2 దినవృత్తాంతములు 32
32
1రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తరువాత . అష్షూరురాజైన సన్హెరీబు వచ్చి, యూదాదేశములో చొర బడి ప్రాకారపురములయెదుట దిగి వాటిని లోపరచుకొన జూచెను. 2సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేముమీద యుద్ధముచేయనుద్దేశించియున్నాడని హిజ్కియాచూచి 3పట్టణముబయటనున్న ఊటల నీళ్లను అడ్డవలెనని తలచి, తన యధిపతులతోను పరాక్రమశాలులతోను యోచనచేయగా వారతనికి సహాయము చేసిరి. 4–బహుజనులు పోగై అష్షూరు రాజులు రానేల? విస్తారమైనజలము వారికి దొరుక నేల? అనుకొని ఊటలన్నిటిని దేశమధ్యముగుండ పారు చున్న కాలువను అడ్డిరి. 5మరియు రాజు ధైర్యము తెచ్చుకొని, పాడైన గోడ యావత్తు కట్టించి, గోపురములవరకు దానిని ఎత్తు చేయించి, బయట మరియొక గోడను కట్టించి, దావీదు పట్టణములో మిల్లో దుర్గమును బాగుచేయించెను. మరియు ఈటెలను డాళ్లను విస్తారముగా చేయించెను. 6జనులమీద సైన్యాధిపతులను నియమించి పట్టణపు గుమ్మములకు పోవు రాజవీధిలోనికి వారిని తన యొద్దకు రప్పించి వారిని ఈలాగు హెచ్చరికచేసెను 7–మీరు దిగులుపడకుడి, ధైర్యము విడువకుడి; అష్షూరు రాజుకైనను అతనితోకూడనున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయమొందవద్దు, అతనికి కలిగియున్న సహాయముకంటె ఎక్కువ సహాయము మనకు కలదు. 8మాంససంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటలయందు నమ్మికయుంచిరి.
9ఇదియైన తరువాత అష్షూరురాజైన సన్హెరీబు తన బలగ మంతటితో లాకీషును ముట్టడివేయుచుండి, యెరూషలేమునకు యూదారాజైన హిజ్కియా యొద్దకును, యెరూషలేమునందున్న యూదావారందరియొద్దకును తన సేవకులను పంపి ఈలాగు ప్రకటన చేయించెను 10–అష్షూరురాజైన సన్హెరీబు సెలవిచ్చునదేమనగా– దేని నమ్మి మీరు ముట్టడివేయబడియున్న యెరూషలేములో నిలుచుచున్నారు? 11కరవుచేతను దాహముచేతను మిమ్మును చంపుటకై–మన దేవుడైన యెహోవా అష్షూరురాజు చేతిలోనుండి మనలను విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మును ప్రేరేపించుచున్నాడు గదా? 12ఆ హిజ్కియా, మీరు ఒక్క బలిపీఠము ఎదుట నమస్కరించి దానిమీద ధూపము వేయవలెనని యూదావారికిని యెరూషలేమువారికిని ఆజ్ఞ ఇచ్చి, యెహోవా ఉన్నతస్థలములను బలిపీఠములను తీసి వేసినవాడుకాడా? 13నేనును నా పితరులును ఇతరదేశముల జనులకందరికిని ఏమేమి చేసితిమో మీరెరుగరా? ఆ దేశ జనుల దేవతలు వారి దేశములను నా చేతిలోనుండి యేమాత్రమైనను రక్షింప చాలియుండెనా? 14మీ దేవుడు మిమ్మును నా చేతిలోనుండి విడిపింపగలడనుకొనుటకు, నా పితరులు బొత్తిగా నిర్మూలము చేసిన ఆయా దేశస్థుల సకల దేవతలలోను తన జనులను నా చేతిలోనుండి విడిపింపగలిగిన దేవుడొకడైన యుండెనా? 15కాబట్టి యిప్పుడు హిజ్కియాచేత మీరు మోసపోకుడి, మీరు ఇట్టి ప్రేరేపణకు లోబడకుడి, అతని నమ్ముకొనకుడి, యే జనుల దేవుడైనను ఏ రాజ్యపు దేవుడైనను తన జనులను నా చేతిలోనుండి గాని నా పితరుల చేతిలోనుండి గాని విడిపింపలేక పోగా, మీ దేవుడు నా చేతిలోనుండి మిమ్మును మొదలే విడిపింపలేక పోవునుగదా అనెను. 16అతని సేవకులు దేవుడైన యెహోవామీదను ఆయన సేవకుడైన హిజ్కియా మీదను ఇంకను పేలాపనలు పేలిరి. 17అదియుగాక ఇతర దేశముల జనుల దేవతలు తమ జనులను నా చేతిలోనుండి యేలాగున విడిపింపలేకపోయిరో ఆలాగున హిజ్కియా సేవించు దేవుడును తన జనులను నా చేతిలోనుండి విడిపింప లేకపోవునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిందించుటకును, ఆయనమీద అపవాదములు పలుకుటకును అతడు పత్రికలు వ్రాసి పంపెను. 18అప్పుడు వారు పట్టణమును పట్టుకొనవలెనన్న యోచనతో, ప్రాకారము మీదనున్న యెరూషలేము కాపురస్థులను బెదరించుటకును నొప్పించుటకును, యూదాభాషలో బిగ్గరగా వారితో ఆ మాటలు పలికిరి. 19మరియు వారు మనుష్యుల చేతిపనియైన భూజనుల దేవతలమీద తాము పలికిన దూషణలను యెరూషలేముయొక్క దేవునిమీద కూడను పలికిరి.
