Akara Njirimara YouVersion
Akara Eji Eme Ọchịchọ

లూకా సువార్త 6

6
యేసు సబ్బాతు దినానికి ప్రభువు
1ఒక సబ్బాతు దినాన యేసు పంటచేనుల గుండా వెళ్తున్నప్పుడు, ఆయన శిష్యులు కొన్ని కంకులు తెంపుకొని, తమ చేతుల్లో వాటిని నలిపి తినడం మొదలుపెట్టారు. 2అది చూసిన పరిసయ్యులు కొందరు, “మీరెందుకు సబ్బాతు దినాన చేయకూడని పని చేస్తున్నారు?” అని వారిని అడిగారు.
3యేసు వారితో, “దావీదుకు అతనితో ఉన్నవారికి ఆకలి వేసినప్పుడు అతడు ఏమి చేశాడో మీరు చదవలేదా? 4అతడు దేవుని మందిరంలో ప్రవేశించి, యాజకులు తప్ప మరి ఎవరు తినకూడని ప్రతిష్ఠిత రొట్టెను తీసుకుని, తాను తిని తనతో ఉన్నవారికి కూడా ఇచ్చాడు” అని జవాబిచ్చారు. 5ఆ తర్వాత యేసు వారితో, “మనుష్యకుమారుడు సబ్బాతు దినానికి ప్రభువు” అని చెప్పారు.
6మరొక సబ్బాతు దినాన ఆయన సమాజమందిరానికి వెళ్లి బోధిస్తుండగా, అక్కడ కుడి చేతికి పక్షవాతం కలవాడు ఒకడున్నాడు. 7యేసు మీద నేరం మోపడానికి కారణం వెదుకుతున్న పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు ఆయన సబ్బాతు దినాన వానిని స్వస్థపరుస్తారేమో అని కనిపెట్టుకొని ఉన్నారు. 8అయితే యేసు వారి ఆలోచనలను తెలిసినవాడై చేతికి పక్షవాతం గలవానితో, “లేచి అందరి ముందు నిలబడు” అన్నారు. అందుకతడు లేచి నిలబడ్డాడు.
9అప్పుడు యేసు, “నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, సబ్బాతు దినాన ఏది న్యాయం: మంచి చేయడమా లేదా చెడు చేయడమా, ప్రాణం రక్షించడమా లేదా ప్రాణం తీయడమా?” అని వారిని అడిగారు.
10ఆయన చుట్టూ ఉన్నవారిని చూసి, చేతికి పక్షవాతం గలవానితో, “నీ చేయి చాపు” అన్నారు. వాడు అలాగే చేశాడు, వాని చేయి పూర్తిగా బాగయింది. 11అయితే పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు మండిపడి యేసును ఏమి చేయాలా అని ఒకరితో ఒకరు చర్చించుకోవడం మొదలుపెట్టారు.
పన్నెండుమంది అపొస్తలులు
12ఆ రోజుల్లో ఒక రోజు ప్రార్థించడానికి యేసు కొండెక్కి రాత్రంతా దేవుని ప్రార్థిస్తూ గడిపారు. 13ఉదయమైనప్పుడు, ఆయన తన శిష్యులను పిలిచి వారిలో పన్నెండుమందిని ఎన్నుకుని, వారిని అపొస్తలులుగా నియమించారు. అపొస్తలులు అనగా “పిలువబడిన వారు” అని అర్థము:
14వారు ఎవరనగా, ఆయన పేతురు అని పేరుపెట్టిన సీమోను, అతని సహోదరుడు అంద్రెయ,
యాకోబు,
యోహాను,
ఫిలిప్పు,
బర్తలోమయి,
15మత్తయి,
తోమా,
అల్ఫయి కుమారుడైన యాకోబు,
జెలోతే#6:15 అంటే మతాభిమాని లేదా అత్యాసక్తి కలవాడు అని పిలువబడే సీమోను,
16యాకోబు కుమారుడైన యూదా,
ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా.
దీవెనలు శ్రమలు
17ఆయన కొండ దిగి వారితో పాటు మైదానంలో నిలబడ్డారు. అక్కడ ఆయన శిష్యుల యొక్క గొప్ప జనసమూహం ఉంది, యూదయ అంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు, సీదోను చుట్టూ ఉన్న తీరప్రాంతం నుండి వచ్చిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. 18వారు ఆయన చెప్పే బోధను వినడానికి తమ వ్యాధుల నుండి స్వస్థత పొందడానికి వచ్చారు. అపవిత్రాత్మలు పీడిస్తున్న వారు కూడా బాగుపడ్డారు, 19ప్రజలందరూ ఆయనను ముట్టుకోవాలని ప్రయత్నించారు ఎందుకంటే, ఆయనలో నుండి ప్రభావం బయలుదేరి వారందరిని స్వస్థపరుస్తున్నది.
20తన శిష్యులవైపు చూస్తూ, ఆయన ఇలా బోధించారు:
“దీనులైన మీరు ధన్యులు,
దేవుని రాజ్యం మీదే.
21ఇప్పుడు ఆకలిగొనిన మీరు ధన్యులు,
మీరు తృప్తిపొందుతారు.
ఇప్పుడు ఏడుస్తున్న మీరు ధన్యులు,
మీరు నవ్వుతారు.
22మనుష్యకుమారుని నిమిత్తం
ప్రజలు మిమ్మల్ని ద్వేషించి,
వెలివేసి, మిమ్మల్ని అవమానించి,
మీరు చెడ్డవారని మీ పేరును తృణీకరించినప్పుడు మీరు ధన్యులు.
23“ఆ రోజు మీరు సంతోషించి గంతులు వేయండి, ఎందుకంటే పరలోకంలో మీ బహుమానం గొప్పది. ఎందుకంటే వారి పితరులు కూడా ప్రవక్తలను ఇలాగే హింసించారు.
24“కాని ధనవంతులారా మీకు శ్రమ,
మీ ఆదరణను మీరు ఇప్పటికే పొందుకున్నారు.
25ఇప్పుడు కడుపు నింపుకొన్న వారలారా మీకు శ్రమ,
మీరు ఆకలిగొంటారు.
ఇప్పుడు నవ్వుతున్న వారలారా మీకు శ్రమ,
మీరు దుఃఖించి రోదిస్తారు.
26మనుష్యులందరు మిమ్మల్ని పొగిడినప్పుడు మీకు శ్రమ,
వారి పూర్వికులు అబద్ధ ప్రవక్తలకు అలాగే చేశారు.
శత్రువులను ప్రేమించుట
27“అయితే వింటున్న మీతో నేను చెప్పేది ఏంటంటే: మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి, 28మిమ్మల్ని శపించే వారిని దీవించండి, మిమ్మల్ని బాధించే వారి కోసం ప్రార్థించండి. 29ఎవరైనా మిమ్మల్ని చెంపమీద కొడితే, వారికి మీ మరో చెంపను చూపించాలి. ఎవరైనా మీ పైవస్త్రాన్ని తీసుకుంటే, వారికి మీ అంగీని కూడా ఇవ్వండి. 30మిమ్మల్ని అడిగేవారికి ఇవ్వండి. ఒకవేళ ఎవరైనా నీకు చెందిన దానిని తీసుకుంటే, దాన్ని మళ్ళీ అడగవద్దు. 31ఇతరులు మీకు ఏమి చేయాలని మీరు కోరుతున్నారో మీరు వారికి అలాగే చేయండి.
32“ఒకవేళ మిమ్మల్ని ప్రేమించేవారినే మీరు ప్రేమిస్తే, మీకు ఏం లాభం? పాపులు కూడా తమను ప్రేమించేవారినే ప్రేమిస్తారు. 33ఒకవేళ మీరు మీకు మేలు చేసే వారికే మేలు చేస్తే, మీకేమి లాభం? పాపులు కూడ అలాగే చేస్తారు కదా! 34మీకు తిరిగి ఇవ్వగలిగిన వారికే మీరు ఇస్తే మీకేమి లాభం? మీరు కూడా తాము ఇచ్చింది తమకు పూర్తిగా తిరిగి వస్తుందని పాపులకే ఇస్తారు. 35మీరైతే మీ శత్రువులను ప్రేమించండి, వారికి మేలు చేయండి, తిరిగి ఏమి ఆశించకుండా అప్పు ఇవ్వండి. అప్పుడు మీ ప్రతిఫలం గొప్పగా ఉంటుంది, మీరు సర్వోన్నతుని పిల్లలుగా ఉంటారు, ఎందుకంటే ఆయన కృతజ్ఞతలేనివారికి, దుష్టులకు కూడా దయ చూపించేవాడు. 36మీ తండ్రి కనికరం కలవాడై ఉన్నట్లు, మీరు కూడ కనికరం కలవారై ఉండండి.
ఇతరులకు తీర్పు తీర్చుట
37“తీర్పు తీర్చకండి, మీకు తీర్పు తీర్చబడదు. ఖండించకండి, మీరు ఖండించబడరు. క్షమించండి, మీరు క్షమించబడతారు. 38ఇవ్వండి, మీకు ఇవ్వబడుతుంది. అణచి, కుదిపి, పొర్లిపారునట్లు నిండు కొలత మీ ఒడిలో పోయబడుతుంది. ఎందుకంటే, మీరు ఏ కొలతతో కొలుస్తారో, మీకు అదే కొలత కొలవబడుతుంది.”
39యేసు వారికి ఈ ఉపమానాన్ని కూడా చెప్పారు, “గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపించగలడా? వారిద్దరు గుంటలో పడరా? 40ఒక శిష్యుడు బోధకుని కంటే ఉన్నతుడు కాడు, అయితే పూర్తిగా శిక్షణ పొందుకొన్నవాడు తన బోధకునిలా అవుతాడు.
41“నీ కంటిలో ఉన్న దూలాన్ని పట్టించుకోకుండా నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును ఎందుకు చూస్తావు? 42నీ కంటిలో ఉన్న దూలాన్ని చూసుకోవడం విఫలమైన నీవు నీ సహోదరునితో, ‘సహోదరుడా, నీ కంటిలో ఉన్న నలుసును తీయనివ్వు’ అని నీవెలా అనగలవు? ఓ వేషధారీ, మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేయు, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయడానికి నీకు స్పష్టంగా కనిపిస్తుంది.
ఒక చెట్టు దాని ఫలము
43“ఏ మంచి చెట్టు చెడ్డపండ్లు కాయదు, ఏ చెడ్డ చెట్టు మంచి పండ్లు కాయదు. 44ప్రతి చెట్టు దాని ఫలాన్నిబట్టి గుర్తించబడుతుంది. ప్రజలు ముళ్ళపొదల్లో అంజూర పండ్లను, లేదా గచ్చ పొదల్లో ద్రాక్షపండ్లను కోయరు. 45మంచివారు తమ మంచి హృదయ ధననిధిలో నుండి మంచివాటినే బయటకు తీస్తారు, అలాగే చెడ్డవారు తమ హృదయ నిధిలో నుండి చెడ్డవాటినే బయటకు తీస్తారు. ఎందుకంటే, హృదయం దేనితో నిండి ఉందో దానినే నోరు మాట్లాడుతుంది.
బుద్ధిగల బుద్ధిలేని నిర్మాణకులు
46“నేను చెప్పే మాట ప్రకారం చేయకుండా ఎందుకు నన్ను ‘ప్రభువా, ప్రభువా’ అని పిలుస్తున్నారు? 47నా దగ్గరకు వచ్చి నా మాటలు విని వాటి ప్రకారం చేసేవారు ఎలాంటివారో నేను మీకు చెప్తాను. 48లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసి, ఇల్లు కట్టిన వ్యక్తిలా ఉంటారు. వరదలు వచ్చి ప్రవాహాలు వేగంగా ఆ ఇంటిని తాకాయి కాని ఆ ఇంటిని ఏమి చేయలేకపోయాయి, ఎందుకంటే ఆ వ్యక్తి ఆ ఇంటిని బలమైన పునాది మీద కట్టుకున్నాడు. 49అయితే నా మాటలు విని వాటి ప్రకారం చేయనివారు పునాది వేయకుండా నేల మీద ఇల్లు కట్టిన వాని లాంటివారు. వరద ప్రవాహం వేగంగా ఆ ఇంటిని తాకగానే, అది కూలి పూర్తిగా ధ్వంసం అయ్యింది.”

Mee ka ọ bụrụ isi

Kesaa

Mapịa

None

Ịchọrọ ka echekwaara gị ihe ndị gasị ị mere ka ha pụta ìhè ná ngwaọrụ gị niile? Debanye aha gị ma ọ bụ mee mbanye