లూకా సువార్త 21

21
ఒక బీద విధవరాలి కానుక
1దేవాలయ కానుక పెట్టెలో కానుకలను వేస్తున్న ధనవంతులను యేసు గమనించి చూస్తున్నారు. 2-3అప్పుడు ఒక బీద విధవరాలు రెండు చిన్న కాసులు అందులో వేయడం చూసి యేసు, “నేను మీతో నిజంగా చెప్తున్న, అందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసింది. 4వీరందరు తమకు కలిగిన సమృద్ధిలో నుండి కొంత వేశారు. కాని ఈమె తన పేదరికం నుండి తన జీవనాధారమంతా వేసింది” అని అన్నారు.
అంత్యకాలపు గుర్తులు
5ఆయన శిష్యులలో కొందరు దేవాలయం అందమైన రాళ్లతో దేవునికి ఇచ్చిన అర్పణలతో అలంకరించబడి ఉందని మాట్లాడుకుంటున్నారు. కాని యేసు వారితో, 6“ఇక్కడ మీరు వీటిని చూస్తున్నారు కదా, వీటిలో ఒక రాయి మీద ఇంకొక రాయి నిలబడకుండ పడవేయబడే రోజులు వస్తున్నాయి” అని చెప్పారు.
7అందుకు వారు, “బోధకుడా, ఈ సంగతులు ఎప్పుడు జరుగుతాయి? ఇవన్నీ నెరవేరడానికి ముందు సూచనలు ఏమైనా కనబడతాయా? మాకు చెప్పండి” అని ఆయనను అడిగారు.
8అందుకు ఆయన, “మీరు మోసగించబడకుండ జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే అనేకులు నా పేరిట వచ్చి, ‘నేనే ఆయనను’ ‘సమయం సమీపించింది’ అని చెప్తారు. వారిని అనుసరించవద్దు. 9మీరు యుద్ధాల గురించి, విప్లవాలను గురించి విన్నప్పుడు భయపడవద్దు. అలాంటివన్ని జరగ వలసి ఉంది, కాని అంతం అప్పుడే రాదు.”
10తర్వాత ఆయన వారితో: “జనాల మీదికి జనాలు, రాజ్యాల మీదికి రాజ్యాలు లేస్తాయి. 11అక్కడక్కడ గొప్ప భూకంపాలు, కరువులు, తెగుళ్ళు వస్తాయి. ఆకాశంలో కూడ భయంకరమైన సంఘటనలు, గొప్ప సూచనలు కనిపిస్తాయి.
12“ఇవన్నీ జరుగక ముందు, వారు మిమ్మల్ని బలవంతంగా పట్టుకుని హింసిస్తారు. వారు మిమ్మల్ని సమాజమందిరాలకు అప్పగిస్తారు మిమ్మల్ని చెరసాలలో వేస్తారు, నా నామాన్ని బట్టి మీరు రాజుల ఎదుటకు అధికారుల ఎదుటకు కొనిపోబడతారు. 13మీరు నన్ను గురించి సాక్ష్యం ఇస్తారు. 14అయితే మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో అని ముందుగానే చింతించకుండ ఉండేలా మీ మనస్సును సిద్ధపరచుకోండి. 15ఎందుకంటే మీ విరోధులు ఎదిరించడానికి గాని, నిరాకరించడానికి గాని వీలుకాని మాటలను జ్ఞానాన్ని నేను మీకు ఇస్తాను. 16మీ తల్లిదండ్రులు, సహోదరులు, సహోదరీలు, బంధువులు, స్నేహితుల చేత మీరు అప్పగించబడతారు, వారు మీలో కొందరిని చంపుతారు. 17నన్ను బట్టి ప్రతి ఒక్కరు మిమ్మల్ని ద్వేషిస్తారు. 18కాని మీ తలవెంట్రుకలలో ఒకటి కూడా రాలిపోదు. 19స్థిరంగా ఉండండి, అప్పుడు మీరు ప్రాణాలు కాపాడుకుంటారు.
