రోమా 8:28-39

రోమా 8:28-39 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మనపక్షముననుండగా మనకు విరోధియెవడు? తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవునిచేత ఏర్పరచబడిన వారిమీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చు వాడు దేవుడే; శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తుయేసే; అంతే కాదు, మృతులలోనుండి లేచినవాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనము కూడ చేయువాడును ఆయనే క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా– నిన్నుబట్టి దినమెల్ల మేము వధింపబడినవారము వధకు సిద్ధమైన గొఱ్ఱెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తుయేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను.

షేర్ చేయి
Read రోమా 8

రోమా 8:28-39 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

దేవుని ప్రేమించేవారికి అనగా దేవుని ఉద్దేశం ప్రకారం పిలువబడిన వారి మంచి కొరకు అన్నిటిని దేవుడు జరిగిస్తారని మనకు తెలుసు. అనేకులైన సహోదరి సహోదరుల మధ్యలో ఆయన ప్రథమ సంతానంగా ఉండాలని దేవుడు తాను ముందుగానే ఎరిగినవారిని తన కుమారుని స్వరూపానికి అనుగుణంగా ఉండేలా వారిని ముందుగానే నిర్ణయించారు. ఎవరిని ముందుగా నిర్ణయించారో, వారిని ఆయన పిలిచారు; ఆయన పిలిచిన వారిని, ఆయన నీతిమంతులుగా తీర్చారు; ఆయన నీతిమంతులుగా తీర్చిన వారిని, ఆయన మహిమపరిచారు. అయితే ఈ విషయాలకు ప్రతిస్పందనగా మనం ఏం చెప్పాలి? ఒకవేళ దేవుడే మన వైపుంటే, మనకు విరోధంగా ఎవరుండగలరు? దేవుడు తన సొంత కుమారుని విడిచిపెట్టలేదు, మనందరి కొరకు ఆయనను వదులుకున్నాడు, అలాంటప్పుడు తన కుమారునితో పాటు మనందరికి అన్ని సమృద్ధిగా ఇవ్వకుండా ఎలా ఉండగలడు? దేవుడు ఏర్పరచుకొన్నవారికి వ్యతిరేకంగా ఆరోపణ చేసేవారు ఎవరు? నీతిమంతులుగా తీర్చేవాడు దేవుడే గదా! అయితే శిక్షను విధించేవారు ఎవరు? సజీవంగా తిరిగి లేచి, దేవుని కుడి వైపున కూర్చుండి మనకొరకు దేవుని వేడుకొనే యేసు క్రీస్తు తప్ప మరి ఎవరూ కాదు. క్రీస్తు ప్రేమ నుండి మనలను వేరుచేయగలవారు ఎవరు? ఇబ్బంది లేక కష్టం లేక కరువు లేక దిగంబరత్వం లేక ఆపద లేక ఖడ్గం ఏది వేరుచేయగలదు? లేఖనాల్లో ఇలా వ్రాయబడి ఉన్నది: “నీ కొరకు మేము దినమంతా మరణాన్ని ఎదుర్కొన్నాము, వధించబడబోయే గొర్రెలా మేము ఎంచబడ్డాము.” ఏది కాదు, మనల్ని ప్రేమించిన ఆయన ద్వారా మనం అన్ని విషయాల్లో జయించినవారి కన్నా అధికంగా ఉన్నాము. మరణమైనా జీవమైనా, దేవదూతలైనా దయ్యాలైనా, నేడైనా రేపైనా, ఎటువంటి శక్తులైనా, ఎత్తైనా లోతైనా, సృష్టిలో ఉన్న ఏదైనా మన ప్రభువైన క్రీస్తుయేసులో ఉన్న దేవుని ప్రేమ నుండి మనలను వేరుచేయలేవని నేను ఒప్పుకుంటున్నాను.

షేర్ చేయి
Read రోమా 8

రోమా 8:28-39 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

దేవుణ్ణి ప్రేమించేవారికి, అంటే ఆయన తన సంకల్పం ప్రకారం పిలిచిన వారికి, మేలు కలిగేలా దేవుడు అన్నిటినీ సమకూర్చి జరిగిస్తాడని మనకు తెలుసు. ఎందుకంటే తన కుమారుడు అనేక సోదరుల్లో జ్యేష్ఠుడుగా ఉండాలని, దేవుడు ముందుగా ఎరిగిన వారిని, తన కుమారుణ్ణి పోలిన రూపం పొందడానికి ముందుగా నిర్ణయించాడు. ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని నిర్దోషులుగా ఎంచాడు. అంతే కాదు, ఎవరిని నిర్దోషులుగా ఎంచాడో వారిని మహిమ పరిచాడు. వీటిని గురించి మనమేమంటాం? దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుణ్ణి మనకీయడానికి సంకోచించక మనందరి కోసం ఆయనను అప్పగించిన దేవుడు ఆయనతోబాటు అన్నిటినీ మనకీయకుండా ఉంటాడా? దేవుడు ఏర్పరచుకున్న వారి మీద నేరారోపణ చేయగల వాడెవడు? నిర్దోషిగా ప్రకటించేవాడు దేవుడే. ఎవరు శిక్ష విధించ గలిగేది? క్రీస్తు యేసా? చనిపోయినవాడు, మరింత ప్రాముఖ్యంగా చనిపోయిన వారిలో నుండి లేచినవాడు, దేవుని కుడి పక్కన కూర్చుని ఉన్నవాడు, మన కోసం విజ్ఞాపన చేసేవాడు కూడా ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? కష్టాలు, బాధలు, హింసలు, కరువులు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం, ఇవి మనలను వేరు చేస్తాయా? దీన్ని గురించి ఏమని రాసి ఉందంటే, “నీ కోసం మేము రోజంతా వధకు గురౌతున్నాం. వధ కోసం సిద్ధం చేసిన గొర్రెలుగా మమ్మల్ని ఎంచారు.” అయినా వీటన్నిటిలో మనలను ప్రేమించినవాడి ద్వారా మనం సంపూర్ణ విజయం పొందుతున్నాం. నేను నిశ్చయంగా నమ్మేదేమంటే, చావైనా, బతుకైనా, దేవదూతలైనా, ప్రభుత్వాలైనా, ఇప్పుడున్నవైనా, రాబోయేవైనా, శక్తులైనా, ఎత్తయినా, లోతైనా, సృష్టిలోని మరేదైనా సరే, మన ప్రభు క్రీస్తు యేసులోని దేవుని ప్రేమ నుండి మనలను వేరు చేయలేవు.

షేర్ చేయి
Read రోమా 8

రోమా 8:28-39 పవిత్ర బైబిల్ (TERV)

దేవుడు తనను ప్రేమించే ప్రజల కోసం, తన ఉద్దేశానుసారం పిలువబడినవాళ్ళ కోసం ఆయన సమస్తము చేయుచున్నాడని మనకు తెలుసు. ఈ ప్రజల్ని దేవుడు తన ఉద్దేశానుసారంగా పిలిచాడు. దేవుడు తనకు ఇదివరకే తెలిసిన వాళ్ళను తన కుమారునిలా రూపొందించాలని ప్రత్యేకంగా ఉంచాడు. తనకు చాలామంది పుత్రులుండాలని, వాళ్ళలో యేసు మొట్ట మొదటి వానిగా ఉండాలని ఆయన ఉద్దేశ్యం. దేవుడు ఎవర్ని ప్రత్యేకంగా ఉంచాడో వాళ్ళను పిలిచాడు. ఎవర్ని పిలిచాడో వాళ్ళను నీతిమంతులుగా చేసాడు. ఎవర్ని నీతిమంతులుగా చేసాడో వాళ్ళతో తన మహిమను పంచుకొన్నాడు. మరి, మనము దీనికి ఏమి ప్రత్యుత్తరం ఇవ్వగలము? దేవుడే మనవైపు ఉన్నప్పుడు మనకు విరుద్ధంగా ఎవరుంటారు? మనందరికోసం, ఆయన తన స్వంత కుమారుణ్ణి ఇవ్వటానికి కూడా వెనుకాడలేదు. అలాంటప్పుడు తన కుమారునితో సహా అన్నీ మనకివ్వడా? దేవుడు ఎన్నుకొన్న వాళ్ళపై ఎవరు నేరం మోపుతారు? మనల్ని నీతిమంతులుగా చేసేవాడు దేవుడే. ఇక మనకు ఎవ్వరూ శిక్ష విధించలేరు. చనిపోయి బ్రతికి వచ్చిన యేసుక్రీస్తు దేవుని కుడిచేతి వైపు కూర్చొని మన పక్షాన వేడుకుంటున్నాడు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు దూరం చెయ్యగలరు? కష్టం, దుఃఖం, హింస, కరువు, దిగంబరత్వం, అపాయం, ఖడ్గం మనల్ని దూరం చెయ్యగలవా? దీన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది: “నీ కోసం దినమంతా మరణాన్ని ఎదుర్కొంటూ ఉన్నాము, మేము చంపబడనున్న గొఱ్ఱెల వలె ఉన్నాం.” ఈ విషయాలన్నిటిలో, మనల్ని ప్రేమించిన ఆయన ద్వారా సంపూర్ణ విజయాన్ని సాధించాము. చావుగాని, బ్రతుకుగాని, దేవదూతలుగాని, దయ్యాలుగాని, ప్రస్తుతంగాని, భవిష్యత్తుగాని, మరే శక్తులుగాని ఎత్తుగాని, అగాధంగాని, సృష్టిలో ఉన్న మరేదైనాగాని మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా మనకు లభిస్తున్న దేవుని ప్రేమనుండి మనల్ని విడదీయలేవని నేను ఖండితంగా చెప్పగలను.

షేర్ చేయి
Read రోమా 8

రోమా 8:28-39 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

దేవుని ప్రేమించేవారికి అనగా దేవుని ఉద్దేశం ప్రకారం పిలువబడిన వారి మంచి జరిగేలా అన్నిటిని దేవుడు జరిగిస్తారని మనకు తెలుసు. అనేకులైన సహోదరి సహోదరుల మధ్యలో ఆయన ప్రథమ సంతానంగా ఉండాలని దేవుడు తాను ముందుగానే ఎరిగినవారిని తన కుమారుని స్వరూపానికి అనుగుణంగా ఉండేలా వారిని ముందుగానే నిర్ణయించారు. ఎవరిని ముందుగా నిర్ణయించారో వారిని ఆయన పిలిచారు; ఆయన ఎవరిని పిలిచారో వారిని నీతిమంతులుగా తీర్చారు; ఆయన ఎవరిని నీతిమంతులుగా తీర్చారో వారిని మహిమపరిచారు. అయితే ఈ విషయాల గురించి మనమేమి చెప్పాలి? ఒకవేళ దేవుడే మన వైపు ఉండగా, మనకు విరోధి ఎవడు? దేవుడు తన సొంత కుమారుని ఇవ్వడానికి వెనుతీయక మనందరి కోసం ఆయనను అప్పగించినప్పుడు తన కుమారునితో పాటు మనందరికి అన్ని సమృద్ధిగా ఇవ్వకుండా ఎలా ఉండగలరు? దేవుడు ఏర్పరచుకున్నవారికి వ్యతిరేకంగా ఆరోపణ చేసేవారు ఎవరు? నీతిమంతులుగా తీర్చేవాడు దేవుడే కదా! అయితే శిక్షను విధించేవారు ఎవరు? సజీవంగా తిరిగి లేచి, దేవుని కుడి వైపున కూర్చుండి మన కోసం దేవుని వేడుకొనే యేసు క్రీస్తే తప్ప మరి ఎవరూ కాదు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వేరు చేయగలవారు ఎవరు? ఇబ్బందులు గాని, కష్టాలు గాని, కరువు గాని, వస్త్రహీనత గాని, ఆపద గాని, ఖడ్గం గాని మనల్ని వేరు చేయగలదా? లేఖనాల్లో ఇలా వ్రాయబడి ఉన్నది: “రోజంతా మీ కోసమే మరణ బాధ పడుతున్నాం; వధించ దగిన గొర్రెలమని మమ్మల్ని ఎంచుతున్నారు.” అయినా మనల్ని ప్రేమించినవాని ద్వారా మనం అన్ని విషయాల్లో జయించినవారి కన్నా అధికంగా ఉన్నాము. మరణమైనా జీవమైనా, దేవదూతలైనా దయ్యాలైనా, నేడైనా రేపైనా, ఎటువంటి శక్తులైనా, ఎత్తైనా లోతైనా, సృష్టిలో ఉన్న ఏదైనా మన ప్రభువైన క్రీస్తు యేసులో ఉన్న దేవుని ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేవని నేను ఒప్పుకుంటున్నాను.

షేర్ చేయి
Read రోమా 8

రోమా 8:28-39

రోమా 8:28-39 TELUBSI