20రాజైన హిజ్కియాయును ఆమోజు కుమారుడైన యెషయా అను ప్రవక్తయును ఇందును గురించి ప్రార్థించి ఆకాశముతట్టు చూచి మొఱ్ఱపెట్టగా 21యెహోవా ఒక దూతను పంపెను. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులనందరిని సేనా నాయకులను అధికారులను నాశనముచేయగా అష్షూరురాజు సిగ్గునొందినవాడై తన దేశమునకు తిరిగిపోయెను. అంతట అతడు తన దేవుని గుడిలో చొచ్చినప్పుడు అతని కడుపున పుట్టినవారే అతని అక్కడ కత్తిచేత చంపిరి. 22ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపురస్థులను అష్షూరు రాజైన సన్హెరీబు చేతిలోనుండియు అందరిచేతిలోనుండియు రక్షించి, అన్నివైపులను వారిని కాపాడినందున 23అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను యూదా రాజైన హిజ్కియాకు కానుకలను తెచ్చి యిచ్చిరి. అందువలన అతడు అప్పటినుండి సకల జనముల దృష్టికి ఘనత నొందిన వాడాయెను.
24ఆ దినములలో హిజ్కియా రోగియై మరణదశలో నుండెను. అతడు యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరచి అతనికి సూచన యొకటి దయచేసెను. 25అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికిని యూదా యెరూషలేముల వారిమీదికిని కోపము రాగా 26హిజ్కియా హృదయగర్వము విడచి, తానును యెరూషలేము కాపురస్థులును తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనులమీదికి రాలేదు. 27హిజ్కియాకు అతివిస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను రత్నములను సుగంధద్రవ్యములను డాళ్లను నానా విధములగు శ్రేష్ఠమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించెను. 28ధాన్యమును ద్రాక్షారసమును తైలమును ఉంచుటకు కొట్లను, పలువిధముల పశువులకు శాలలను మందలకు దొడ్లను కట్టించెను. 29మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను విస్తారమైన గొఱ్ఱెలమందలను పసులమందలను అతడు సంపాదించెను. 30ఈ హిజ్కియా గిహోను కాలువకు ఎగువను కట్టవేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాని తెప్పించెను, హిజ్కియా తాను పూనుకొనిన సర్వప్రయత్నములయందును వృద్ధిపొందెను. 31అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధినొందుటనుగూర్చి విచారించి తెలిసికొనుటకై బబులోను అధిపతులు అతనియొద్దకు పంపిన రాయబారుల విషయములో అతని శోధించి, అతని హృదయములోని ఉద్దేశమంతయు తెలిసికొనవలెనని దేవుడతని విడచిపెట్టెను.
32హిజ్కియా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చూపిన భక్తినిగూర్చియు, ప్రవక్తయును ఆమోజు కుమారుడునగు యెషయాకు కలిగిన దర్శనముల గ్రంథమునందును యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమునందును వ్రాయబడియున్నది. 33హిజ్కియా తన పితరులతోకూడ నిద్రించగా జనులు దావీదు సంతతివారి శ్మశానభూమియందు కట్టబడిన పైస్థానమునందు అతని పాతిపెట్టిరి. అతడు మరణ మొందినప్పుడు యూదావారందరును యెరూషలేము కాపురస్థులందరును అతనికి ఉత్తర క్రియలను ఘనముగా జరిగించిరి. అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజాయెను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 దినవృత్తాంతములు 32: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.