Logo ng YouVersion
Hanapin ang Icon

యోహాను 19

19
యేసుకు మరణశిక్ష విధించుట
1ఆ తర్వాత పిలాతు యేసుని కొరడాలతో కొట్టించాడు. 2సైనికులు ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి ఆయన తల మీద పెట్టారు. ఆయనకు ఊదారంగు వస్త్రాన్ని తొడిగించి, 3ఆయన దగ్గరకు మాటిమాటికి వెళ్లి, ఆయనతో, “యూదుల రాజా నీకు శుభం!” అని ఎగతాళి చేస్తూ, ఆయన ముఖం మీద అరచేతులతో కొట్టారు.
4పిలాతు మరొకసారి బయటకు వచ్చి యూదులతో, “చూడండి, ఈయనలో నాకు ఏ నేరం కనిపించలేదని చెప్పడానికి ఈయనను బయటకు మీ దగ్గరకు తీసుకొని వస్తున్నాను” అని చెప్పాడు. 5యేసు బయటకు వచ్చినప్పుడు ఆ ముళ్ళ కిరీటాన్ని ఊదారంగు వస్త్రాన్ని ధరించుకొని ఉన్నాడు. పిలాతు వారితో, “ఇదిగో, ఈ మనుష్యుడు!” అని చెప్పాడు.
6ముఖ్య యాజకులు మరియు వారి అధికారులు ఆయనను చూడగానే, “సిలువ వేయండి! సిలువ వేయండి!” అని కేకలు వేశారు.
అయితే పిలాతు, “మీరే ఆయనను తీసుకువెళ్లి సిలువ వేయండి. నాకైతే ఆయనలో ఏ నేరం కనిపించలేదు” అన్నాడు.
7అందుకు యూదా నాయకులు, “మా ధర్మశాస్త్రం ప్రకారం ఎవరైనా తాను దేవుని కుమారుడనని చెప్పుకొంటే చట్టాన్ని బట్టి అతడు చావవలసిందే” అన్నారు.
8పిలాతు ఆ మాట విని మరింత భయపడి, 9తిరిగి తన భవనంలోనికి వెళ్లి, “నీవు ఎక్కడి నుండి వచ్చావు?” అని యేసును అడిగాడు. కాని యేసు అతనికి ఏ జవాబివ్వలేదు. 10“నీవు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయడానికైనా, సిలువ వేయడానికైన నాకు అధికారం ఉందని నీవు గ్రహించవా?” అని పిలాతు అన్నాడు.
11అందుకు యేసు, “నీకు ఆ అధికారం పైనుండి ఇవ్వబడితేనే తప్ప నా మీద నీకు అధికారం లేదు. కనుక నన్ను నీకు అప్పగించినవాడు నీ కంటే మరి ఎక్కువ పాపం చేశాడు” అన్నారు.
12అప్పటి నుండి పిలాతు యేసును విడుదల చేయడానికి ప్రయత్నించాడు కాని యూదా నాయకులు, “నీవు ఇతన్ని విడుదల చేస్తే నీవు కైసరుకు స్నేహితుడవు కావు, నేను రాజును అని చెప్పుకొనే ప్రతివాడు కైసరుకు విరోధి” అని కేకలు వేశారు.
13పిలాతు ఈ మాటలను విని, యేసును బయటకు తీసుకువచ్చి, రాతి బాటగా ప్రసిద్ధి చెందిన స్థలంలో అతడు న్యాయపీఠం మీద కూర్చున్నాడు. హెబ్రీ భాషలో ఆ స్థలానికి గబ్బతా అని పేరు. 14అది పస్కాను సిద్ధపరచుకొనే రోజు, అది ఇంచుమించు ఉదయం ఆరు గంటల సమయం అవుతుంది.
పిలాతు, “ఇదిగో మీ రాజు” అని యూదులతో చెప్పాడు.
15కాని వారు, “అతన్ని తీసుకుపోండి! అతన్ని తీసుకుపోండి! సిలువ వేయండి!” అని కేకలు వేశారు.
