2 దినవృత్తాంతములు 31
31
1ఇదంతయు సమాప్తమైన తరువాత అక్కడనున్న . ఇశ్రాయేలువారందరును యూదా పట్టణములకు పోయి, యూదాదేశమంతటను, బెన్యామీను ఎఫ్రాయిము మనష్షే దేశముల యందంతటను ఉన్న విగ్రహములను నిర్మూలముచేసి, దేవతాస్తంభములను ముక్కలుగా నరికి, ఉన్నతస్థలములను బలిపీఠములను పడగొట్టిరి; తరువాత ఇశ్రాయేలువారందరును తమతమ పట్టణములలోనున్న తమతమ స్వాస్థ్యములకు తిరిగి వెళ్లిరి 2అంతట హిజ్కియా యెవరి సేవాధర్మము వారు జరుపుకొనునట్లుగా యాజకులను వరుసల ప్రకారముగాను, లేవీయులను వారి వారి వరుసల ప్రకారముగాను నియమించెను; దహనబలులను సమాధానబలులను అర్పించుటకును, సేవను జరిగించుటకును కృతజ్ఞతా స్తుతులు చెల్లించుటకును, యెహోవా పాళెపు ద్వారములయొద్ద స్తుతులు చేయుటకును యాజకులను లేవీయులను నియమించెను. 3మరియు యెహోవా ధర్మశాస్త్రమునందు వ్రాయ బడియున్న విధినిబట్టి జరుగు ఉదయాస్తమయముల దహనబలులను విశ్రాంతిదినములకును అమావాస్యలకును నియా మకకాలములకును ఏర్పడియున్న దహనబలులను అర్పించుటకై తనకు కలిగిన ఆస్తిలోనుండి రాజు ఒక భాగమును ఏర్పాటుచేసెను. 4మరియు యెహోవా ధర్మశాస్త్రమునుబట్టి యాజకులును లేవీయులును ధైర్యము వహించి తమ పని జరుపుకొనునట్లు ఎవరి భాగములను వారికి ఇయ్య వలసినదని యెరూషలేములో కాపురమున్న జనులకు అతడు ఆజ్ఞాపించెను. 5ఆయాజ్ఞ వెల్లడియగుటతోడనే ఇశ్రాయేలీయులు ప్రథమఫలములైన ధాన్య ద్రాక్షారసములను నూనెను తేనెను సస్యఫలములను విస్తారముగా తీసికొని వచ్చిరి. సమస్తమైన వాటిలోనుండియు పదియవ వంతులను విస్తారముగా తీసికొని వచ్చిరి. 6యూదా పట్టణములలో కాపురమున్న ఇశ్రాయేలువారును యూదావారును ఎద్దులలోను గొఱ్ఱెలలోను పదియవవంతును, తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువులలో పదియవ వంతును తీసికొని వచ్చి కుప్పలుగా కూర్చిరి. 7వారు మూడవ మాసమందు కుప్పలువేయ నారంభించి ఏడవ మాసమందు ముగించిరి. 8హిజ్కియాయును అధిపతులును వచ్చి ఆ కుప్పలను చూచి యెహోవాను స్తుతించి ఆయన జనులైన ఇశ్రాయేలీయులను దీవించిరి. 9హిజ్కియా ఆ కుప్పలనుగూర్చి యాజకులను లేవీయులను ఆలోచన యడిగినందుకు సాదోకు సంతతివాడును ప్రధానయాజకుడునగు అజర్యా 10–యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పటినుండి మేము సమృద్ధిగా భోజనముచేసినను చాలా మిగులు చున్నది; యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్పరాశి మిగిలినదని రాజుతోననగా 11హిజ్కియా యెహోవా మందిరములో కొట్లను సిద్ధపరచవలసినదని ఆజ్ఞ ఇచ్చెను. 12వారు వాటిని సిద్ధపరచి ఏమియు అపహరింపకుండ కానుకలను పదియవభాగములను ప్రతిష్ఠితములుగా తేబడిన వస్తువులను లోపల చేర్చిరి; లేవీయుడైన కొనన్యా వాటిమీద విచారణకర్తగా నియమింప బడెను; అతని సహోదరుడైన షిమీ అతనికి సహకారిగా ఉండెను. 13మరియు యెహీయేలు అజజ్యాహు నహతు అశాహేలు యెరీమోతు యోజాబాదు ఎలీయేలు ఇస్మక్యాహు మహతు బెనాయాలనువారు రాజైన హిజ్కియా వలనను, దేవుని మందిరమునకు అధిపతియైన అజర్యా వలనను, తాము పొందిన ఆజ్ఞచొప్పున కొనన్యా చేతి క్రిందను, అతని సహోదరుడగు షిమీ చేతిక్రిందను కని పెట్టువారై యుండిరి. 14తూర్పుతట్టు ద్వారమునొద్ద పాలకుడును ఇమ్నా కుమారుడునగు లేవీయుడైన కోరే యెహోవా కానుకలను అతిపరిశుద్ధమైనవాటిని పంచి పెట్టుటకు దేవునికి అర్పింపబడిన స్వేచ్ఛార్పణలమీద నియమింపబడెను. 15అతనిచేతిక్రింద ఏదెను మిన్యామీను యేషూవ షెమయా అమర్యా షెకన్యా అనువారు నమ్మకమైనవారు గనుక యాజకుల పట్టణములందు పిన్న పెద్దలైన తమ సహోదరులకు వంతులచొప్పున భాగము లిచ్చుటకు నియమింపబడిరి. 16ఇదియుగాక గోత్రములలో మూడు సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సు గలవారై జనసంఖ్య సరిచూడబడిన మగవారికందరికిని, వంతులచొప్పున సేవచేయుటకై ప్రతిదినము యెహోవా మందిరములోనికి వచ్చువారందరికిని, 17ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సు గలవారై వంతుల చొప్పున సేవచేయుటకు తమతమపితరుల వంశముల చొప్పున యాజకులలో సరిచూడబడిన లేవీయులకు, 18అనగా నమ్మకమైనవారై తమ్మును ప్రతిష్ఠించుకొనిన లేవీ యులకును, తమ పిల్లలతోను భార్యలతోను కుమారులతోను కుమార్తెలతోను 19సమాజమంతటను సరిచూడబడిన వారికిని, ఆయా పట్టణములకు చేరిన గ్రామములలో నున్న అహరోను వంశస్థులైన యాజకులకును, వంతులు ఏర్పరచుటకు వారు నియమింపబడి యుండిరి. పేళ్లచేత చెప్పబడిన ఆ జనులు యాజకులలో పురుషులకందరికిని, లేవీయులలో వంశములచొప్పున సరిచూడబడిన వారికందరికిని వంతులు ఏర్పరచుటకు నియమింపబడిరి. 20హిజ్కియా యూదా దేశమంతటను ఈలాగున జరిగించి, తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచు వచ్చెను. 21తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవవిషయమందేమి ధర్మశాస్త్ర విషయమందేమి ధర్మమంతటివిషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 దినవృత్తాంతములు 31: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.