ప్రకటన 4:1-11
ప్రకటన 4:1-11 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఆ తర్వాత, నేను చూస్తూ ఉండగా పరలోకంలో ఒక తలుపు తెరవబడి కనిపించింది. నేను మొదట విన్న బూరధ్వని వంటి స్వరం నాతో, “ఇక్కడకు ఎక్కి రా, తర్వాత జరగాల్సిన దాన్ని నేను నీకు చూపిస్తాను” అని చెప్పింది. వెంటనే నేను ఆత్మవశుడనై ఉండగా నా ముందు పరలోకంలో ఒక సింహాసనం, ఆ సింహాసనం మీద ఒకరు కూర్చుని ఉండడం చూశాను. అక్కడ సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి చూడడానికి సూర్యకాంత మణిలా కెంపులా మెరుస్తూ కనబడ్డాడు. ఆ సింహాసనం చుట్టూ మరకతంలా ప్రకాశిస్తున్న వానవిల్లు ఆవరించి ఉండింది. ఆ సింహాసనం చుట్టూ మరో ఇరవైనాలుగు సింహాసనాలు, వాటి మీద ఇరవైనలుగురు పెద్దలు కూర్చుని ఉన్నారు. వారు తెల్లని వస్త్రాలు ధరించుకొని తలల మీద బంగారు కిరీటాలు కలిగి ఉన్నారు. ఆ సింహాసనం నుండి మెరుపులు, ఉరుముల గొప్ప శబ్దాలు వచ్చాయి. ఆ సింహాసనం ముందు ఏడు దీపాలు వెలుగుతూ ఉన్నాయి. అవి దేవుని ఏడు ఆత్మలు. ఆ సింహాసనం ముందు స్ఫటికం లాంటి ఒక గాజు సముద్రం ఉంది. మధ్యభాగంలో, ఆ సింహాసనం చుట్టూ నాలుగు ప్రాణులు ఉన్నాయి. ఆ ప్రాణులకు ముందు వెనుక కళ్లు ఉన్నాయి. మొదటి ప్రాణి సింహంలా, రెండవ ప్రాణి దూడలా, మూడవ ప్రాణి ముఖం మనిషిలా, నాలుగవ ప్రాణి ఎగురుతున్న పక్షిరాజులా ఉన్నాయి. ఈ నాలుగు ప్రాణుల్లో ప్రతి ప్రాణికి ఆరు రెక్కలు ఉన్నాయి. వాటి చుట్టూ ఆ రెక్కల క్రింద కళ్లతో నిండి ఉన్నాయి. ఆ ప్రాణులు రాత్రింబగళ్ళు ఆపకుండా నిరంతరం ఇలా అంటున్నాయి: “గతంలో ప్రస్తుతంలో ఉన్నవాడు, రానున్నవాడైన, ‘సర్వశక్తిగల ప్రభువైన దేవుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు.’ ” ఆ ప్రాణులు సింహాసనం మీద ఆసీనుడై ఎల్లకాలం జీవిస్తున్న దేవాది దేవునికి మహిమ, ఘనత కృతజ్ఞతలు అర్పిస్తుండగా, ఇరవైనలుగురు పెద్దలు లేచి సింహాసనం మీద ఆసీనుడై ఎల్లకాలం జీవిస్తున్నవాని ముందు సాగిలపడి ఆరాధిస్తూ, గౌరవంతో తమ కిరీటాలు తీసి ఆ సింహాసనం ముందు వేసి ఇలా చెప్పారు: “ఓ ప్రభువా, మా దేవా! నీవు సమస్తాన్ని సృష్టించావు, నీ చిత్త ప్రకారమే అవి సృష్టించబడ్డాయి, కాబట్టి మహిమ, ఘనత, ప్రభావాలు పొందడానికి నీవే యోగ్యుడవు.”
