మత్తయి 4:1-11

మత్తయి 4:1-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అప్పుడు యేసు అపవాదిచేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. నలువది దినములు నలువదిరాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయనయొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు మనెను అందుకాయన –మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను. అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసికొనిపోయి, దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి –నీవు దేవుని కుమారుడ వైతే క్రిందికి దుముకుము – ఆయన నిన్నుగూర్చి తన దూతల కాజ్ఞాపించును, నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు – ప్రభు వైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడియున్నదని వానితో చెప్పెను. మరల అపవాది మిగుల ఎత్తయిన యొక కొండమీదికి ఆయనను తోడుకొనిపోయి, యీ లోక రాజ్యములన్నిటిని, వాటి మహిమను ఆయనకు చూపి –నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినయెడల వీటినన్నిటిని నీకిచ్చెదనని ఆయనతో చెప్పగా యేసు వానితో–సాతానా, పొమ్ము – ప్రభు వైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదనెను. అంతట అపవాది ఆయ నను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి.

షేర్ చేయి
Read మత్తయి 4

మత్తయి 4:1-11 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ చేత అరణ్యంలోనికి నడిపించబడ్డారు. నలభై రాత్రింబగళ్ళు ఉపవాసం ఉన్న తర్వాత, ఆయనకు ఆకలివేసింది. శోధకుడు యేసు దగ్గరకు వచ్చి, “నీవు దేవుని కుమారుడవైతే, ఈ రాయిని రొట్టెగా మారమని చెప్పు” అని అన్నాడు. అందుకు యేసు, “ ‘మనుష్యులు కేవలం ఆహారం వల్లనే జీవించరు, కాని దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తారు’ అని వ్రాయబడి ఉంది” అని జవాబిచ్చారు. అప్పుడు అపవాది ఆయనను పవిత్ర పట్టణానికి తీసుకొనివెళ్ళి అక్కడ దేవాలయ శిఖరం మీద నిలబెట్టి, “నీవు దేవుని కుమారుడవైతే, క్రిందికి దూకు, ఎందుకంటే ఇలా వ్రాయబడి ఉంది: “ ‘నీ గురించి ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తారు, నీ పాదాలకు ఒక రాయి కూడా తగలకుండ, వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకొంటారు,’” అని అన్నాడు. అందుకు యేసు వానితో, “ ‘నీ ప్రభువైన దేవుని పరీక్షించకూడదు’ అని కూడా వ్రాయబడి ఉంది” అని అన్నారు. మరల, అపవాది ఆయనను చాలా ఎత్తైన ఒక కొండ మీదికి తీసుకువెళ్లి ప్రపంచంలోని రాజ్యాలన్నిటిని వైభవాన్ని ఆయనకు చూపించాడు. వాడు యేసుతో, “నీవు నా ముందు తలవంచి నన్ను ఆరాధిస్తే, వీటన్నిటిని నీకు ఇస్తాను” అన్నాడు. అందుకు యేసు, “సాతానా! నా దగ్గర నుండి వెళ్లిపో! ఎందుకంటే, నీ ప్రభువైన దేవుణ్ణి ఆరాధించాలి, ఆయనను మాత్రమే సేవించాలి అని వ్రాయబడి ఉంది” అని చెప్పారు. అప్పుడు అపవాది ఆయనను విడిచి వెళ్లిపోయాడు, దూతలు వచ్చి ఆయనకు సేవ చేశారు.

