రోమా 8:18-39

రోమా 8:18-39 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షతకొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి, నాశనమునకులోనయిన దాస్యములోనుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్యము పొందుదునను నిరీక్షణకలదై, స్వేచ్ఛగా కాక దానిని లోపరచినవాని మూలముగా వ్యర్థపరచ బడెను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదనపడుచునున్నదని యెరుగుదుము. అంతేకాదు, ఆత్మయొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడ దత్త పుత్రత్వముకొరకు, అనగా మన దేహముయొక్క విమోచనముకొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడునది కనబడునప్పుడు, నిరీక్షణతో పనియుండదు; తాను చూచుచున్న దానికొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడనిదాని కొరకు నిరీక్షించినయెడల ఓపికతో దానికొరకు కనిపెట్టుదుము. అటువలె ఆత్మ యు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనముచేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మయొక్క మనస్సు ఏదో యెరుగును; ఏలయనగా ఆయన దేవుని చిత్తప్రకారము పరిశుద్ధులకొరకు విజ్ఞాపనముచేయుచున్నాడు. దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మనపక్షముననుండగా మనకు విరోధియెవడు? తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవునిచేత ఏర్పరచబడిన వారిమీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చు వాడు దేవుడే; శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తుయేసే; అంతే కాదు, మృతులలోనుండి లేచినవాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనము కూడ చేయువాడును ఆయనే క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా– నిన్నుబట్టి దినమెల్ల మేము వధింపబడినవారము వధకు సిద్ధమైన గొఱ్ఱెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తుయేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను.

షేర్ చేయి
Read రోమా 8

రోమా 8:18-39 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

మనలో ప్రత్యక్షం కాబోయే మహిమతో ఇప్పుడు మనం అనుభవిస్తున్న శ్రమలు ఎంత మాత్రం పోల్చదగినవి కావని నేను భావిస్తాను. దేవుని బిడ్డలు ప్రత్యక్షపరచబడాలని సృష్టి అంతా ఆతురతతో ఎదురుచూస్తూ ఉంది. తన ఇష్ట ప్రకారం కాక దానిని అప్పగించినవాని చిత్తప్రకారం నిరాశకు గురైన సృష్టి నిరీక్షణ కలిగి ఉంది. సృష్టి, నశించిపోవడమనే దాస్యం నుండి విడిపించబడి, దేవుని బిడ్డల మహిమలోనికి స్వాతంత్ర్యంలోనికి తీసుకురాబడుతుందనే ఆ నిరీక్షణ. నేటి వరకు సృష్టి అంతా ప్రసవ వేదన పడుతున్నట్లుగా మూల్గుతున్నదని మనకు తెలుసు. అది