Akara Njirimara YouVersion
Akara Eji Eme Ọchịchọ

లూకా సువార్త 2

2
యేసు పుట్టుక
1ఆ దినాల్లో రోమా రాజ్యమంతటా ప్రజా సంఖ్యను నిర్వహించాలని కైసరు ఆగస్టస్ ఆజ్ఞాపించాడు. 2(ఇది కురేనియు సిరియా దేశాధిపతిగా ఉన్నప్పుడు తీసిన మొదటి ప్రజాసంఖ్య.) 3ప్రతి ఒక్కరు తమ పేర్లను నమోదు చేయించుకోడానికి తమ స్వగ్రామాలకు వెళ్లారు.
4కాబట్టి యోసేపు కూడా దావీదు వంశస్థుడు కాబట్టి, అతడు గలిలయ ప్రాంతంలోని నజరేతు గ్రామం నుండి, యూదయ ప్రాంతంలోని బేత్లెహేము అనే దావీదు పట్టణానికి వెళ్లాడు, ఎందుకంటే అతడు దావీదు వంశస్థుడు. 5తనతో పెండ్లికి ప్రధానం చేయబడి, గర్భవతిగా ఉన్న మరియతో పాటు తమ పేర్లను నమోదు చేయించుకోవడానికి వెళ్లాడు. 6వారు అక్కడ ఉన్నపుడు, ఆమె నెలలు నిండి, తన మొదటి కుమారుని కన్నది. 7సత్రంలో వారికి స్థలం దొరకలేదు, కాబట్టి ఆమె ఆ శిశువును మెత్తని గుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పడుకోబెట్టింది.
8ఆ ప్రాంతంలోని గొర్రెల కాపరులు కొందరు దగ్గరలో ఉన్న పొలాల్లో ఉండి, రాత్రి జామున తమ మందను కాచుకుంటూ ఉన్నారు. 9ప్రభువు దూత వారికి కనబడినప్పుడు, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించడంవల్ల, వారు భయంతో వణికిపోయారు. 10అయితే ఆ దూత వారితో, “భయపడకండి, ప్రజలందరికి గొప్ప సంతోషాన్ని కలిగించే శుభవార్తను నేను మీకు తెచ్చాను. 11దావీదు పట్టణంలో ఈ రోజే రక్షకుడు మీ కోసం పుట్టాడు; ఆయన ప్రభువైన క్రీస్తు.#2:11 క్రీస్తు అంటే మెస్సీయా అని అర్థం 12మీరు గుర్తు పట్టడానికి మీకు గుర్తు ఇదే: ఒక శిశువు మెత్తని గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పడుకోబెట్టి ఉండడం మీరు చూస్తారు” అని చెప్పాడు.
13అప్పుడు అకస్మాత్తుగా ఆ దూతతో పాటు ఆకాశంలో దూతల గొప్ప సమూహం కనబడి, ఈ విధంగా దేవుని స్తుతించారు,
14“అత్యున్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ,
ఆయనకు ఇష్టమైనవారికి భూమి మీద సమాధానం కలుగును గాక.”
15ఆ దూతలు వారి దగ్గర నుండి పరలోకానికి వెళ్లిన తర్వాత, ఆ గొర్రెల కాపరులు ఒకరితో ఒకరు, “రండి మనం బేత్లెహేము పట్టణానికి వెళ్లి, దేని గురించైతే ప్రభువు మనకు చెప్పారో, ఆ జరిగిన దానిని చూద్దాం” అని చెప్పుకొన్నారు.
16కాబట్టి వారు త్వరపడి వెళ్లి మరియను యోసేపును తొట్టిలో పడుకుని ఉన్న శిశువును చూశారు 17వారు ఆ శిశువును చూసి, ఆ శిశువు గురించి తమతో చెప్పబడిన సంగతులను వారు ఇతరులకు చెప్పారు. 18గొర్రెల కాపరులు తమతో చెప్పిన మాటలను విన్నవారందరు ఎంతో ఆశ్చర్యపడ్డారు. 19అయితే మరియ ఆ మాటలన్నింటిని తన హృదయంలో భద్రం చేసుకుని వాటి గురించి ఆలోచిస్తూ ఉండింది. 20ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా, తాము విని చూసిన వాటన్నిటిని గురించి దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ తిరిగి వెళ్లారు.
