యోహాను 17
17
మహిమపరచబడుటకు యేసు ప్రార్థించుట
1యేసు ఈ మాటలను చెప్పిన తర్వాత ఆకాశం వైపు చూస్తూ ఇలా ప్రార్థించారు:
“తండ్రీ, సమయం వచ్చింది. నీ కుమారుడు నిన్ను మహిమపరిచేలా నీ కుమారుని మహిమపరచు. 2నీవు నీ కుమారునికి అప్పగించిన వారందరికి నిత్యజీవం అనుగ్రహించడానికి ప్రజలందరి మీద ఆయనకు అధికారం ఇచ్చావు. 3నీవు మాత్రమే నిజ దేవుడవని, యేసు క్రీస్తు నీవు పంపినవాడని వారు తెలుసుకోవడమే నిత్యజీవం. 4నీవు నాకు ఇచ్చిన పనిని పూర్తి చేసి భూమి మీద నిన్ను మహిమపరిచాను. 5తండ్రీ, ఈ లోక ఆరంభానికి ముందు నీతో నాకు ఉండిన మహిమతో ఇప్పుడు నన్ను నీ సన్నిధిలో మహిమపరచు.
యేసు తన శిష్యుల కొరకు ప్రార్థించుట
6“ఈ లోకంలో నుండి నీవు నాకు ఇచ్చిన వారికి నేను నిన్ను తెలియపరిచాను. వారు నీవారు; నీవు వారిని నాకు ఇచ్చావు మరియు వారు నీ వాక్యాన్ని పాటించారు. 7ఇప్పుడు వారు నీవు నాకు ఇచ్చినవన్ని నీ దగ్గర నుండే వచ్చాయని తెలుసుకొన్నారు. 8ఎందుకంటే నీవు నాకు ఇచ్చిన మాటలను నేను వారికి ఇచ్చాను, వారు వాటిని అంగీకరించారు. నిజంగా నేను నీ దగ్గర నుండి వచ్చానని వారు తెలుసుకొని నీవు నన్ను పంపావని నమ్మారు. 9నేను వారి కొరకు ప్రార్థిస్తున్నాను. నేను లోకం కొరకు ప్రార్థన చేయడం లేదు, కాని నీవు నాకు ఇచ్చిన వారి కొరకు, ఎందుకంటే వారు నీవారు. 10నాకు ఉన్నవన్ని నీవి, నీకు ఉన్నవన్ని నావి. వారి ద్వారా నాకు మహిమ కలిగింది. 11నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నాను, కనుక లోకంలో ఇక ఉండను, కాని వారైతే ఇంకా లోకంలోనే ఉన్నారు. పరిశుద్ధ తండ్రీ, నీ పేరిట అనగా నీవు నాకిచ్చిన పేరిట వారిని కాపాడు, అప్పుడు మనం ఏకమైవున్నట్లు వారు ఏకమైవుంటారు. 12నేను వారితో ఉన్నప్పుడు, నీవు నాకు ఇచ్చిన పేరిట వారిని రక్షించి భద్రంగా ఉంచాను. లేఖనాలు నెరవేరేలా నాశనానికి దిగజారిన ఒక్కడు తప్ప మరి ఎవరు తప్పిపోలేదు.
13“ఇప్పుడు నేను నీ దగ్గరకు వస్తున్నాను, అయినా నా ఆనందం వారిలో పరిపూర్ణం అవ్వడానికి, నేను ఇంకా ఈ లోకంలో ఉన్నప్పుడే ఈ విషయాలను చెప్తున్నాను. 14నేను నీ వాక్యాన్ని వారికి ఇచ్చాను కనుక లోకం వారిని ద్వేషించింది, ఎందుకనగా వారు కూడా నాలాగే ఈ లోకానికి చెందినవారు కారు. 15ఈ లోకం నుండి నీవు వారిని తీసుకో అని నేను ప్రార్థన చేయడం లేదు కాని, దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను. 16నేను ఈ లోకానికి చెందనట్లే, వారు కూడ ఈ లోకానికి చెందినవారు కారు. 17సత్యంతో వారిని పవిత్రపరచు; నీ వాక్యమే సత్యం. 18నీవు నన్ను ఈ లోకానికి పంపించినట్లే, నేను వారిని ఈ లోకానికి పంపించాను. 19వారు కూడా సత్యంలో ప్రతిష్ఠ చేయబడాలని, వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను.
యేసు విశ్వాసుల కొరకు ప్రార్థించుట
20“నేను వారి కొరకు మాత్రమే కాదు కాని, వారి మాటల ద్వారా నిన్ను నమ్మబోయే వారందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. 21మరియు నీవు నన్ను పంపించావని లోకం నమ్మేలాగా తండ్రీ, నీవు నాలో, నేను నీలో ఏకమై ఉన్నట్లు వారు కూడా ఒకటిగా ఉండాలి. నీవు నన్ను పంపించావని లోకం నమ్మేలా వారు మనలో కూడా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. 22మనం ఏకంగా ఉన్నట్లు వారు కూడ ఏకంగా ఉండాలని నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి ఇచ్చాను. 23అప్పుడు నీవే నన్ను పంపావని, నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించావని లోకం తెలుసుకుంటుంది.
24“తండ్రీ, నీవు నన్ను సృష్టికి పునాది వేయబడక ముందే ప్రేమించి నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారు చూడడానికి నేను ఎక్కడ ఉంటానో అక్కడ, నీవు నాకు ఇచ్చిన వారందరు కూడా ఉండాలని నేను కోరుకొంటున్నాను.
25“నీతిగల తండ్రీ, ఈ లోకానికి నీవు తెలియకపోయినా, నాకు నీవు తెలుసు, నీవే నన్ను పంపావని వీరికి తెలుసు. 26నా పట్ల నీకున్న ప్రేమ వీరిలో ఉండాలని, నేనే వారిలో ఉండాలని, నేను నీ నామమును వీరికి తెలియజేసాను, నేను వీరిలో ఉంటూ ఇంకా తెలియజేస్తూనే ఉంటాను.”
Kasalukuyang Napili:
యోహాను 17: TCV
Haylayt
Ibahagi
Kopyahin
Gusto mo bang ma-save ang iyong mga hinaylayt sa lahat ng iyong device? Mag-sign up o mag-sign in
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.