షేర్ చేయి
Read మత్తయి 4

మత్తయి 4:1-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అప్పుడు అపవాది వల్ల యేసును విషమ పరీక్షలకు గురి చేయడానికి ఆత్మ ఆయనను అరణ్యంలోకి తీసుకు వెళ్ళాడు. నలభై రోజులు ఉపవాసం ఉన్న తరువాత ఆయనకు ఆకలి వేసింది. శోధకుడు ఆయన దగ్గరికి వచ్చి, “నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలైపోవాలని ఆజ్ఞాపించు” అన్నాడు. అందుకు ఆయన “మనిషి కేవలం ఆహారంతోనే బతకడు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్లా బతుకుతాడు, అని రాసి ఉంది” అన్నాడు. అప్పుడు అపవాది ఆయనను పవిత్ర నగరంలోకి తీసుకు పోయి, దేవాలయ శిఖరంపై నిలబెట్టి, “నీవు దేవుని కుమారుడివైతే కిందికి దూకు. ఎందుకంటే, ‘ఆయన నీ గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ పాదానికి రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల్లో ఎత్తి పట్టుకుంటారు’ అని రాసి ఉంది” అన్నాడు. అందుకు యేసు “‘ప్రభువైన నీ దేవుణ్ణి నీవు పరీక్షించకూడదు’ అని కూడా రాసి ఉంది” అని అతనితో అన్నాడు. అపవాది మళ్ళీ ఆయనను చాలా ఎత్తయిన కొండపైకి తీసుకు పోయి, ప్రపంచ రాజ్యాలను, వాటి వైభవాన్ని ఆయనకు చూపించాడు. “నీవు సాష్టాంగపడి నన్ను పూజిస్తే వీటన్నిటినీ నీకిస్తాను” అన్నాడు. అప్పుడు యేసు “సాతాన్! అవతలికి పో! ‘ప్రభువైన నీ దేవుణ్ణి మాత్రమే నువ్వు ఆరాధించాలి. ఆయన్నే నువ్వు సేవించాలి’ అని రాసి ఉంది” అన్నాడు. అప్పుడు అపవాది ఆయనను విడిచి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు ఉపచారం చేశారు.

షేర్ చేయి
Read మత్తయి 4

మత్తయి 4:1-11 పవిత్ర బైబిల్ (TERV)

ఆ తర్వాత సైతాను కలిగించే పరీక్షల్ని ఎదుర్కోవాలని పవిత్రాత్మ యేసును ఎడారి ప్రదేశానికి తీసుకు వెళ్ళాడు. అక్కడ యేసు నలభై రోజులు ఉపవాసం చేసాడు. ఆ తర్వాత ఆయనకు ఆకలి వేసింది. సైతాను ఆయన దగ్గరకు వచ్చి, “నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చు” అని అన్నాడు. యేసు సమాధానంగా, “‘మనుష్యులను బ్రతికించేది కేవలం ఆహారం మాత్రమే కాదు. కాని దేవుడు పలికిన ప్రతి మాటవలన బ్రతకగలడు’ అని వ్రాసారు” అని అన్నాడు. ఆ తర్వాత సైతాను ఆయన్ని పవిత్ర నగరానికి తీసుకు వెళ్ళాడు. అక్కడ దేవాలయం మీది ఒక ఎత్తైన స్థలంపై నిలుచో బెట్టి, “నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకు, ఎందుకంటే, ‘నీకు సహాయం చెయ్యమని, దేవుడు తన దూతల్ని ఆజ్ఞాపిస్తాడు. వాళ్ళు వచ్చి నీ పాదం ఏ రాయికీ తగలకుండా నిన్ను తమ హస్తాలతో ఎత్తి పట్టుకొంటారు,’ అని వ్రాసివుంది కదా!” అని అన్నాడు. యేసు వానితో, “‘నీ ప్రభువైన దేవుణ్ణి పరీక్షించరాదు!’ అని కూడా వ్రాసి వుంది” అని అన్నాడు. సైతాను ఆయన్ని ఎత్తైన ఒక పర్వతం మీదికి తీసుకు వెళ్ళి ఆయనకు ప్రపంచంలోని రాజ్యాలను, వాటి వైభవాన్ని చూపి, “నీవు నా ముందు మోకరిల్లి నన్ను పూజిస్తే వీటన్నిటిని నీకిస్తాను” అని అన్నాడు. యేసు: “సైతానా! నా ముందునుండి వెళ్ళిపో! ఎందుకంటే ‘నీ ప్రభువైన దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన సేవ మాత్రమే చెయ్యాలి!’ అని కూడా వ్రాసి ఉంది” అని అన్నాడు. అప్పుడు సైతాను ఆయన్ని వదిలి వెళ్ళిపొయ్యాడు. తర్వాత దేవదూతలు వచ్చి యేసుకు పరిచర్యలు చేసారు.

షేర్ చేయి
Read మత్తయి 4