YouVersion Logo
Search Icon

ప్రసంగి 4

4
అణచివేత, శ్రమ, స్నేహరాహిత్యం
1సూర్యుని క్రింద జరుగుతున్న అణచివేతనంతటిని నేను చూశాను:
సూర్యుని క్రింద అణగారిన వారి కన్నీటిని నేను చూశాను,
కాబట్టి వారిని ఆదరించేవారెవరూ లేరు;
బాధపెట్టేవారు బలవంతులు,
వారిని ఆదరించేవారెవరూ లేరు.
2ఇంకా జీవించి ఉన్నవారి కంటే
మునుపే చనిపోయినవారు,
సంతోషంగా ఉన్నారని
నేను అనుకున్నాను.
3ఇంకా పుట్టనివారు,
సూర్యుని క్రింద జరిగే
చెడును చూడనివారు,
ఈ ఇరువురి కన్నా ధన్యులు.
4కష్టమంతటితో సాధించినవన్నీ ఒకరిపట్ల ఒకరికి అసూయ కలిగిస్తున్నాయని నేను చూశాను. ఇది కూడా అర్థరహితమే, గాలికి శ్రమ పడినట్లే.
5మూర్ఖులు చేతులు ముడుచుకుని
తమను తాము పతనం చేసుకుంటారు.#4:5 హెబ్రీలో తమ మాంసాన్నే తింటారు
6రెండు చేతులతో గాలి కోసం శ్రమించడం కంటే
ఒక చేతినిండ నెమ్మది ఉంటే
అది ఎంతో మేలు.
7నేను సూర్యుని క్రింద మళ్ళీ అర్థరహితమైన దానిని చూశాను:
8ఒక ఒంటరివాడు ఉండేవాడు;
అతనికి కుమారుడు కాని సోదరుడు కాని లేరు.
కాని అతడు నిత్యం కష్టపడుతూనే ఉన్నాడు,
అయినప్పటికీ అతని సంపద అతని కళ్లను తృప్తిపరచలేకపోయింది.
“నేను ఎవరి కోసం కష్టపడుతున్నాను?
నేను ఎందుకు ఆనందంగా లేను?” అని ప్రశ్నించుకున్నాడు,
ఇది కూడా అర్థరహితమే
విచారకరమైన క్రియ!
9ఒకరికంటే ఇద్దరు మేలు,
ఎందుకంటే ఇద్దరూ కష్టపడితే మంచి రాబడి ఉంటుంది:
10ఒకవేళ ఇద్దరిలో ఒకరు పడితే
రెండవవాడు ఇతడిని లేవనెత్తగలడు.
ఒంటరివాడు పడితే
లేవనెత్తేవాడెవడూ ఉండడు.
11అలాగే, ఇద్దరు కలిసి పడుకుంటే, వారు వెచ్చగా ఉంటారు.
అయితే ఒంటరివారు ఎలా వెచ్చగా ఉండగలరు?
12ఒంటరి వారిని పడద్రోయడం తేలిక,
ఇద్దరు కలిసి తమను తాము రక్షించుకోగలరు.
మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు.
అభివృద్ధి అర్థరహితమే
13మూర్ఖుడై హెచ్చరికలు వినడానికి ఇష్టపడని ముసలి రాజుకంటే బీదవాడైన జ్ఞానంగల యువకుడే నయము. 14అలాంటి యువకుడు చెరసాలలో నుండి బయటపడి పట్టాభిషేకం పొందవచ్చు. తన దేశంలో దరిద్రుడిగా పుట్టినా రాజు కాగలడు. 15సూర్యుని క్రింద జీవిస్తూ తిరిగే వారందరూ రాజు బదులు రాజైన ఆ యువకుని అనుసరిస్తారని నేను తెలుసుకున్నాను. 16అతని అధికారం క్రింద ఉన్న ప్రజలు అసంఖ్యాకులు. కానీ తర్వాత వచ్చినవారు అతని పట్ల సంతోషించరు. ఇది కూడా అర్థరహితమే, గాలికి ప్రయాసపడడమే.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in