ఆదికాండము 1

1
1ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. 2భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. 3దేవుడు–వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. 4వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను; దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. 5దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను.
6మరియు దేవుడు–జలములమధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. 7దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆప్రకారమాయెను. 8దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవదినమాయెను.
9దేవుడు–ఆకాశము క్రిందనున్న జలము లొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆప్రకారమాయెను. 10దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను. 11దేవుడు– గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమిమీద తమతమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆప్రకార మాయెను. 12భూమి గడ్డిని తమతమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమతమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. 13అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను.
14దేవుడు–పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు, 15భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గాకనియు పలికెను; ఆప్రకారమాయెను. 16దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. 17-18భూమిమీద వెలు గిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీక టిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను; అది మంచిదని దేవుడు చూచెను. 19అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను.
20దేవుడు–జీవముకలిగి చలించువాటిని జలములు సమృ ద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను. 21దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృ ద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను, జీవముకలిగి చలించు వాటినన్నిటిని, దాని దాని జాతి ప్రకారము రెక్కలుగల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. 22దేవుడు–మీరు ఫలించి అభివృద్ధిపొంది సముద్ర జలములలో నిండి యుండుడనియు, పక్షులు భూమిమీద విస్తరించును గాకనియు, వాటిని ఆశీర్వదించెను. 23అస్తమయమును ఉదయమును కలుగగా అయిదవ దినమాయెను.
24దేవుడు–వాటి వాటి జాతి ప్రకారము జీవముగల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను; ఆప్రకారమాయెను. 25దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అదిమంచిదని దేవుడు చూచెను. 26దేవుడు–మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారు సముద్రపు చేపలను ఆకాశపక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. 27దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. 28దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా–మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశపక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. 29దేవుడు– ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్షమును మీ కిచ్చియున్నాను; అవి మీ కాహారమగును. 30భూమిమీదనుండు జంతువులన్నిటికిని ఆకాశపక్షులన్నిటికిని భూమిమీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నియు ఆహారమగు నని పలికెను. ఆప్రకారమాయెను. 31దేవుడు తాను చేసి నది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను.

Kleurmerk

Deel

Kopieer

None

Wil jy jou kleurmerke oor al jou toestelle gestoor hê? Teken in of teken aan