ప్రసంగి 5
5
దేవునికి నీ మ్రొక్కుబడిని చెల్లించు
1నీవు దేవుని ఆలయానికి వెళ్లినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. తాము దుర్మార్గపు పనులు చేస్తున్నామని తెలుసుకోకుండా మూర్ఖుల్లా బలి అర్పించడం కన్నా దగ్గరకు వెళ్లి వినడం మంచిది.
2దేవుని ముందు అనాలోచితంగా మాట్లాడటానికి,
నీ హృదయం తొందరపడకుండ
నీ నోటిని కాచుకో.
దేవుడు ఆకాశంలో ఉన్నారు
నీవు భూమిపై ఉన్నావు,
కాబట్టి నీ మాటలు తక్కువగా ఉండాలి.
3విస్తారమైన పనుల వల్ల కలలు వస్తాయి.
ఎక్కువ మాటలు మాట్లాడేవారు మూర్ఖునిలా మాట్లాడతారు.
4నీ దేవునికి చేసుకున్న మ్రొక్కుబడిని చెల్లించడంలో ఆలస్యం చేయవద్దు. మూర్ఖుల గురించి దేవుడు సంతోషించరు, నీ మ్రొక్కుబడిని చెల్లించు. 5మ్రొక్కుబడి చేసి చెల్లించక పోవడం కంటే మ్రొక్కుబడి చేయకపోవడమే మంచిది. 6నీ మాటలు నిన్ను పాపంలోకి పడవేయకుండా చూసుకో. ఆలయ దూతకు, “పొరపాటున మొక్కుబడి చేశాను” అని చెప్పవద్దు. నీ మాటలకు దేవుడు కోప్పడి నీ చేతిపనిని నాశనం చేయడం అవసరమా? 7ఎక్కువ కలలు ఎక్కువ మాటలు అర్థరహితమే. కాబట్టి దేవునికి భయపడు.
ధనం అర్థరహితం
8ఒక ప్రాంతంలో పేదలను అణచివేయడం, న్యాయాన్ని హక్కులను పాటించకపోవడం లాంటివి నీవు చూస్తే ఆశ్చర్యపడవద్దు; ఎందుకంటే ఒక అధికారి మీద పైఅధికారులు ఉంటారు, వారందరిపైన ఉన్నతాధికారులు ఉంటారు. 9దేశం అభివృద్ధి చెందినప్పుడు అందరు పంచుకుంటారు; స్వయాన రాజు పొలాల నుండి లబ్ది పొందుతారు.
10డబ్బును ప్రేమించేవారు ఆ డబ్బుతో తృప్తి పడరు;
సంపదను ప్రేమించేవారు తమ ఆదాయంతో ఎప్పుడూ సంతృప్తి చెందరు.
ఇది కూడా అర్థరహితము.
11ఆస్తి ఎక్కువవుతూ ఉంటే,
దాన్ని దోచుకునేవారు కూడా ఎక్కువవుతారు.
యజమానులకు తమ ఆస్తిని కళ్లతో చూడడం తప్ప,
దానివల్ల వారికేమి ప్రయోజనం?
12శ్రమజీవులు కొంచెం తిన్నా ఎక్కువ తిన్నా,
సుఖంగా నిద్రపోతారు,
కానీ ధనికులకున్న సమృద్ధి
వారికి నిద్రపట్ట నివ్వదు.
13సూర్యుని క్రింద బాధాకరమైన ఒక చెడ్డ విషయాన్ని నేను చూశాను:
దాచి ఉంచిన సంపద యజమానునికి హాని తెస్తుంది,
14లేదా దురదృష్టవశాత్తూ వారి సంపద పోతుంది,
వారికి పిల్లలు కలిగినప్పుడు
వారికి వారసత్వంగా ఏమీ మిగలదు.
15ప్రతి ఒక్కరు తల్లి గర్భం నుండి దిగంబరిగా వచ్చినట్లే
దిగంబరిగానే వెళ్లిపోతారు.
తాము కష్టపడిన దానిలో నుండి వారు
తమ చేతుల్లో ఏమి మోసుకు వెళ్లరు.
16మరొక చెడ్డ విషయం:
ప్రతి ఒక్కరూ ఎలా వస్తారో, వారు అలాగే వెళ్లిపోతారు,
వారు గాలికి ప్రయాసపడుతున్నారు
కాబట్టి వారు ఏమి పొందుతారు?
17వారు చాలా నిరాశతో, బాధలతో, కోపంతో,
తమ దినాలన్ని చీకటిలో భోజనం చేస్తారు.
18నేను గమనించిన వాటిలో మంచిది ఏదనగా: దేవుడు తనకిచ్చిన రోజులన్నిటిలో ఒక వ్యక్తి తిని, త్రాగుతూ సూర్యుని క్రింద తాను చేసిన శ్రమతో సంతృప్తి చెందాలి. ఎందుకంటే ఇదే వారు చేయవలసింది. 19అంతేకాక, దేవుడు ఒక వ్యక్తికి సంపదను ఆస్తులను వాటిని అనుభవించగల సామర్థ్యాన్ని ఇచ్చినప్పుడు, వారు తమ భాగాన్ని తీసుకుని వారి కష్టార్జితంలో వారు ఆనందంగా ఉండాలి; ఇది దేవుని వరము. 20దేవుడతనికి హృదయంలో ఆనందం కలిగిస్తారు కాబట్టి అతడు తన గతాన్ని సులభంగా మరిచిపోగలుగుతాడు. వారు వారి జీవితపు రోజులను చాలా అరుదుగా ప్రతిబింబిస్తారు.
Currently Selected:
ప్రసంగి 5: OTSA
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.