Logo ng YouVersion
Hanapin ang Icon

యోహాను 20

20
యేసు మృతులలో నుండి లేచుట
1వారం మొదటి రోజున, ఇంకా చీకటిగా ఉన్నప్పుడే, మగ్దలేనే మరియ సమాధి దగ్గరకు వెళ్లి సమాధిని మూసిన రాయి తొలగిపోయి ఉండడం చూసింది. 2కనుక ఆమె సీమోను పేతురు మరియు యేసు ప్రేమించిన శిష్యుని దగ్గరకు పరుగెత్తుకొని వెళ్లి, “వారు ప్రభువును సమాధిలో నుండి తీసుకొని వెళ్లిపోయారు, ఆయనను ఎక్కడ పెట్టారో తెలియడం లేదు” అని చెప్పింది.
3కనుక పేతురు, మరొక శిష్యుడు వెంటనే సమాధి దగ్గరకు బయలుదేరారు. 4వారిద్దరు పరుగెడుతూ ఉండగా ఆ శిష్యుడు పేతురు కంటే వేగంగా పరుగెత్తి మొదట సమాధి దగ్గరకు చేరుకొన్నాడు. 5అతడు సమాధిలోనికి వంగి నారబట్టలు పడి ఉన్నాయని చూసాడు కాని దాని లోపలికి వెళ్లలేదు. 6ఆ తర్వాత అతని వెనకాలే వచ్చిన సీమోను పేతురు నేరుగా సమాధిలోనికి వెళ్లి, అక్కడ నారబట్టలు పడి ఉన్నాయని, 7యేసు తలకు చుట్టిన రుమాలు, ఆ నారబట్టలతో కాకుండా వేరే చోట మడతపెట్టి ఉందని చూసాడు. 8సమాధి దగ్గరకు మొదట చేరిన శిష్యుడు కూడ లోపలికి వెళ్లి చూసి నమ్మాడు. 9యేసు చనిపోయి తిరిగి జీవంతో లేస్తాడని చెప్పే లేఖనాలను వారు ఇంకా గ్రహించలేదు. 10తర్వాత ఆ శిష్యులు తిరిగి తమ ఇండ్లకు వెళ్లిపోయారు.
మగ్దలేనేకు చెందిన మరియకు యేసు కనిపించుట
11కాని మరియ, సమాధి బయట నిలబడి ఏడుస్తూ ఉంది. ఆమె ఏడుస్తూ సమాధిలోనికి తొంగి చూసినప్పుడు, 12తెల్లని బట్టలను ధరించిన ఇద్దరు దేవదూతలు, యేసు దేహాన్ని ఉంచిన చోట, తల వైపున ఒకరు కాళ్ళ వైపున మరొకరు కూర్చుని ఉండడం చూసింది.
13వారు ఆమెను, “అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు?” అని అడిగారు.
అందుకు ఆమె, “వారు నా ప్రభువును సమాధిలో నుండి తీసుకొని వెళ్లిపోయారు, వారు ఆయనను ఎక్కడ పెట్టారో తెలియడం లేదు” అన్నది. 14అప్పుడు ఆమె వెనుకకు తిరిగి అక్కడ యేసు నిలబడి ఉన్నాడని చూసింది, కానీ ఆయనే యేసు అని ఆమె గుర్తు పట్టలేదు.
15ఆయన, “అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నీవు ఎవరిని వెదకుతున్నావు?” అని అడిగారు.
ఆమె ఆయనను తోటమాలి అనుకుని, “అయ్యా, నీవు ఆయనను తీసుకువెళ్తే, ఆయనను ఎక్కడ ఉంచావో నాకు చెప్పు, నేను ఆయనను తీసుకువెళ్తాను” అన్నది.
16యేసు ఆమెను “మరియ” అని పిలిచారు.
ఆమె ఆయన వైపుకు తిరిగి “రబ్బూనీ” అని పిలిచింది. రబ్బూనీ అనగా హెబ్రీ భాషలో “బోధకుడు” అని అర్థం.
17యేసు, “నేను తండ్రి దగ్గరకు ఇంకా ఆరోహణమవ్వలేదు, కనుక నన్ను ముట్టుకోవద్దు. దాని బదులు నా సహోదరుల దగ్గరకు వెళ్లి వారితో, ‘నా తండ్రియు నీ తండ్రియు మరియు నా దేవుడు నీ దేవుడు అయిన వాని దగ్గరకు ఎక్కి వెళ్తున్నాను’ అని వారితో చెప్పు” అన్నారు.
