ప్రవక్త గాని కలల ద్వారా భవిష్యత్తును చెప్పగలవారు గాని మీ మధ్యకు వచ్చి, మీ ఎదుట ఒక గుర్తును లేదా అద్భుతాన్ని ప్రకటిస్తే, ఒకవేళ చెప్పిన గుర్తు లేదా అద్భుతం జరిగి, ఆ ప్రవక్త, “మనం ఇతర దేవుళ్ళను అనుసరిద్దాం” (మీకు తెలియని దేవుళ్ళు) “వాటిని సేవిద్దాం” అని ప్రలోభపెడితే, ఆ ప్రవక్త మాటలు లేదా కలలు కనేవారి మాటలు గాని మీరు వినకూడదు. మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి ఆయన మిమ్మల్ని పరీక్షిస్తున్నారు.