ద్వితీయో 13
13
ఇతర దేవుళ్ళను పూజించుట
1ప్రవక్త గాని కలల ద్వారా భవిష్యత్తును చెప్పగలవారు గాని మీ మధ్యకు వచ్చి, మీ ఎదుట ఒక గుర్తును లేదా అద్భుతాన్ని ప్రకటిస్తే, 2ఒకవేళ చెప్పిన గుర్తు లేదా అద్భుతం జరిగి, ఆ ప్రవక్త, “మనం ఇతర దేవుళ్ళను అనుసరిద్దాం” (మీకు తెలియని దేవుళ్ళు) “వాటిని సేవిద్దాం” అని ప్రలోభపెడితే, 3ఆ ప్రవక్త మాటలు లేదా కలలు కనేవారి మాటలు గాని మీరు వినకూడదు. మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి ఆయన మిమ్మల్ని పరీక్షిస్తున్నారు. 4మీరు మీ దేవుడైన యెహోవాను వెంబడించి ఆయనకు భయపడాలి; ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయనకు లోబడాలి; ఆయనను సేవించి ఆయనను హత్తుకుని ఉండాలి. 5ఈజిప్టు దేశంలో నుండి మిమ్మల్ని బయటకు తీసుకువచ్చి, బానిస దేశం నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద మీరు తిరుగుబాటు చేయడానికి వారు మిమ్మల్ని ప్రేరేపించారు కాబట్టి వారు చంపబడాలి. ప్రవక్త లేదా కలలు కనేవారు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని అనుసరించమని ఆజ్ఞాపించిన మార్గం నుండి మిమ్మల్ని త్రిప్పివేయడానికి ప్రయత్నించారు. ఈ విధంగా మీ మధ్యలో నుండి చెడుతనాన్ని తొలగించాలి.
6-7మీ సొంత సోదరుడు లేదా మీ కుమారుడు గాని కుమార్తె గాని, లేదా మీరు ప్రేమిస్తున్న భార్య లేదా మీ ప్రాణస్నేహితుడు గాని రహస్యంగా మిమ్మల్ని ప్రలోభపెట్టి, “మనం వెళ్లి ఇతర దేవుళ్ళను (మీకు గాని మీ పూర్వికులకు తెలియని దేవుళ్ళు, మీ చుట్టూ ఉన్న, మీకు దగ్గరగా ఉన్న, దూరంగా ఉన్న ప్రజల దేవుళ్ళు, భూమి ఒక చివరి నుండి ఇంకొక చివరి వరకు ఉన్న దేవుళ్ళు) సేవిద్దాం” అని చెప్తే, 8మీరు వారి మాటలు అంగీకరించవద్దు, వారి మాట వినవద్దు. వారి మీద జాలి చూపవద్దు. వారిని విడిచిపెట్టవద్దు, వారిని కాపాడవద్దు. 9వారిని ఖచ్చితంగా చంపాల్సిందే. వారిని చంపడానికి మిగిలిన ప్రజలందరి కంటే ముందు మీ చేయి వారి మీద పడాలి. 10వారిని రాళ్లతో కొట్టి చంపాలి ఎందుకంటే, ఈజిప్టు దేశంలో నుండి మిమ్మల్ని బయటకు తీసుకువచ్చి బానిస దేశం నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా దగ్గర నుండి మిమ్మల్ని దూరం చేయడానికి వారు ప్రయత్నించారు. 11అప్పుడు ఇశ్రాయేలీయులందరు విని భయపడతారు, మీలో ఎవరూ మరలా అలాంటి దుర్మార్గం చేయరు.
12-13మీరు నివసించడానికి మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న పట్టణాల్లో దేనిలోనైనా దుష్టులు కొందరు మీ మధ్యలో లేచి, “మనం ఇతర దేవుళ్ళను సేవిద్దాం” అని చెప్పి (మీకు తెలియని దేవుళ్ళను) తమ పట్టణంలోని ప్రజలను ప్రోత్సహించినట్లు మీరు వినివుంటే, 14దాని గురించి మీరు విచారణ చేసి పూర్తిగా పరిశోధించి తెలుసుకోవాలి. అది నిజమై, మీ మధ్య ఈ అసహ్యకరమైన పని జరిగిందని నిరూపించబడితే, 15ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరినీ ఖచ్చితంగా ఖడ్గంతో సంహరించాలి; దానిలో ఉన్న సమస్తాన్ని, అంటే ప్రజలను పశువులను పూర్తిగా నాశనం చేయాలి.#13:15 ఇక్కడ హెబ్రీ పదం వస్తువులను లేదా వ్యక్తులను తిరిగి మార్చుకోలేని విధంగా యెహోవాకు అప్పగించడాన్ని సూచిస్తుంది, తరచుగా వాటిని పూర్తిగా నాశనం చేయడమే; అలాగే ద్వితీ 13:17 16దానిలో ఉన్న విలువైన వస్తువులన్నిటిని పట్టణంలో మధ్యలోనికి తీసుకువచ్చి మీ దేవుడైన యెహోవాకు దహనబలిగా ఆ పట్టణాన్ని, దానిలోని వస్తువులను పూర్తిగా కాల్చివేయాలి. ఆ పట్టణం మరలా కట్టబడకుండా ఎల్లప్పుడు పాడుపడిన దానిగానే ఉండాలి, 17నాశనానికి చెందిన వాటిలో ఏది మీ దగ్గర ఉండకూడదు. అప్పుడు యెహోవా తన తీవ్రమైన కోపాన్ని విడిచిపెట్టి, మిమ్మల్ని కనికరించి, మీమీద దయ చూపుతారు. మీ పూర్వికులకు ఇచ్చిన వాగ్దానం మేరకు మిమ్మల్ని అసంఖ్యాకంగా విస్తరింపజేస్తారు, 18ఎందుకంటే నేను ఈ రోజు మీకు ఇస్తున్న ఆయన ఆజ్ఞలన్నిటిని పాటించడం ద్వారా, మీ దేవుడైన యెహోవాకు మీరు విధేయత చూపించి ఆయన దృష్టిలో సరియైన వాటిని మీరు చేస్తున్నారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
ద్వితీయో 13: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapistaging.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fte.png&w=128&q=75)
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.