ద్వితీయో 12
12
ఆరాధించే స్థలము
1మీరు స్వాధీనం చేసుకోవడానికి మీ పూర్వికుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశంలో మీరు నివసించినంత కాలం మీరు జాగ్రత్తగా అనుసరించవలసిన శాసనాలు చట్టాలు ఇవి. 2మీరు స్వాధీనం చేసుకోబోయే దేశాల్లో ఎక్కడైతే ప్రజలు తమ దేవుళ్ళను సేవిస్తారో, అనగా ఎత్తైన పర్వతాలమీద కొండల పైన విస్తరించి ఉన్న చెట్టు క్రింద ఉన్న ఆ స్థలాలన్నిటిని పూర్తిగా నాశనం చేయాలి. 3వారి బలిపీఠాలను పడగొట్టాలి, వారి పవిత్ర రాళ్లను పగులగొట్టాలి, వారి అషేరా స్తంభాలను అగ్నితో కాల్చివేయాలి; వారి దేవతల ప్రతిమలను కూల్చివేసి, వాటి పేర్లు ఆ స్థలంలో లేకుండా నిర్మూలం చేయాలి.
4మీరు మీ దేవుడైన యెహోవాను వారి విధానంలో ఆరాధించకూడదు. 5కాని మీ దేవుడైన యెహోవా మీ గోత్రాలన్నిటిలో తన పేరును స్థాపించడానికి ఆయనకు నివాస స్థానంగా ఏర్పరచుకొనే స్థలాన్ని మీరు వెదికి ఆ స్థలానికి మీరు వెళ్లాలి; 6అక్కడికే మీరు మీ దహనబలులు, మీ బలులు, మీ దశమభాగాలు, ప్రత్యేక అర్పణలు, మీరు ఇస్తామన్న మ్రొక్కుబడులు, స్వేచ్ఛార్పణలు, పశువుల మందలో గొర్రెల మందలోని మొదట పుట్టిన వాటిని తీసుకురావాలి. 7మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించారు కాబట్టి, అక్కడ మీ దేవుడైన యెహోవా సన్నిధిలో మీరు, మీ కుటుంబాలు తిని, మీ చేతి పనులన్నిటిని బట్టి సంతోషించాలి.
8ఈ రోజు మనం ఇక్కడ చేస్తున్నట్లు మీలో ప్రతిఒక్కరు తమ దృష్టికి సరియైనది అనుకున్న దానిని చేయకూడదు, 9ఎందుకంటే, ఇంకా మీరు మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న విశ్రాంతి స్థలానికి వారసత్వ దేశాన్ని చేరుకోలేదు. 10అయితే మీరు యొర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు వారసత్వంగా ఇస్తున్న దేశంలో స్థిరపడాలి, మీరు క్షేమంగా జీవించేలా ఆయన మీ చుట్టూ ఉన్న శత్రువులందరి నుండి మీకు విశ్రాంతినిస్తారు. 11అప్పుడు యెహోవా తన నామానికి నివాస స్థలాన్ని ఏర్పరచుకుంటారు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని అనగా, మీ దహనబలులు, మీ బలులు, మీ దశమభాగాలు, ప్రత్యేక అర్పణలు, మీరు యెహోవాకు ఇస్తామని మ్రొక్కుబడి చేసుకున్న కానుకలు అక్కడికే తీసుకురావాలి. 12అక్కడ మీరు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసులు దాసీలు, భాగం గాని స్వాస్థ్యం గాని లేకుండా మీ ఇళ్ళలో ఉండే లేవీయులు మీ దేవుడైన యెహోవా సన్నిధిలో సంతోషించాలి. 13మీరు నచ్చిన ప్రతి స్థలంలో మీ దహనబలులు అర్పించకుండ జాగ్రత్తపడండి. 14మీ గోత్రాల్లో ఒకదానిలో యెహోవా ఏర్పరచుకొనే స్థలంలోనే మీ దహనబలులు అర్పించి, అక్కడే నేను ఆజ్ఞాపించే వాటన్నిటిని జరిగించాలి.
15అయితే మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఆశీర్వాదం ప్రకారం, మీ ఇళ్ళలో ఉన్న పశువులను, జింకను లేదా దుప్పిని తిన్నట్లుగా మీకు ఇష్టం వచ్చినంత మాంసాన్ని తినవచ్చు. ఆచారరీత్య పవిత్రులైనవారు, అపవిత్రులైనవారు దానిని తినవచ్చు. 16అయితే మీరు రక్తాన్ని తినకూడదు; దానిని నీళ్లవలె నేలమీద పారవేయాలి. 17మీ ధాన్యంలో, క్రొత్త ద్రాక్షరసంలో, ఒలీవ నూనెలో దశమభాగాన్ని, లేదా మీ పశువుల్లో, మందలలో మొదట పుట్టిన దానిని, లేదా మీరు ఇస్తామన్న మ్రొక్కుబడులు, స్వేచ్ఛార్పణలు ప్రత్యేక అర్పణలు వేటిని మీ పట్టణాల్లో తినకూడదు. 18అయితే మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలంలోనే మీరు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసదాసీలు, మీ పట్టణాల్లో ఉండే లేవీయులు, అందరు మీ దేవుడైన యెహోవా సన్నిధిలో తిని, మీ చేతి పనులన్నిటిని బట్టి మీ దేవుడైన యెహోవా సన్నిధిలో సంతోషించాలి. 19మీరు మీ దేశంలో ఉన్నంతకాలం లేవీయులను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తపడండి.
20మీ దేవుడైన యెహోవా మీకు వాగ్దానం చేసిన ప్రకారం ఆయన మీ సరిహద్దులు విశాలపరచినప్పుడు, మీకు మాంసం తినాలనే ఆశ కలిగి, “నేను కొంత మాంసాన్ని తింటాను” అని అనుకోవచ్చు. అప్పుడు మీకు కావలసినంత మాంసాన్ని తినవచ్చు. 21మీ దేవుడైన యెహోవా తన నామం కోసం ఏర్పరచుకున్న స్థలం మీకు చాలా దూరంగా ఉంటే, యెహోవా మీకు ఇచ్చిన పశువుల్లో, మందలో నుండి పశువులను వధించి, నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీ స్వస్థలాలలోనే మీకు కావలసినంత మాంసాన్ని మీరు తినవచ్చు. 22జింకను దుప్పిని తిన్నట్లుగా మీరు వాటిని తినవచ్చు. ఆచారరీత్య పవిత్రులైనవారు అపవిత్రులైనవారు తినవచ్చు. 23రక్తం తినకుండా చూసుకోండి, రక్తమంటే ప్రాణము కాబట్టి మాంసంతో పాటు ప్రాణాన్ని తినకూడదు. 24ఖచ్చితంగా మీరు రక్తాన్ని తినకూడదు; దానిని నీళ్లవలె నేలమీద పారవేయాలి. 25యెహోవా దృష్టిలో సరియైన దానిని మీరు చేస్తారు కాబట్టి దానిని తినకండి, అప్పుడు మీకు మీ తర్వాత మీ పిల్లలకు మేలు కలుగుతుంది.
26అయితే మీ పవిత్ర వస్తువులను, మీరు ఇస్తానని మ్రొక్కుబడి చేసినవన్నీ తీసుకుని, యెహోవా ఎన్నుకునే ప్రదేశానికి వెళ్లండి. 27మీ దహనబలులను, వాటి రక్తమాంసాలను మీ దేవుడైన యెహోవా బలిపీఠం మీద అర్పించాలి. మీ బలుల రక్తాన్ని మీ దేవుడైన యెహోవా బలిపీఠం మీద పోయాలి, అయితే ఆ మాంసాన్ని మీరు తినవచ్చు. 28మీ దేవుడైన యెహోవా దృష్టిలో సరియైన దానిని మీరు చేస్తారు కాబట్టి మీకు, మీ తర్వాత మీ పిల్లలకు మేలు కలిగేలా నేను మీకు ఇస్తున్న నిబంధనలన్నిటిని మీరు జాగ్రత్తగా విని పాటించాలి.
29మీరు దాడి చేసి వెళ్లగొట్టబోతున్న జనాంగాలను మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి తొలగిస్తారు. అయితే మీరు వారిని వెళ్లగొట్టి వారి దేశంలో స్థిరపడిన తర్వాత, 30వారు మీ ఎదుట నుండి నిర్మూలమైనప్పుడు, మీరు వారి పద్ధతులను అనుసరించి, “ఈ ప్రజలు తమ దేవుళ్ళను ఎలా సేవిస్తున్నారు? మేము కూడా అలాగే చేస్తాము” అని అంటూ చిక్కుల్లో పడిపోకుండా జాగ్రత్తపడండి. 31వారి విధానాల్లో మీ దేవుడనైన యెహోవాను మీరు ఆరాధించకూడదు, ఎందుకంటే వారు తమ దేవుళ్ళను పూజిస్తూ యెహోవా ద్వేషించే అసహ్యమైన సమస్తాన్ని చేస్తారు. వారు తమ కుమారులను కుమార్తెలను తమ దేవుళ్ళకు బలిగా అగ్నిలో కాల్చివేస్తారు.
32నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని మీరు పాటించేలా చూడండి; దానికి ఏది కలపవద్దు, దానిలో నుండి ఏది తీసివేయవద్దు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
ద్వితీయో 12: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.