చెప్తున్నాను. ఇవి ఉత్తమమైనవి, అందరికి ప్రయోజనకరమైనవి.
9అయితే మూర్ఖమైన వివాదాలకు, వంశావళులకు, ధర్మశాస్త్రానికి సంబంధించిన వాదాలకు కలహాలకు దూరంగా ఉండు, ఎందుకంటే అవి నిష్ఫలమైనవి వ్యర్థమైనవి. 10విభజనలు కలిగించేవారిని మొదటిసారి గద్దించు, రెండవసారి హెచ్చరించు. ఆ తర్వాత వారిని వదిలేయి. 11అలాంటివారు చెడిపోయినవారు, పాపాత్ములు; వారు తమను తామే నిందించుకుంటారని నీకు ఖచ్చితంగా తెలుసు.
తుది హెచ్చరికలు
12నేను నికొపోలిలో శీతాకాలం గడపాలని అనుకుంటున్నాను, కాబట్టి నేను ఆర్తెమాను లేదా తుకికును నీ దగ్గరకు పంపిన వెంటనే నీవు బయలుదేరి నికొపోలిలో నా దగ్గరకు రావడానికి సిద్ధంగా ఉండు. 13న్యాయవాది జేనాసు అపొల్లోను జాగ్రత్తగా పంపించు, వారి ప్రయాణానికి కావలసినవన్ని సమకూర్చి తగిన సహాయం చేయి.
14మన ప్రజలు నిష్ఫలమైన జీవితాలను జీవించకుండా అవసరాలకు తగినట్లు మంచి పనులు చేయడంలో శ్రద్ధ వహించడం నేర్చుకోవాలి.
15నాతో ఉన్నవారందరు నీకు శుభాలు తెలియజేస్తున్నారు.
విశ్వాసాన్నిబట్టి మమ్మల్ని ప్రేమించేవారందరికి మా వందనాలు తెలియజేయి.
దేవుని కృప మీ అందరితో ఉండును గాక.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

తీతు పత్రిక 3: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి