లూకా 23

23
1ఆ సభ వారందరు లేచి యేసును పిలాతు దగ్గరకు తీసుకువెళ్లారు. 2వారు ఆయన మీద, “ఇతడు మన దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడని మేము తెలుసుకున్నాము. ఇతడు కైసరుకు పన్ను కట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాడు మరియు నేనే రాజైన క్రీస్తును అని చెప్పుకుంటున్నాడు” అని నేరారోపణ చేయడం మొదలుపెట్టారు.
3అందుకు పిలాతు యేసును, “నీవు యూదుల రాజువా?” అని ఆయనను అడిగాడు.
దానికి యేసు, “అని నీవే అన్నావు” అని జవాబిచ్చారు.
4అందుకు అధిపతి పిలాతు, ముఖ్యయాజకులతో మరియు జనసమూహంతో, “ఇతనిలో నాకే దోషం కనిపించలేదు” అన్నాడు.
5అయినా వారు పట్టుబట్టి, “ఇతడు తన బోధలతో గలిలయ నుండి యూదయ ప్రాంతమంతట ప్రజలను రెచ్చగొడుతూ, ఇక్కడి వరకు వచ్చాడు” అన్నారు.
6ఇది విన్న పిలాతు, “ఈయన గలిలయుడా?” అని అడిగాడు. 7యేసు హేరోదు అధికారం క్రింద ఉన్న ప్రాంతానికి చెందినవాడని పిలాతుకు తెలిసినప్పుడు, ఆ రోజు యెరూషలేములోనే ఉన్న హేరోదు దగ్గరకు ఆయనను పంపించాడు.
8హేరోదు చాలా కాలం నుండి యేసును చూడాలని ఆశపడ్డాడు, కనుక ఆయనను చూడగానే అతడు చాలా సంతోషించాడు. యేసు గురించి తాను అనేక సంగతులను విన్నాడు కనుక ఆయన ఏదైనా సూచక క్రియ చేస్తే చూడాలని ఆశించాడు. 9హేరోదు ఆయనను ఎన్నో ప్రశ్నలు వేసాడు గాని యేసు వాటికి జవాబివ్వలేదు. 10ముఖ్య యాజకులు మరియు ధర్మశాస్త్ర ఉపదేశకులు నిలబడి, ఆయన మీద తీవ్ర నేరారోపణ చేశారు. 11హేరోదు మరియు అతని సైనికులు ఆయనను ఎగతాళి చేస్తూ అవమాన పరిచారు, ఆయనకు ప్రశస్తమైన వస్త్రాన్ని తొడిగించి, వారు ఆయనను మరల పిలాతు దగ్గరకు పంపించారు. 12అంతకు ముందు శత్రువులుగా ఉండిన హేరోదు మరియు పిలాతు ఆ రోజున స్నేహితులు అయ్యారు.
13తర్వాత పిలాతు ముఖ్యయాజకులను, అధికారులను మరియు ప్రజలను పిలిపించి, 14“ప్రజలను తిరుగుబాటు చేయిస్తున్నాడు అని మీరు ఈ మనుష్యుని నా దగ్గరకు తీసుకువచ్చారు. నేను మీ ముందే ఇతన్ని విచారించాను కానీ మీరు అతని మీద మోపిన నేరాల్లో ఒక్కటి కూడా ఇతనిలో నాకు కనబడలేదు. 15హేరోదుకు కూడా అతనిలో ఏ నేరం కనబడలేదని మరలా నా దగ్గరకు పంపించాడు; ఇదిగో, ఈయన మరణానికి తగిన నేరమేమి చేయలేదు. 16కనుక నేను ఇతనికి శిక్షించి విడుదల చేస్తాను” అని వారితో చెప్పాడు. [17పండుగ రోజు ప్రజల కోరిక ప్రకారం ఒక నేరస్థుని విడుదల చేయడం ఆనవాయితి.]#23:17 కొన్ని వ్రాతప్రతులలో ఈ వాక్యములు ఇక్కడ చేర్చబడలేదు
18అయితే వారందరు, “ఇతన్ని చంపి! మాకు బరబ్బాను విడుదల చెయ్యండి!” అని కలిసికట్టుగా కేకలు వేశారు. 19ఈ బరబ్బ పట్టణంలో జరిగిన ఒక తిరుగుబాటు చేసినందుకు మరియు హత్య చేసినందుకు చెరసాలలో పెట్టబడ్డాడు.
20పిలాతు యేసును విడుదల చేయాలని, వారికి తిరిగి విజ్ఞప్తి చేశాడు. 21కానీ వారు, “వీనిని సిలువ వేయండి! సిలువ వేయండి!” అని కేకలు వేశారు.
22మూడవసారి అతడు వారితో, “ఎందుకు? ఈ మనిషి చేసిన నేరమేంటి? ఇతనికి మరణశిక్షను విధించదగిన నేరమేమి నాకు కనపడలేదు. కనుక ఇతన్ని శిక్షించి వదిలి వేస్తాను” అని వారితో చెప్పాడు.
23కాని వారు ఇంకా గట్టిగా కేకలువేస్తూ ఆయన సిలువవేయబడాలని పట్టుబట్టారు, చివరికి వారి కేకలే గెలిచాయి. 24కనుక పిలాతు వారు కోరినట్లే చేయడానికి నిర్ణయించాడు 25వారు కోరుకొనిన విధంగా తిరుగుబాటు మరియు హత్యానేరాలతో చెరసాలలో ఉన్న బరబ్బాను వారికి విడుదల చేసి, యేసును వారి ఇష్టానికి అప్పగించాడు.
యేసును సిలువ వేయుట
26వారు ఆయనను సిలువ వేయడానికి తీసుకొని వెళ్తుండగా, ప్రక్క గ్రామం నుండి వస్తున్న కురేనీయుడైన సీమోను అనే ఒకన్ని పట్టుకొని, యేసు వెనుక సిలువను మోయడానికి ఆ సిలువను అతని మీద పెట్టారు. 27దుఃఖిస్తూ విలపిస్తున్న స్త్రీలతో పాటు పెద్ద జనసమూహం ఆయనను వెంబడించారు. 28యేసు వారివైపు తిరిగి వారితో, “యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడ్వకండి; మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడ్వండి. 29ఎందుకంటే ఒక సమయం రాబోతుంది అప్పుడు మీరు ‘గొడ్రాళ్ళు, కనని గర్భాలు, పాలియ్యని స్తనాలు ధన్యం అని అంటారు.’ 30అప్పుడు,
“పర్వతాలతో ‘మా మీద పడండి!’
కొండలతో, ‘మమ్మల్ని కప్పండి!’#23:30 హోషేయ 10:8
అని జనులు చెప్పుతారు. 31పచ్చగా ఉన్న చెట్టుకే వారు ఇలా చేస్తే, ఎండిన దానికి ఇంకా ఏమి చేస్తారు?” అని చెప్పారు.
32ఆయనతోపాటు మరి ఇద్దరు నేరస్థులను కూడ చంపడానికి తీసుకువచ్చారు. 33కపాలం అనే స్థలానికి వారు వచ్చినప్పుడు, ఆయనను నేరస్థులతో పాటు కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఒకన్ని పెట్టి సిలువ వేశారు. 34యేసు, “తండ్రీ, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించండి” అని చెప్పారు. వారు చీట్లు వేసి ఆయన బట్టలను పంచుకున్నారు.
35ప్రజలు నిలబడి ఇదంతా చూస్తున్నారు, అధికారులు కూడ, “వీడు ఇతరులను రక్షించాడు; వీడు నిజంగా దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయితే తనను తాను రక్షించుకోవాలి” అంటూ ఎగతాళి చేశారు.
36అప్పుడు సైనికులు కూడా ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు చిరకాను పులిసిన ద్రాక్షరసం అందించి, 37“నీవు యూదుల రాజువైతే, నిన్ను నీవే రక్షించుకో” అని ఆయనను వెక్కిరించారు.
38ఆయనపై ఉన్న నేరం యొక్క వ్రాతపూర్వక ఉత్తర్వు ఇలా ఉంది:
ఇతడు యూదుల రాజు.
39వ్రేలాడుతున్న ఆ నేరస్థులలో ఒకడు ఆయనను అవమానిస్తూ, “నీవు క్రీస్తువు కాదా? నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడ రక్షించు!” అని హేళన చేశాడు.
40కానీ మరొక నేరస్థుడు వానిని గద్దించి, “నీవు కూడా అదే శిక్షను పొందుతున్నావు, నీవు దేవునికి భయపడవా?” అన్నాడు. 41“మనం చేసిన తప్పులకు న్యాయంగానే శిక్షను అనుభవిస్తున్నాం కాని ఈయన ఏ తప్పు చేయలేదు” అన్నాడు.
42ఆ తర్వాత ఆ నేరస్థుడు యేసును చూసి, “నీవు నీ రాజ్యంలో వస్తునప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో” అన్నాడు.
43యేసు వానితో, “నేడు నీవు నాతో కూడ పరదైసులో ఉంటావని, నీతో నిశ్చయంగా చెప్తున్నాను” అన్నారు.
యేసు మరణం
44అప్పుడు మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మింది. 45సూర్యుడు కాంతినివ్వలేదు. దేవాలయపు తెర రెండుగా చినిగిపోయింది. 46#23:46 కీర్తన 31:5అప్పుడు యేసు, “తండ్రీ, మీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను” అని గొప్ప శబ్దంతో కేక వేశారు. ఆయన ఈ మాట చెప్పి, తన ప్రాణం విడిచారు.
47శతాధిపతి, జరిగింది చూసి, “ఈ మనుష్యుడు నిజంగా నీతిమంతుడు” అని చెప్పి దేవుని స్తుతించాడు. 48ఈ దృశ్యాన్ని చూస్తూ అక్కడ ఉన్న ప్రజలందరు జరిగిందంతా చూసి, రొమ్ము కొట్టుకొంటూ తిరిగి వెళ్లిపోయారు. 49ఆయనతో పరిచయం ఉన్నవారందరు, గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలతో సహా అందరు దూరంగా నిలబడి చూస్తున్నారు.
యేసును సమాధిలో ఉంచుట
50అరిమతయికు చెందిన యోసేపు యూదుల న్యాయసభలో సభ్యుడు, మంచివాడు మరియు నీతిపరుడు. 51అతడు ఇతర న్యాయసభ సభ్యుల తీర్మానానికి గానీ వారి చర్యకు గానీ అంగీకరించకుండా దేవుని రాజ్యం కొరకు కనిపెడుతూ ఉండినవాడు. 52అతడు పిలాతు దగ్గరకు వెళ్లి, యేసు దేహాన్ని తనకు ఇమ్మని అడిగాడు. 53తర్వాత అతడు దాన్ని క్రిందకు దింపి, దానిని సన్నపు నారబట్టతో చుట్టి, అంతకు ముందు ఎవరి శరీరాన్ని ఎప్పుడూ పెట్టని రాతితో చెక్కబడిన సమాధిలో పెట్టాడు. 54అది సిద్ధపాటు దినము మరియు సబ్బాతు దినం మొదలుకాబోతుంది.
55అప్పుడు గలిలయ నుండి యేసును వెంబడిస్తూ వచ్చిన స్త్రీలు అతని వెంట వెళ్లి ఆ సమాధిని, ఆయన దేహాన్ని ఎలా పెట్టారో చూసారు. 56తర్వాత వారు ఇంటికి వెళ్లి, సుగంధ ద్రవ్యాలను, పరిమళ తైలాలను సిద్ధం చేసుకున్నారు. కాని వారు ఆజ్ఞకు లోబడుతూ సబ్బాతు దినాన విశ్రాంతి తీసుకున్నారు.

Kleurmerk

Deel

Kopieer

None

Wil jy jou kleurmerke oor al jou toestelle gestoor hê? Teken in of teken aan