ప్రకటన 4:1-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇదంతా జరిగాక నేను చూస్తూ ఉన్నాను. అప్పుడు పరలోకంలో ఒక తలుపు తెరుచుకుని ఉంది. నేను ఇంతకు ముందు విన్న స్వరం భేరీ నాదంలా నాతో మాట్లాడుతుంటే విన్నాను. ఆ స్వరం, “పైకి రా. తరువాత జరగాల్సినవి నీకు చూపిస్తాను” అని పలికింది. వెంటనే నేను ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళాను. అప్పుడు పరలోకంలో ఉన్న ఒక సింహాసనాన్నీ, ఆ సింహాసనంపై కూర్చున్న ఒక వ్యక్తినీ చూశాను. అలా కూర్చున్న వ్యక్తి చూడడానికి సూర్యకాంత మణిలాగా కెంపులాగా ఉన్నాడు. ఆ సింహాసనం చుట్టూ మరకతంలా ప్రకాశిస్తూ ఒక ఇంద్రధనుస్సు ఆవరించి ఉంది. ఆ సింహాసనం చుట్టూ ఇరవై నాలుగు వేరే సింహాసనాలున్నాయి. వాటి మీద ఇరవై నలుగురు పెద్దలు కూర్చుని ఉన్నారు. వీరంతా తెల్లటి బట్టలు కట్టుకుని ఉన్నారు. వారి తలలపై బంగారు కిరీటాలున్నాయి. ఆ సింహాసనం నుండి మెరుపులు, శబ్దాలు, ఉరుములు వస్తున్నాయి. సింహాసనం ముందు ఏడు దీపాలు వెలుగుతూ ఉన్నాయి. అవి దేవుని ఏడు ఆత్మలు. ఆ సింహాసనం ఎదురుగా స్ఫటికంలాటి సముద్రంలాటిది ఉంది. ముందూ వెనకా కళ్ళు ఉన్న నాలుగు ప్రాణులు సింహాసనం చుట్టూ ఉన్నాయి. మొదటి ప్రాణి సింహంలా ఉంది. రెండవది దూడలా ఉంది. మూడవ ప్రాణికి మనిషి ముఖంలాటి ముఖం ఉంది. నాలుగవ ప్రాణి ఎగురుతూ ఉన్న డేగలా ఉంది. ఈ నాలుగు ప్రాణుల్లో ప్రతి ప్రాణికీ ఆరు రెక్కలున్నాయి. వాటి చుట్టూ, లోపలా, రెక్కల లోపల కూడా కళ్ళతో నిండి ఉన్నాయి. అవి పగలూ రాత్రీ మానకుండా ఈ విధంగా చెబుతున్నాయి, “పూర్వం ఉండి, ప్రస్తుతముంటూ, భవిష్యత్తులో వచ్చేవాడూ, అంతటినీ పరిపాలించే వాడూ, దేవుడూ అయిన ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు!” ఆ ప్రాణులు సింహాసనంపై కూర్చుని శాశ్వతంగా జీవిస్తున్న వాడికి ఘనత, కీర్తి, కృతజ్ఞతలూ సమర్పిస్తూ ఉన్నప్పుడు ఆ ఇరవై నలుగురు పెద్దలూ సింహాసనంపై కూర్చున్న వాడి ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేశారు. వారు శాశ్వతంగా జీవిస్తున్న వాడికి మొక్కి, “మా ప్రభూ, మా దేవా, నువ్వు ఘనత, కీర్తి, ప్రభావాలు పొందడానికి అర్హుడివి. ఎందుకంటే నువ్వు సమస్తాన్నీ సృష్టించావు. నీ ఇష్టప్రకారమే అవి ఉనికిలో ఉన్నాయి” అని చెబుతూ తమ కిరీటాలను ఆ సింహాసనం ముందు వేశారు.
ప్రకటన 4:1-11 పవిత్ర బైబిల్ (TERV)
ఇది జరిగిన తర్వాత నేను కళ్ళెత్తి చూశాను. పరలోకంలో ఒక ద్వారం కనిపించింది. ఆ ద్వారము తెరుచుకొని ఉంది. బూర ఊదినట్లు యింతకు ముందు మాట్లాడిన స్వరం నాకు మళ్ళీ వినిపించింది. అది నాతో, “ఇలా మీదికి రా; దీని తర్వాత ఏమి జరుగుతుందో నీకు చూపిస్తాను” అని అంది. నేను వెంటనే పరిశుద్ధాత్మ ఆధీనమయ్యాను. పరలోకంలో ఉన్న సింహాసనం నాముందు కనిపించింది. దాని మీద ఎవరో కూర్చొని ఉన్నారు. దాని మీద కూర్చున్నవాడు సూర్యకాంతమణివలె, పద్మరాగమువలె వున్నాడు. ఆ సింహాసనం చుట్టూ మరకతమును పోలిన ఆకాశ ధనుస్సు ప్రకాశిస్తూ ఉంది. దాని చుట్టూ యిరవై నాలుగు యితర సింహాసనాలు ఉన్నాయి. వాటి మీద యిరవై నాలుగు మంది పెద్దలు కూర్చొని ఉన్నారు. వాళ్ళు తెల్లని దుస్తులు ధరించి ఉన్నారు. వాళ్ళ తలలపై బంగారు కిరీటాలు ఉన్నాయి. సింహాసనం నుండి మెరుపులువచ్చాయి. పెద్ద గర్జనలు ఉరుములు దాన్నుండి వినిపించాయి. ఆ సింహాసనం ముందు ఏడు దీపాలు దివ్యంగా వెలుగుతూ ఉన్నాయి. ఇవి దేవుని ఏడు ఆత్మలు. గాజుతో కప్పిన సముద్రంలా కనిపించే ఒక గాజు సముద్రం ఆ సింహాసనం ముందు కనిపించింది. అది స్ఫటికంలా నిర్మలంగా ఉంది. సింహాసనం