“మీ రాజును నేను సిలువ వేయనా?” అని పిలాతు అడిగాడు.
అప్పుడు ముఖ్య యాజకులు “మాకు కైసరు తప్ప వేరే రాజు లేడు” అన్నారు.
16చివరికి పిలాతు సిలువ వేయడానికి యేసును వారికి అప్పగించాడు.
యేసు సిలువ వేయబడుట
కనుక సైనికులు యేసును తీసుకువెళ్లారు. 17యేసు తన సిలువను తానే మోసుకొని కపాల స్థలం అనే చోటికి తీసుకువెళ్లారు. హెబ్రీ భాషలో ఆ స్థలానికి “గొల్గొతా” అని పేరు. 18అక్కడ ఆయనతోపాటు మరో ఇద్దరిని, ఆయనకు ఇరువైపుల ఉంచి వారి మధ్యలో యేసును సిలువ వేశారు.
19మరియు పిలాతు సిలువకు వ్రాతపూర్వక ఉత్తర్వును కొట్టించాడు. అది ఇలా ఉంది:
నజరేతువాడైన యేసు, యూదుల రాజు.
20యేసును సిలువ వేసిన స్థలం పట్టణానికి దగ్గరగా ఉంది. ఆ ప్రకటనను హెబ్రీ, లాటిను మరియు గ్రీకు భాషలలో వ్రాయించారు కనుక యూదులలో చాలామంది దానిని చదివారు. 21ముఖ్యయాజకులైన యూదులు దానిని వ్యతిరేకించి పిలాతును, “యూదుల రాజు అని వ్రాయవద్దు కాని యూదులకు రాజునని చెప్పుకొనేవాడు” అని వ్రాయమని అడిగారు.
22అందుకు పిలాతు, “నేను వ్రాసిందేదో వ్రాసేసాను” అని జవాబిచ్చాడు.
23సైనికులు యేసుని సిలువ వేసిన తర్వాత, వారు ఆయన బట్టలను తీసుకొని, ఒక్కొక్కరికి ఒక భాగం వచ్చేలా నాలుగు భాగాలుగా చేశారు కాని ఆయనపై అంగీ, ఏ కుట్టు లేకుండా పైనుండి క్రింది వరకు ఒకే బట్టగా నేయబడింది.
24కనుక వారు, “దీనిని చింపవద్దు, చీట్లు వేసి ఎవరి పేరట చీటి వస్తుందో వారు తీసుకొంటారు” అని చెప్పుకొన్నారు.
లేఖనంలో వ్రాయబడినట్లు,
“వారు నా వస్త్రాలను పంచుకొన్నారు మరియు
నా అంగీ కొరకు చీట్లు వేశారు”#19:24 కీర్తన 22:18
అని నెరవేరేలా ఇది జరిగింది. అందుకే సైనికులు అలా చేశారు.
25యేసు తల్లి, ఆయన తల్లి సహోదరి, క్లోపా భార్య మరియ, మగ్దలేనే మరియ సిలువ దగ్గర నిలబడి ఉన్నారు. 26యేసు అతని తల్లి మరియు తాను ప్రేమించిన శిష్యుడు అక్కడ నిలబడి ఉన్నారని చూసి, ఆయన తన తల్లితో “అమ్మా, ఇదిగో నీ కుమారుడు” అని, 27తర్వాత తన ఆ శిష్యునితో, “ఇదిగో నీ తల్లి” అని చెప్పారు. అప్పటి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట్లో చేర్చుకున్నాడు.
యేసు మరణించుట
28ఆ తర్వాత, యేసు అంతా ముగిసినదని గ్రహించి లేఖనాలు నెరవేరేలా, “దాహంగా ఉంది” అన్నారు. 29అక్కడే ఉన్న ఒక పులిసిన ద్రాక్షరస పాత్రలో, వారు ఒక స్పంజీని చిరకలో ముంచి, హిస్సోపు చెట్టు కొమ్మతో చుట్టి, యేసు పెదవులకు దానిని అందించారు. 30ఆయన చిరకాను పుచ్చుకొని, “సమాప్తమైనది” అని చెప్పి యేసు తన తలను వంచి తన ప్రాణం విడిచారు.