21ఆ శిశువుకు సున్నతి చేయాల్సిన ఎనిమిదవ రోజున, ఆయనను గర్భం దాల్చక ముందు దేవదూత చెప్పినట్లు, ఆయనకు యేసు అని పేరు పెట్టారు.
యేసును దేవాలయంలో ప్రతిష్ఠించుట
22మోషే ధర్మశాస్త్రం ప్రకారం శుద్ధీకరణ రోజులు పూర్తియైన తర్వాత, యోసేపు మరియలు ఆ శిశువును ప్రభువునకు ప్రతిష్ఠించడానికి యెరూషలేముకు తీసుకెళ్లారు. 23(ప్రభువు ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నట్లుగా, “ప్రతి తొలి మగబిడ్డ ప్రభువునకు ప్రతిష్ఠించబడాలి”#2:23 నిర్గమ 13:2,12), 24ప్రభువు ధర్మశాస్త్రంలో చెప్పబడినట్లుగా: “గువ్వల జతను, లేదా రెండు చిన్న పావురాలను”#2:24 లేవీ 12:8 బలిగా అర్పించడానికి తీసుకెళ్లారు.
25ఆ సమయంలో యెరూషలేములో నీతిమంతుడు భక్తిపరుడైన, సుమెయోను అని పిలువబడే ఒక వృద్ధుడున్నాడు. అతడు ఇశ్రాయేలు యొక్క ఆదరణ కోసం ఎదురు చూస్తున్నవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నాడు. 26అతడు ప్రభువుని అభిషిక్తుని అనగా క్రీస్తును చూడకుండ చనిపోడని పరిశుద్ధాత్మ ద్వార బయలుపరచబడింది. 27అతడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో, దేవాలయ ఆవరణంలోనికి వెళ్లాడు. ధర్మశాస్త్ర ఆచార ప్రకారం శిశువైన యేసుకు జరిగించడానికి ఆయన తల్లిదండ్రులు ఆయనను లోపలికి తీసుకువచ్చినప్పుడు, 28సుమెయోను ఆ శిశువుని తన చేతుల్లోకి తీసుకుని దేవుని స్తుతిస్తూ, ఇలా అన్నాడు:
29“సర్వశక్తిగల ప్రభువా, నీ మాట ప్రకారం,
ఇప్పుడు సమాధానంతో నీ దాసుని వెళ్లనివ్వు.
30-32సర్వలోక ప్రజల కోసం నీవు సిద్ధపరచిన,
నీ రక్షణను నా కళ్లారా చూశాను,
అది యూదేతరులందరికి నిన్ను ప్రత్యక్షపరచే వెలుగుగా,
నీ ప్రజలైన ఇశ్రాయేలు యొక్క మహిమగా ఉన్నది.”
33ఆయన గురించి చెప్పిన మాటలను విన్న ఆయన తల్లిదండ్రులు ఆశ్చర్యపడ్డారు. 34సుమెయోను వారిని దీవించి ఆయన తల్లియైన మరియతో: “ఇశ్రాయేలీయులలో అనేకమంది పడిపోవడానికి లేవడానికి కారణంగాను, వ్యతిరేకంగా చెప్పుకోడానికి గుర్తుగాను ఉండడానికి ఈ శిశువు నియమించబడ్డాడు, 35తద్వారా అనేకమంది హృదయాలోచనలు బయలుపరచబడతాయి, నీ హృదయంలోకి కూడా ఒక ఖడ్గం దూసికొనిపోతుంది.”
36అలాగే ఆషేరు గోత్రానికి చెందిన, పనూయేలు కుమార్తెయైన, అన్న, అనే ఒక ప్రవక్తి కూడా అక్కడ ఉండింది. ఆమె చాలా వృద్ధురాలు; ఆమె పెళ్ళి చేసుకుని ఏడు సంవత్సరాలు భర్తతో కాపురం చేసి, 37తర్వాత ఎనభై నాలుగు సంవత్సరాలు నిండేవరకు విధవరాలుగా ఉండింది. ఆమె ఎప్పుడు దేవాలయాన్ని విడిచిపెట్టకుండా, రాత్రింబవళ్ళు ఉపవాస ప్రార్థనలతో ఆరాధిస్తున్నది. 38ఆమె కూడ ఆ సమయంలోనే దేవాలయ ఆవరణంలో వారి దగ్గరకు వచ్చి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించి, యెరూషలేము విమోచన కోసం ఎదురు చూస్తున్న వారందరితో శిశువు గురించి చెప్పింది.
39యోసేపు మరియలు ప్రభువు ధర్మశాస్త్రం ప్రకారం అన్ని జరిగించిన తర్వాత, గలిలయలోని నజరేతు అనే తమ పట్టణానికి వెళ్లారు. 40బాలుడు ఎదిగి బలం పొందుకొన్నాడు; ఆయన జ్ఞానంతో నింపబడ్డాడు, దేవుని దయ ఆయన మీద ఉండింది.
దేవాలయంలో బాలుడైన యేసు
41ప్రతి సంవత్సరం పస్కా పండుగకు యేసు తల్లిదండ్రులు యెరూషలేముకు వెళ్లేవారు. 42ఆయన పన్నెండేళ్ళ వాడై ఉన్నప్పుడు, ఆచారం ప్రకారం వారు పండుగకు వెళ్లారు. 43ఆ పండుగ ముగిసిన తర్వాత, వారు తిరిగి ఇంటికి వెళ్తుండగా, బాలుడైన యేసు యెరూషలేములోనే ఉండిపోయారు కాని ఆయన తల్లిదండ్రులకు ఆ సంగతి తెలియలేదు. 44ఆయన తమ గుంపు వారితోనే ఉన్నాడని అనుకుని, వారు ఒక రోజు ప్రయాణం చేశారు. తర్వాత తమ బంధువులలోను పరిచితులలోను ఆయన కోసం వెదకడం మొదలుపెట్టారు. 45వారికి ఆయన కనబడకపోయేసరికి, వారు ఆయనను వెదకడానికి తిరిగి యెరూషలేముకు వెళ్లారు. 46మూడు దినాలైన తర్వాత దేవాలయ ఆవరణంలో, బోధకుల మధ్య ఆయన కూర్చుని, వారి మాటలను వింటూ వారిని ప్రశ్నలు అడగడం వారు చూశారు 47ఆయన మాటలను విన్న ప్రతి ఒక్కరు ఆయనకున్న గ్రహింపుకు, ఆయన ఇచ్చే జవాబులకు ఆశ్చర్యపడ్డారు. 48ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి, విస్తుపోయారు. ఆయన తల్లి ఆయనతో, “కుమారుడా, ఎందుకు ఇలా చేశావు? నేను మీ తండ్రి ఆందోళన చెంది నీకోసం వెదకుతున్నాము” అన్నది.
49అందుకు ఆయన, “మీరెందుకు నా కోసం వెదుకుతున్నారు? నేను నా తండ్రి ఇంట్లో#2:49 లేదా నా తండ్రి పనిలో ఉండాలని మీకు తెలియదా?” అని వారితో అన్నారు. 50అయితే ఆయన వారితో చెప్తున్న దానిని వారు గ్రహించలేకపోయారు.
51ఆ తర్వాత యేసు వారితో కలిసి నజరేతుకు వెళ్లి వారికి లోబడి ఉన్నారు. అయితే ఆయన తల్లి ఈ సంగతులన్నిటిని తన హృదయంలో భద్రం చేసుకున్నది. 52యేసు జ్ఞానంలోను వయస్సులోను దేవుని దయలోను మనుష్యుల దయలోను వర్ధిల్లారు.

Mee ka ọ bụrụ isi

Kesaa

Mapịa

None

Ịchọrọ ka echekwaara gị ihe ndị gasị ị mere ka ha pụta ìhè ná ngwaọrụ gị niile? Debanye aha gị ma ọ bụ mee mbanye