20“యెరూషలేము పట్టణాన్ని సైన్యాలు చుట్టుముట్టాయని మీరు చూసినప్పుడు దాని నాశనం సమీపించిందని మీరు తెలుసుకోండి. 21అప్పుడు యూదయలోని వారు కొండల్లోకి పారిపోవాలి. పట్టణంలో ఉన్నవారు బయటకు వెళ్లిపోవాలి, బయట పొలాల్లో ఉన్నవారు పట్టణంలోనికి వెళ్లకూడదు. 22ఎందుకంటే లేఖనాల్లో వ్రాయబడి ఉన్న ప్రకారం దండన నెరవేరే సమయం ఇదే! 23ఆ దినాల్లో గర్భిణి స్త్రీలకు పాలిచ్చే తల్లులకు శ్రమ! ఈ ప్రజల మీద దేవుని కోపం దిగి భూమి మీద బహు భయంకరమైన దురవస్థ కలుగుతుంది. 24ఆ సమయంలో వారు ఖడ్గంచే హతం అవుతారు ఖైదీలుగా అన్ని రాజ్యాలకు అప్పగించబడతారు. యూదేతరుల పరిపాలన కాలం అంతా పూర్తయ్యే వరకు యూదేతరులు యెరూషలేము పట్టణాన్ని అణగద్రొక్కుతారు.
25“ఇంకా సూర్య, చంద్ర, నక్షత్రాలలో సూచనలు, సముద్ర తరంగాల గర్జనలతో భూమి మీద ఉన్న దేశాలు వేదనతో కలవరంతో సతమతం అవుతాయి. 26ఆకాశ సంబంధమైనవి చెదిరిపోతాయి కాబట్టి భూమిపైకి ఏమి రాబోతుందో అని ప్రజలు భయంతో దిగులుతో వణికిపోతారు. 27అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావంతో గొప్ప మహిమతో మేఘాల మీద రావడం చూస్తారు. 28ఇలా జరగటం మొదలైనప్పుడు మీకు విడుదల అతి సమీపంగా ఉందని గ్రహించి, ధైర్యంతో మీ తలలను పైకి లేవనెత్తండి” అని చెప్పారు.
29ఆయన వారికి ఉపమానం చెప్పారు: “అంజూర చెట్టును ఇతర చెట్లను చూడండి. 30అవి చిగిరిస్తున్నాయి అని చూసి, వేసవికాలం సమీపంగా ఉందని మీరు తెలుసుకుంటారు గదా! 31అలాగే, ఇవన్నీ జరుగుతున్నాయని మీరు చూసినప్పుడు, దేవుని రాజ్యం చాలా దగ్గరలో ఉందని మీరు తెలుసుకోండి.
32“ఇవన్నీ జరిగే వరకు ఈ తరం గతించదని ఖచ్చితంగా మీతో చెప్తున్నాను. 33ఆకాశం భూమి గతించిపోతాయి, గాని నా మాటలు ఏమాత్రం గతించవు.
34“అకస్మాత్తుగా వలలో చిక్కినట్లు ఆ దినం మీ మీదికి వస్తుంది, అలా రాకుండా, తిని త్రాగి మత్తెక్కడం వలన జీవితంలోని ఆందోళనల వలన మీ హృదయాలు బరువెక్కకుండ జాగ్రత్తగా చూసుకోండి. 35ఆ దినం భూమి మీద ఉన్న వారందరి మీదకు అకస్మాత్తుగా వస్తుంది. 36కాబట్టి జరగబోయే వాటన్నిటి నుండి తప్పించుకుని, మనుష్యకుమారుని ముందు నిర్దోషిగా నిలబడగలిగేలా అన్ని సమయాల్లో మెలకువగా ఉండి ప్రార్థించండి” అని చెప్పారు.
37ఆయన ప్రతిరోజు పగలు దేవాలయంలో బోధిస్తూ, రాత్రులు ఒలీవ కొండపై గడిపేవారు. 38ప్రజలందరు ఆయన మాటలను వినడానికి వేకువనే దేవాలయానికి వచ్చేవారు.

高亮显示

分享

复制

None

想要在所有设备上保存你的高亮显示吗? 注册或登录