మధ్య, చుట్టూ, అంటే ముందు, వెనుక నాలుగు ప్రాణులు ఉన్నాయి. వాటి దేహాలు ముందు, వెనుక కళ్ళతో కప్పబడి ఉన్నాయి. మొదటి ప్రాణి ఒక సింహంలా, రెండవది ఒక ఎద్దులా, మూడవది ఒక మనిషి ముఖంలా, నాలుగవది ఎగిరే పెద్ద పక్షిలా ఉన్నాయి. ప్రతి ప్రాణికి ఆరు రెక్కలు ఉన్నాయి. వాటి శరీరాలపైన, క్రింద కళ్ళతో పూర్తిగా కప్పబడి ఉన్నాయి. రెక్కల క్రింద కళ్ళతో కప్పబడి ఉన్నాయి. రాత్రింబవళ్ళు అవి విడువక: “భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్నవాడు, సర్వశక్తి సంపన్నుడును ప్రభువునైన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు” అని పాడుతూ ఉన్నాయి. సింహాసనంపై కూర్చొన్నవానికి, చిరకాలం జీవించేవానికి, మహిమ, గౌరవము కలగాలని అంటూ ఈ ప్రాణులు తమ కృతజ్ఞతలు తెలుపుతూ పాడాయి. అవి ఆ విధంగా పాడినప్పుడు ఆ యిరవై నాలుగు మంది పెద్దలు ఆ సింహాసనంపై కూర్చొన్నవానిముందు సాష్టాంగపడి చిరకాలం జీవించే ఆయన్ని స్తుతించారు. తమ కిరీటాల్ని సింహాసనం ముందువేసి, “మా ప్రభూ! దైవమా! నీవు తేజమును, గౌరవమును, శక్తిని పొందతగిన యోగ్యుడవు, నీవు అన్నిటినీ సృష్టించావు. అవి నీ యిష్టానుసారం సృష్టింపబడి జీవాన్ని పొందాయి”
ప్రకటన 4:1-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరువబడియుండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వనివలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడినవాడు– ఇక్కడికి ఎక్కిరమ్ము; ఇకమీదట జరుగవలసినవాటిని నీకు కనుపరచెదననెను వెంటనే నేను ఆత్మ వశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి యుండెను. సింహాసనమునందు ఒకడు ఆసీసుడై యుండెను, ఆసీనుడైనవాడు, దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు; మరకతమువలె ప్రకాశించు మేఘధనుస్సు సింహాసనమును ఆవరించియుండెను. సింహాసనముచుట్టు ఇరువది నాలుగు సింహాసనములుండెను, ఈ సింహాసనములందు ఇరువదినలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని, తమ తలలమీద సువర్ణ కిరీటములు పెట్టుకొన్నవారై కూర్చుండిరి. ఆ సింహాసనములోనుండి మెరుపులును ధ్వనులును ఉరుములును బయలు దేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి; అవి దేవుని యేడు ఆత్మలు. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజువంటి సముద్రమున్నట్టుండెను. ఆ సింహాసనమునకుమధ్యను సింహాసనము చుట్టును, ముందు వెనుక కన్నులతోనిండిన నాలుగు జీవులుండెను. మొదటి జీవి సింహమువంటిది; రెండవ జీవి దూడవంటిది; మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖముగలది; నాలుగవ జీవి యెగురుచున్న పక్షిరాజువంటిది. ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను, అవి చుట్టును రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి. అవి–భూతవర్తమాన భవిష్యత్కాలములలోఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అని మానక రాత్రింబగళ్లు చెప్పుచుండెను. ఆ సింహాసనమునందు ఆసీనుడైయుండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులును కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ యిరువది నలుగురు పెద్దలు సింహాసనమునందు ఆసీనుడైయుండువాని యెదుట సాగిలపడి, యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు– ప్రభువా , మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానినిబట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడవని చెప్పుచు, తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి.