ఆది 9

9
నోవహుతో దేవుని నిబంధన
1అప్పుడు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదిస్తూ, “మీరు ఫలించి అభివృద్ధి పొంది భూలోకాన్ని నింపండి. 2భూలోకంలో ఉన్న అన్ని రకాల జంతువులు, ఆకాశంలోని అన్ని రకాల పక్షులు, నేల మీద తిరిగే ప్రతీ జీవి, సముద్రంలో ఉన్న అన్ని చేపలు మీకు భయపడతాయి భీతి చెందుతాయి; అవి మీ చేతికి అప్పగించబడ్డాయి. 3జీవిస్తూ తిరిగే ప్రతిదీ మీకు ఆహారం అవుతుంది. పచ్చని మొక్కలను నేను మీకు ఇచ్చినట్టుగా ఇప్పుడు అన్నిటిని మీకు ఇస్తున్నాను.
4“అయితే మాంసంలో ప్రాణాధారమైన రక్తం ఉంటే మీరు తినకూడదు. 5ఎవరైనా ఇంకొకరి ప్రాణం తీస్తే నేను వారి రక్తం గురించి లెక్క అడుగుతాను. అడవి జంతువు ఒక మనుష్యుని చంపితే, అది చంపబడాలి. ఎవరైనా తోటి మనుష్యుల ప్రాణం తీస్తే దాని గురించి నేను లెక్క అడుగుతాను.
6“ఎవరైనా మనుష్యుని రక్తం చిందిస్తే,
మనుష్యులచే వారి రక్తం చిందించబడాలి;
ఎందుకంటే దేవుడు తన స్వరూపంలో
మనుష్యుని సృజించారు.
7మీరైతే, ఫలించి, అభివృద్ధిచెంది; భూమిపై విస్తరించండి” అని చెప్పారు.
8దేవుడు నోవహుతో అతని కుమారులతో ఇలా అన్నారు: 9“నేను మీతో మీ రాబోయే తరం వారితో నా నిబంధన స్థిరపరస్తున్నాను, 10మీతో పాటు ఉన్న ప్రతి జీవితో అనగా పక్షులతో, పశువులతో, సమస్త అడవి జంతువులతో, ఓడలో నుండి మీతో పాటు బయటకు వచ్చిన జీవులన్నిటితో, భూమిపై ఉన్న ప్రతి జీవితోను నా నిబంధన స్థిరపరస్తున్నాను. 11నేను నీతో చేసిన నిబంధనను ధృవీకరిస్తున్నాను: ఇక ఎన్నడు వరద నీటితో సమస్త ప్రాణులు నాశనం కావు; భూమిని నాశనం చేసే జలప్రళయం ఇక ఎన్నడు రాదు.”
12దేవుడు ఇలా అన్నారు, “నాకును మీకును, మీతో ఉన్న ప్రతి ప్రాణికిని మధ్య తరాలన్నిటి కోసం నేను చేస్తున్న నిబంధనకు గుర్తు ఇదే: 13నేను మేఘాలలో నా ధనుస్సును పెట్టాను, అది నాకూ భూమికి మధ్య నిబంధన గుర్తుగా ఉంటుంది. 14నేను భూమిపై మేఘాలను తీసుకువచ్చినప్పుడు ఈ ధనుస్సు మేఘాలలో కనిపిస్తుంది, 15అప్పుడు నేను నాకును మీకును, ప్రతి రకమైన ప్రాణులకు మధ్య ఉన్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను. ఇక ఎన్నడు కూడా సమస్త జీవులన్నిటిని నాశనం చేయడానికి నీరు వరదలా మారదు. 16మేఘాలలో ధనస్సు కనిపించినప్పుడు, నేను దానిని చూసి దేవునికి, భూమిపై ఉన్న సమస్త ప్రాణులకు మధ్య నేను చేసిన నిత్యనిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను.”
17ఇంకా దేవుడు నోవహుతో, “ఇది నాకూ భూమిపై ఉన్న సమస్త జీవులకు మధ్య ఉన్న నిబంధనకు గుర్తు” అని చెప్పారు.
నోవహు కుమారులు
18ఓడలో నుండి వచ్చిన నోవహు కుమారులు షేము, హాము, యాపెతు. (హాము కనానీయులకు తండ్రి.) 19ఈ ముగ్గురు నోవహు కుమారులు, వీరి నుంచే భూలోకమంతా ప్రజలు విస్తరించారు.
20వ్యవసాయకుడైన నోవహు ద్రాక్షతోట నాటడం ఆరంభించాడు. 21అతడు కొంత మద్యం త్రాగి మత్తులో తన గుడారంలో బట్టలు లేకుండా పడి ఉన్నాడు. 22కనాను తండ్రియైన హాము తన తండ్రి దిగంబరిగా ఉండడం చూసి బయట ఉన్న తన ఇద్దరు అన్నలకు చెప్పాడు. 23అయితే షేము, యాపెతు ఒక వస్త్రం తీసుకుని తమ భుజాల మీద వేసుకుని వెనుకకు నడిచి వెళ్లి తమ తండ్రి నగ్న శరీరాన్ని కప్పారు. తండ్రి నగ్న శరీరం వైపు చూడకుండ వారు తమ ముఖాలను మరోవైపుకు తిప్పుకున్నారు.
24నోవహుకు మత్తు వదిలిన తర్వాత చిన్నకుమారుడు తనకు చేసింది తెలుసుకుని, 25ఇలా అన్నాడు,
“కనాను శపించబడాలి!
అతడు తన సహోదరులకు
దాసులలో అత్యల్పునిగా ఉంటాడు.”
26ఇంకా అతడు,
“షేము దేవుడైన యెహోవాకు స్తుతి!
కనాను అతనికి దాసుడవాలి.
27దేవుడు యాపెతు#9:27 యాపెతు హెబ్రీలో విస్తరణ అని అర్థం ఇచ్చే పదంలా ఉంది సరిహద్దును విస్తరింపజేయాలి;
యాపెతు షేము గుడారాల్లో నివసించాలి,
కనాను యాపెతుకు దాసుడవాలి”
అని అన్నాడు.
28జలప్రళయం తర్వాత నోవహు ఇంకా 350 సంవత్సరాలు జీవించాడు. 29నోవహు మొత్తం 950 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.

Tans Gekies:

ఆది 9: OTSA

Kleurmerk

Deel

Kopieer

None

Wil jy jou kleurmerke oor al jou toestelle gestoor hê? Teken in of teken aan