మాత్రమే కాదు, ఆత్మలో ప్రథమ ఫలం పొందిన మనం కూడా దత్తపుత్రులంగా అవ్వడానికి మన శరీరాల విమోచన కోసం ఆతురతగా ఎదురుచూస్తూ మన లోలోపల మూలుగుతున్నాము. ఈ నిరీక్షణలోనే మనం రక్షించబడ్డాము. అయితే కనబడే నిరీక్షణ ఎంత మాత్రం నిరీక్షణ కాదు. తాము చూస్తున్న వాటికోసం ఎవరు నిరీక్షిస్తారు? అయితే మన దగ్గర లేని దాని కోసం మనం నిరీక్షిస్తే ఓపికగా ఎదురుచూడగలము. అదే విధంగా మన బలహీనతల్లో ఆత్మ మనకు సహాయం చేస్తాడు. దేని గురించి ప్రార్థించాలో మనకు తెలియదు కాని, మన కోసం ఆత్మ తానే మాటల్లేని మూల్గులతో విజ్ఞాపన చేస్తున్నాడు. మన హృదయాలను పరిశోధించే ఆయనకు ఆత్మ యొక్క మనస్సు తెలుసు, ఎందుకనగా దేవుని ప్రజల కోసం దేవుని చిత్తప్రకారం ఆత్మ విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని ప్రేమించేవారికి అనగా దేవుని ఉద్దేశం ప్రకారం పిలువబడిన వారి మంచి జరిగేలా అన్నిటిని దేవుడు జరిగిస్తారని మనకు తెలుసు. అనేకులైన సహోదరి సహోదరుల మధ్యలో ఆయన ప్రథమ సంతానంగా ఉండాలని దేవుడు తాను ముందుగానే ఎరిగినవారిని తన కుమారుని స్వరూపానికి అనుగుణంగా ఉండేలా వారిని ముందుగానే నిర్ణయించారు. ఎవరిని ముందుగా నిర్ణయించారో వారిని ఆయన పిలిచారు; ఆయన ఎవరిని పిలిచారో వారిని నీతిమంతులుగా తీర్చారు; ఆయన ఎవరిని నీతిమంతులుగా తీర్చారో వారిని మహిమపరిచారు. అయితే ఈ విషయాల గురించి మనమేమి చెప్పాలి? ఒకవేళ దేవుడే మన వైపు ఉండగా, మనకు విరోధి ఎవడు? దేవుడు తన సొంత కుమారుని ఇవ్వడానికి వెనుతీయక మనందరి కోసం ఆయనను అప్పగించినప్పుడు తన కుమారునితో పాటు మనందరికి అన్ని సమృద్ధిగా ఇవ్వకుండా ఎలా ఉండగలరు? దేవుడు ఏర్పరచుకున్నవారికి వ్యతిరేకంగా ఆరోపణ చేసేవారు ఎవరు? నీతిమంతులుగా తీర్చేవాడు దేవుడే కదా! అయితే శిక్షను విధించేవారు ఎవరు? సజీవంగా తిరిగి లేచి, దేవుని కుడి వైపున కూర్చుండి మన కోసం దేవుని వేడుకొనే యేసు క్రీస్తే తప్ప మరి ఎవరూ కాదు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వేరు చేయగలవారు ఎవరు? ఇబ్బందులు గాని, కష్టాలు గాని, కరువు గాని, వస్త్రహీనత గాని, ఆపద గాని, ఖడ్గం గాని మనల్ని వేరు చేయగలదా? లేఖనాల్లో ఇలా వ్రాయబడి ఉన్నది: “రోజంతా మీ కోసమే మరణ బాధ పడుతున్నాం; వధించ దగిన గొర్రెలమని మమ్మల్ని ఎంచుతున్నారు.” అయినా మనల్ని ప్రేమించినవాని ద్వారా మనం అన్ని విషయాల్లో జయించినవారి కన్నా అధికంగా ఉన్నాము. మరణమైనా జీవమైనా, దేవదూతలైనా దయ్యాలైనా, నేడైనా రేపైనా, ఎటువంటి శక్తులైనా, ఎత్తైనా లోతైనా, సృష్టిలో ఉన్న ఏదైనా మన ప్రభువైన క్రీస్తు యేసులో ఉన్న దేవుని ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేవని నేను ఒప్పుకుంటున్నాను.

షేర్ చేయి
Read రోమా 8

రోమా 8:18-39 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మనకు వెల్లడి కాబోయే మహిమతో ఇప్పటి కష్టాలు పోల్చదగినవి కావని నేను భావిస్తున్నాను. దేవుని కుమారులు వెల్లడయ్యే సమయం కోసం సృష్టి బహు ఆశతో ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే తన ఇష్టం చొప్పున కాక దాన్ని లోబరచినవాడి మూలంగా వ్యర్థతకు గురైన సృష్టి, నాశనానికి లోనైన దాస్యం నుండి విడుదల పొంది, దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వేచ్ఛ పొందుతాననే నిరీక్షణతో ఉంది. ఇప్పటి వరకూ సృష్టి అంతా ఏకగ్రీవంగా మూలుగుతూ ప్రసవ వేదన పడుతున్నదని మనకు తెలుసు. అంతే కాదు, ఆత్మ ప్రథమ ఫలాలను పొందిన మనం కూడా దత్తపుత్రత్వం కోసం, అంటే మన శరీర విమోచన కోసం కనిపెడుతూ లోలోపల మూలుగుతున్నాం. ఎందుకంటే మనం ఈ ఆశాభావంతోనే రక్షణ పొందాం. మనం ఎదురు చూస్తున్నది కనిపించినప్పుడు ఇక ఆశాభావంతో పని లేదు. తన ఎదురుగా కనిపించే దాని కోసం ఎవరు ఎదురు చూస్తాడు? మనం చూడని దాని కోసం ఎదురు చూసేవారమైతే ఓపికతో కనిపెడతాము. అలాగే పరిశుద్ధాత్మ కూడా మన బలహీనతలో సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే మనం సరిగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కాని, మాటలతో పలకడానికి వీలు లేని మూలుగులతో పరిశుద్ధాత్మ మన పక్షంగా వేడుకుంటున్నాడు. ఆయన దేవుని సంకల్పం ప్రకారం పవిత్రుల పక్షంగా వేడుకుంటున్నాడు. ఎందుకంటే హృదయాలను పరిశీలించే వాడికి ఆత్మ ఆలోచన ఏమిటో తెలుసు. దేవుణ్ణి ప్రేమించేవారికి, అంటే ఆయన తన సంకల్పం ప్రకారం పిలిచిన వారికి, మేలు కలిగేలా దేవుడు అన్నిటినీ సమకూర్చి జరిగిస్తాడని మనకు తెలుసు. ఎందుకంటే తన కుమారుడు అనేక సోదరుల్లో జ్యేష్ఠుడుగా ఉండాలని, దేవుడు ముందుగా ఎరిగిన వారిని, తన కుమారుణ్ణి పోలిన రూపం పొందడానికి ముందుగా నిర్ణయించాడు. ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని నిర్దోషులుగా ఎంచాడు. అంతే కాదు, ఎవరిని నిర్దోషులుగా ఎంచాడో వారిని మహిమ పరిచాడు. వీటిని గురించి మనమేమంటాం? దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుణ్ణి మనకీయడానికి సంకోచించక మనందరి కోసం ఆయనను అప్పగించిన దేవుడు ఆయనతోబాటు అన్నిటినీ మనకీయకుండా ఉంటాడా? దేవుడు ఏర్పరచుకున్న వారి మీద నేరారోపణ చేయగల వాడెవడు? నిర్దోషిగా ప్రకటించేవాడు దేవుడే. ఎవరు శిక్ష విధించ గలిగేది? క్రీస్తు యేసా? చనిపోయినవాడు, మరింత ప్రాముఖ్యంగా చనిపోయిన వారిలో నుండి లేచినవాడు, దేవుని కుడి పక్కన కూర్చుని ఉన్నవాడు, మన కోసం విజ్ఞాపన చేసేవాడు కూడా ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? కష్టాలు, బాధలు, హింసలు, కరువులు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం, ఇవి మనలను వేరు చేస్తాయా? దీన్ని గురించి ఏమని రాసి ఉందంటే, “నీ కోసం మేము రోజంతా వధకు గురౌతున్నాం. వధ కోసం సిద్ధం చేసిన గొర్రెలుగా మమ్మల్ని ఎంచారు.” అయినా వీటన్నిటిలో మనలను ప్రేమించినవాడి ద్వారా మనం సంపూర్ణ విజయం పొందుతున్నాం. నేను నిశ్చయంగా నమ్మేదేమంటే, చావైనా, బతుకైనా, దేవదూతలైనా, ప్రభుత్వాలైనా, ఇప్పుడున్నవైనా, రాబోయేవైనా, శక్తులైనా, ఎత్తయినా, లోతైనా, సృష్టిలోని మరేదైనా సరే, మన ప్రభు క్రీస్తు యేసులోని దేవుని ప్రేమ నుండి మనలను వేరు చేయలేవు.

షేర్ చేయి
Read రోమా 8

రోమా 8:18-39 పవిత్ర బైబిల్ (TERV)

మనకు వ్యక్తం కానున్న తేజస్సు, మనం ప్రస్తుతం అనుభవిస్తున్న కష్టాలకన్నా ఎన్నో రెట్లు గొప్పదని నా అభిప్రాయం. దేవుడు తన కుమారుల్ని బయలు పర్చాలని సృష్టి అంతా ఆతృతతో కాచుకొని ఉంది. సృష్టి నాశనంకు అప్పగింపబడింది. అయితే తన కోరిక ప్రకారం కాకుండా, దాన్ని లోబర్చిన వాని చిత్తప్రకారం నిరీక్షణలో అప్పగించబడింది. బానిసత్వంతో క్షీణించిపోతున్న ఈ సృష్టి ఒక రోజు విడుదలపొంది, దేవుని సంతానం అనుభవింపనున్న తేజోవంతమైన స్వేచ్ఛను అనుభవిస్తుందనే ఒక విశ్వాసం ఉంది. సృష్టి అంతా ప్రసవించునప్పుడు స్త్రీకి కలిగే బాధలాంటి నొప్పులతో మూలుగుతూ ఈనాటి వరకు బాధపడుతుందని మనకు తెలుసు. అంతేకాదు, దేవుని ఆత్మను మొదటి ఫలంగా పొందిన మనము కూడా మన మనస్సులో మూలుగుతున్నాము. మనం దత్త పుత్రులం కావాలనీ, మన శరీరాలకు విముక్తి కలగాలనీ ఆతృతతో కాచుకొని ఉన్నాము. మనం రక్షింపబడినప్పుడు ఈ నిరీక్షణ మనలో ఉంది. కాని విశ్వాసంతో ఎదురు చూస్తున్నది లభించిన తర్వాత దాని కోసం ఆశించవలసిన అవసరం ఉండదు. తన దగ్గరున్న దానికోసం ఎవరు ఎదురు చూస్తారు? కాని మన దగ్గర లేనిదాని కోసం ఆశిస్తే దానికోసం ఓర్పుతో నిరీక్షిస్తాము. అదే విధంగా మనం బలహీనులం కనుక, ఏ విధంగా ప్రార్థించాలో మనకు తెలియదు. కనుక, దేవుని ఆత్మ స్వయంగా మన పక్షాన మాటలు వ్యక్తపరచలేని మూలుగులతో దేవునికి తెలిపి మనకు సహాయపడుతున్నాడు. ఆయన దేవునితో తన ప్రజలకోసం ఆయన ఇచ్ఛానుసారం విన్నపం చేస్తున్నాడు. మన హృదయాలను పరిశోధించే దేవునికి ఆయన యొక్క ఆలోచనలు తెలుసు. దేవుడు తనను ప్రేమించే ప్రజల కోసం, తన ఉద్దేశానుసారం పిలువబడినవాళ్ళ కోసం ఆయన సమస్తము చేయుచున్నాడని మనకు తెలుసు. ఈ ప్రజల్ని దేవుడు తన ఉద్దేశానుసారంగా పిలిచాడు. దేవుడు తనకు ఇదివరకే తెలిసిన వాళ్ళను తన కుమారునిలా రూపొందించాలని ప్రత్యేకంగా ఉంచాడు. తనకు చాలామంది పుత్రులుండాలని, వాళ్ళలో యేసు మొట్ట మొదటి వానిగా ఉండాలని ఆయన ఉద్దేశ్యం. దేవుడు ఎవర్ని ప్రత్యేకంగా ఉంచాడో వాళ్ళను పిలిచాడు. ఎవర్ని పిలిచాడో వాళ్ళను నీతిమంతులుగా చేసాడు. ఎవర్ని నీతిమంతులుగా చేసాడో వాళ్ళతో తన మహిమను పంచుకొన్నాడు. మరి, మనము దీనికి ఏమి ప్రత్యుత్తరం ఇవ్వగలము? దేవుడే మనవైపు ఉన్నప్పుడు మనకు విరుద్ధంగా ఎవరుంటారు? మనందరికోసం, ఆయన తన స్వంత కుమారుణ్ణి ఇవ్వటానికి కూడా వెనుకాడలేదు. అలాంటప్పుడు తన కుమారునితో సహా అన్నీ మనకివ్వడా? దేవుడు ఎన్నుకొన్న వాళ్ళపై ఎవరు నేరం మోపుతారు? మనల్ని నీతిమంతులుగా చేసేవాడు దేవుడే. ఇక మనకు ఎవ్వరూ శిక్ష విధించలేరు. చనిపోయి బ్రతికి వచ్చిన యేసుక్రీస్తు దేవుని కుడిచేతి వైపు కూర్చొని మన పక్షాన వేడుకుంటున్నాడు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు దూరం చెయ్యగలరు? కష్టం, దుఃఖం, హింస, కరువు, దిగంబరత్వం, అపాయం, ఖడ్గం మనల్ని దూరం చెయ్యగలవా? దీన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది: “నీ కోసం దినమంతా మరణాన్ని ఎదుర్కొంటూ ఉన్నాము, మేము చంపబడనున్న గొఱ్ఱెల వలె ఉన్నాం.” ఈ విషయాలన్నిటిలో, మనల్ని ప్రేమించిన ఆయన ద్వారా సంపూర్ణ విజయాన్ని సాధించాము. చావుగాని, బ్రతుకుగాని, దేవదూతలుగాని, దయ్యాలుగాని, ప్రస్తుతంగాని, భవిష్యత్తుగాని, మరే శక్తులుగాని ఎత్తుగాని, అగాధంగాని, సృష్టిలో ఉన్న మరేదైనాగాని మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా మనకు లభిస్తున్న దేవుని ప్రేమనుండి మనల్ని విడదీయలేవని నేను ఖండితంగా చెప్పగలను.

షేర్ చేయి
Read రోమా 8

రోమా 8:18-39

రోమా 8:18-39 TELUBSI