31అది సిద్ధపాటు రోజు, మరుసటి దినము ప్రత్యేకమైన సబ్బాతు దినం. సబ్బాతు దినాన సిలువపై వారి దేహాలు ఉండకూడదని యూదా నాయకులు భావించి సిలువ వేయబడిన వారి కాళ్ళను విరగగొట్టి, వారి దేహాలను కిందకి దింపివేయాలని వారు పిలాతును అడిగారు. 32కనుక సైనికులు వచ్చి యేసుతోపాటు సిలువ వేసిన మొదటివాడి కాళ్ళను తర్వాత రెండవవాడి కాళ్ళను విరుగగొట్టారు. 33కాని వారు యేసు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే చనిపోయారని గ్రహించి ఆయన కాళ్ళను విరుగగొట్టలేదు. 34కాని సైనికులలో ఒకడు యేసుని బల్లెంతో ప్రక్కలో పొడిచాడు. వెంటనే రక్తం మరియు నీరు కారాయి. 35అది చూసినవాడు సాక్ష్యం ఇచ్చాడు, అతని సాక్ష్యం నిజం. అతడు నిజం చెప్తున్నాడని అతనికి తెలుసు. మీరు కూడా నమ్మడానికి అతడు సాక్ష్యమిస్తున్నాడు. 36లేఖనాల్లో వ్రాయబడినట్లు, “ఆయన ఎముకల్లో ఒక్కటైనా విరువబడలేదు”#19:36 నిర్గమ 12:46; సంఖ్యా 9:12; కీర్తన 34:20 అని నెరవేరేలా ఇది జరిగింది. 37మరియు ఇతర లేఖనాల్లో, “వారు తాము పొడిచిన వానివైపు చూస్తారు”#19:37 జెకర్యా 12:10 అని వ్రాయబడి ఉంది.
యేసును సమాధి చేయుట
38ఆ తర్వాత యూదా నాయకులు భయపడి, రహస్యంగా యేసు శిష్యుడిగా ఉన్న అరిమతయికు చెందిన యోసేపు యేసు దేహాన్ని తాను తీసుకెళ్తానని పిలాతును వేడుకొన్నాడు. పిలాతు అనుమతితో, అతడు వచ్చి యేసు దేహాన్ని తీసుకువెళ్ళాడు. 39అతనితో పాటు, గతంలో ఒక రాత్రి వేళ యేసుతో మాట్లాడిన నీకొదేము కూడా ఉన్నాడు. నీకొదేము ఇంచుమించు ముప్పైనాలుగు కిలోగ్రాముల#19:39 ముప్పైనాలుగు కిలోగ్రాముల పాత ప్రతులలో సుమారు నూట ఏబది సేర్లు బోళం మరియు అగరుల మిశ్రమాన్ని, శవం కుళ్ళిపోకుండా ఉంచే సుగంధ ద్రవ్యాలను తనతో తీసుకొనివచ్చాడు. 40వారిద్దరు యేసు దేహాన్ని తీసుకువెళ్లి, యూదుల ఆచారం ప్రకారం దానికి సుగంధ ద్రవ్యాలను పూసి, నారబట్టతో చుట్టారు. 41యేసును సిలువ వేసినచోట ఒక తోట ఉన్నది. ఆ తోటలో ఎవరిని పెట్టని ఒక క్రొత్త సమాధి ఉన్నది. 42యూదుల ఆచారం ప్రకారం సిద్ధపాటు దినము మొదలుకాక ముందే సమాధి చేయాలని, దగ్గరలో ఉన్న ఆ క్రొత్త సమాధిలో యేసు దేహాన్ని పెట్టారు.

Kasalukuyang Napili:

యోహాను 19: TCV

Haylayt

Ibahagi

Kopyahin

None

Gusto mo bang ma-save ang iyong mga hinaylayt sa lahat ng iyong device? Mag-sign up o mag-sign in