లూకా 16
16
అన్యాయ గృహనిర్వాహకుని ఉపమానం
1యేసు తన శిష్యులతో మాట్లాడుతూ ఈ విధంగా చెప్పారు: “ఒక ధనవంతుని దగ్గర ఒక గృహనిర్వాహకుడు ఉన్నాడు. వాడు అతని ఆస్తిని పాడు చేస్తున్నాడని వాని మీద నేరారోపణ ఉంది. 2గనుక ఆ ధనవంతుడు వానిని లోపలికి పిలిపించి వానితో, ‘నీ గురించి నేను వింటుంది ఏమి? నిన్ను గృహనిర్వాహక పని నుండి తొలగిస్తున్నాను కనుక నీవు లెక్కలన్నీ అప్పగించాలి’ అన్నాడు.
3“ఆ గృహనిర్వాహకుడు తనలో తాను, ‘ఇప్పుడు నేను ఏమి చేయాలి? నా యజమాని నన్ను ఉద్యోగం నుండి తీసేస్తాడు, త్రవ్వే పని చేతకాదు, భిక్షమెత్తాలంటే సిగ్గు. 4కనుక ఇక్కడ నా ఉద్యోగం పోయినా ప్రజలు నన్ను తమ ఇండ్లకు ఆహ్వానించేలా ఏమి చేయాలో నాకు తెలుసు!’ అని అనుకున్నాడు.
5“కనుక అతడు, తన యజమానికి బాకీ ఉన్న ప్రతివారిని పిలిపించాడు. మొదటి వానిని, ‘నా యజమానికి నీవెంత బాకీ ఉన్నావు?’ అని అడిగాడు.
6“అందుకు వాడు, ‘మూడు వేల లీటర్ల నూనె’ అని జవాబిచ్చాడు.
“వెంటనే ఆ గృహనిర్వాహకుడు వానితో, ‘నీ చీటి తీసుకొని, పదిహేను వందల లీటర్లు#16:6 పదిహేను వందల లీటర్లు అనగా 100 మణుగులు అని వ్రాసుకో’ అన్నాడు.
7“ఆ తర్వాత రెండవ వానిని, ‘నీవెంత బాకీ ఉన్నావు?’ అని అడిగాడు.
“అందుకు వాడు, ‘వంద టన్నుల గోధుమలు#16:7 వంద టన్నుల గోధుమలు అనగా పాత ప్రతులలో నూరు తూముల గోధుమలు’ అని చెప్పాడు.
“కనుక అతడు వానితో, ‘నీవు నీ చీటీలో ఎనభై టన్నులని వ్రాసుకో’ అన్నాడు.
8“ఈ విషయాన్ని విన్న ధనవంతుడు ఆ గృహనిర్వాహకుడు మోసగాడైనా కానీ యుక్తిగా నడుచుకొన్నాడని వానిని మెచ్చుకొన్నాడు. ఈ లోకసంబంధులు తమ తరాన్ని బట్టి చూస్తే వెలుగు సంబంధుల కంటే యుక్తిగా వ్యవహరిస్తున్నారు. 9గనుక నేను మీతో చెప్పేదేమంటే, మీకున్న లోక ధనసంపదతో మీరు స్నేహితులను సంపాదించుకొండి, అది పోయినప్పుడు, నిత్యమైన నివాసాల్లో మీకు ఆహ్వానం దొరుకుతుంది.
10“చాలా కొంచెంలో నమ్మకంగా ఉండేవారు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటారు; చిన్న వాటిలో అన్యాయంగా ఉండేవారు పెద్ద వాటిలో కూడా అన్యాయంగానే ఉంటారు. 11అనగా, ఈ లోక సంపద విషయాల్లో మీరు నమ్మకంగా లేనప్పుడు, నిజమైన ధనం విషయంలో మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? 12మీరు ఇతరుల ఆస్తి విషయంలో నమ్మకంగా లేనప్పుడు, మీకు సొంత ఆస్తిని ఎవరు ఇస్తారు?
13“ఎవ్వరూ ఇద్దరు యజమానులకు సేవచేయలేరు. వారు ఒకరిని ద్వేషించి మరొకరిని ప్రేమిస్తారు లేక ఒక యజమానికి అంకితమై మరొకనిని తృణీకరిస్తారు. మీరు దేవుణ్ణి, ధనాన్ని రెండింటిని ఒకేసారి సేవించలేరు.”
14డబ్బును ప్రేమించే పరిసయ్యులు ఈ మాటలను విని యేసును ఎగతాళి చేశారు. 15ఆయన వారితో, “మీరు మనుషుల దృష్టిలో నీతిమంతులని అనిపించుకుంటారు గాని దేవుడు మీ హృదయాలను ఎరిగి ఉన్నాడు. మనుషులు అధిక విలువ ఇచ్చేవి దేవుని దృష్టికి అసహ్యం.