18మగ్దలేనే మరియ, శిష్యుల దగ్గరకు వెళ్లి, “నేను ప్రభువును చూసాను! ఆయన నాతో ఈ సంగతులు చెప్పారు” అని వారికి చెప్పింది.
శిష్యులకు కనిపించిన యేసు
19ఆదివారం సాయంకాలాన యూదా నాయకులకు భయపడి తలుపులను మూసుకొని, శిష్యులందరు ఒక్కచోట ఉన్నప్పుడు, యేసు వచ్చి వారి మధ్యలో నిలబడి వారితో, “మీకు సమాధానం కలుగును గాక!” అని చెప్పారు. 20ఆయన ఆ విధంగా చెప్పి వారికి తన చేతులను, అతని ప్రక్కను చూపించగా శిష్యులు ప్రభువును చూసి చాలా సంతోషించారు.
21యేసు మళ్ళీ వారితో, “మీకు సమాధానం కలుగును గాక! నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను” అని చెప్పారు. 22ఈ మాట చెప్పిన తర్వాత ఆయన వారి మీద ఊది, “పరిశుద్ధాత్మను పొందండి. 23మీరు ఎవరి పాపాలను క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి; మీరు ఎవరిని క్షమించరో వారు క్షమించబడరు” అన్నారు.
యేసు తోమాకు ప్రత్యక్షమగుట
24పన్నెండు మంది శిష్యులలో దిదుమా అని పిలువబడే తోమా, యేసు వచ్చినప్పుడు అక్కడ వారితో లేడు. 25కనుక మిగతా శిష్యులు అతనితో, “మేము ప్రభువును చూసాం” అని చెప్పారు.
అప్పుడు అతడు వారితో, “నేను ఆయన చేతిలో మేకులు కొట్టిన గాయాలలో నా వ్రేలును మరియు ఆయనను పొడిచిన ప్రక్కలో నాచేయి పెట్టి చూస్తేనే గాని, నేను నమ్మను” అన్నాడు.
26ఒక వారం రోజుల తర్వాత యేసు శిష్యులు మరల ఇంట్లో ఉన్నప్పుడు, తోమా వారితో పాటు ఉన్నాడు. వారి ఇంటి తలుపులు మూసి ఉన్నాయి, అయినా యేసు వారి మధ్యకు వచ్చి “మీకు సమాధానం కలుగును గాక!” అని వారితో చెప్పారు. 27తర్వాత ఆయన తోమాతో, “నా చేతులను చూడు; నీ వ్రేలితో ఆ గాయాలను ముట్టి చూడు. నీ చేయి చాపి నా ప్రక్క గాయాన్ని ముట్టి చూడు. అనుమానించడం మాని నమ్ము” అన్నారు.
28తోమా ఆయనతో, “నా ప్రభువా, నా దేవా!” అన్నాడు.
29అప్పుడు యేసు అతనితో, “నీవు నన్ను చూసి నమ్మినావు; చూడకుండానే నమ్మినవారు ధన్యులు” అన్నారు.
ఈ గ్రంథం ఉద్దేశం
30యేసు తన శిష్యుల ముందు అనేక ఇతర అద్బుత క్రియలను చేశారు, వాటన్నిటిని ఈ పుస్తకంలో వ్రాయలేదు. 31అయితే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మడానికి, ఆయన నామంను నమ్మడం ద్వారా మీరు జీవాన్ని పొందుకోవాలని ఈ సంగతులను వ్రాసాను.

Kasalukuyang Napili:

యోహాను 20: TCV

Haylayt

Ibahagi

Kopyahin

None

Gusto mo bang ma-save ang iyong mga hinaylayt sa lahat ng iyong device? Mag-sign up o mag-sign in