మరికొన్ని బోధలు
16“బాప్తిస్మమిచ్చు యోహాను కాలం వరకు ధర్మశాస్త్రం మరియు ప్రవక్తలు ఉన్నారు. అప్పటి నుండి దేవుని రాజ్యసువార్త ప్రకటింపబడుతూ ఉంది, ప్రతి ఒక్కరు ఆ రాజ్యంలోనికి చొరబడుతూనే ఉన్నారు. 17ధర్మశాస్త్రం నుండి ఒక పొల్లు తప్పిపోవడం కన్న ఆకాశం మరియు భూమి గతించిపోవడం సులభం.
18“ఎవడైనా తన భార్యను విడిచి మరొక స్త్రీని వివాహం చేసుకుంటే వాడు వ్యభిచారం చేస్తున్నాడు, అలాగే విడిచిపెట్టబడిన స్త్రీని వివాహం చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు.
ధనవంతుడు మరియు లాజరు
19“ఊదారంగు సన్నని నార బట్టలను ధరించుకొని, ప్రతిరోజూ విలాసంగా జీవించే ఒక ధనవంతుడు ఉండేవాడు. 20వాని ఇంటి వాకిటనే శరీరమంతా కురుపులు ఉన్న లాజరు అనే పేరుగల ఒక పేదవాడు ఉండేవాడు. 21వాడు ఆ ధనవంతుని బల్ల నుండి పడే రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకోవాలని చూసేవాడు. కుక్కలు వచ్చి వాని కురుపులను నాకేవి.
22“ఆ పేదవాడు చనిపోయినప్పుడు దేవదూతలు వానిని అబ్రాహాము రొమ్మున ఆనుకోడానికి తీసుకొని వెళ్లారు. అలాగే ధనవంతుడు కూడ చనిపోయి పాతిపెట్టబడ్డాడు. 23ధనవంతుడు నరకంలో యాతనపడుతు, దూరం నుండి అబ్రాహాము రొమ్మున ఆనుకొనిన లాజరును చూసాడు. 24వెంటనే అతడు, ‘తండ్రీ అబ్రాహామూ, నేను అగ్నిలో అల్లాడి పోతున్నాను. నా మీద కనికరం చూపించి, తన చేతివ్రేలికొన నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చడానికి లాజరును పంపించవా’ అని కేక వేసాడు.
25“అందుకు అబ్రాహాము, ‘కుమారుడా, జ్ఞాపకం చేసుకో, లాజరు కష్టాలను అనుభవిస్తున్నప్పుడు నీ జీవితంలో నీవు మేళ్ళను అనుభవించావు, కానీ ఇప్పుడు ఇక్కడ అతడు ఆదరణ పొందుతున్నాడు, కానీ నీవు యాతనపడుతున్నావు. 26వీటన్నిటితో పాటు, నీకు మాకు మధ్య పెద్ద అగాధం ఉంది కనుక ఇక్కడి వారు అక్కడికి గానీ అక్కడి వారు ఇక్కడికి గాని రాలేరు’ అన్నాడు.
27-28“అందుకు అతడు, ‘అయితే తండ్రీ, నా కుటుంబంలో నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు. వారు కూడ ఇక్కడికి వచ్చి వేదన పడకుండా వారిని హెచ్చరించడానికి లాజరును పంపించమని నిన్ను వేడుకొంటున్నాను’ అన్నాడు.
29“అందుకు అబ్రాహాము, ‘వారికి మోషే మరియు ప్రవక్తలు ఉన్నారు, వారు వీరి మాటలను విననివ్వు’ అన్నాడు.
30“అందుకు అతడు, ‘కాదు, తండ్రీ అబ్రాహామూ, చనిపోయినవారిలో నుండి ఎవరైనా వెళ్తే, వారు పశ్చాత్తాపపడతారు’ అన్నాడు.
31“అందుకు అబ్రాహాము అతనితో, ‘వారు మోషే మరియు ప్రవక్తల మాటలను విననప్పుడు, చనిపోయినవారిలో నుండి ఒకడు లేచి వెళ్లినా నమ్మరు’ అన్నాడు.”
Kasalukuyang Napili:
లూకా 16: TCV
Haylayt
Ibahagi
Kopyahin
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapistaging.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Ftl.png&w=128&q=75)
Gusto mo bang ma-save ang iyong mga hinaylayt sa lahat ng iyong device? Mag-sign up o mag-sign in
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.