సామెతలు 3
3
1నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము
నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము.
2అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడచు
సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును.
3దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనియ్యకుము
వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము.
నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము.
4అప్పుడు దేవునిదృష్టియందును మానవుల దృష్టియందును
నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు.
5నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక
నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక
ముంచుము
6నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు
ఒప్పుకొనుము
అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.
7నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు
యెహోవాయందు భయభక్తులుగలిగి చెడుతనము విడిచిపెట్టుము
8అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును
నీ యెముకలకు సత్తువయు కలుగును.
9నీ రాబడి అంతటిలో ప్రథమఫలమును
నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము.
10అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగానుండును
నీ గానుగలలోనుండి క్రొత్త ద్రాక్షారసము పైకి
పొరలి పారును.
11నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు
ఆయన గద్దింపునకు విసుకవద్దు.
12తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా
యెహోవా తాను ప్రేమించువారిని గద్దించును.
13జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు
వివేచన కలిగిన నరుడు ధన్యుడు.
14వెండి సంపాదించుటకంటె జ్ఞానము సంపాదించుట
మేలు
అపరంజి సంపాదించుటకంటె జ్ఞానలాభము నొందుట
మేలు.
15పగడములకంటె అది ప్రియమైనది
నీ యిష్టవస్తువులన్నియు దానితో సమానములు కావు.
16దాని కుడిచేతిలో దీర్ఘాయువును
దాని యెడమచేతిలో ధనఘనతలును ఉన్నవి.
17దాని మార్గములు రమ్యమార్గములు
దాని త్రోవలన్నియు క్షేమకరములు.
18దాని నవలంబించువారికి అది జీవవృక్షము
దాని పట్టుకొనువారందరు ధన్యులు.
19జ్ఞానమువలన యెహోవా భూమిని స్థాపించెను
వివేచనవలన ఆయన ఆకాశవిశాలమును స్థిరపరచెను.
20ఆయన తెలివివలన అగాధజలములు ప్రవహించుచున్నవి
మేఘములనుండి మంచుబిందువులు కురియుచున్నవి.
21నా కుమారుడా, లెస్సయైన జ్ఞానమును వివేచనను
భద్రము చేసికొనుము
వాటిని నీ కన్నుల ఎదుటనుండి తొలగిపోనియ్యకుము
22అవి నీకు జీవముగాను
నీ మెడకు అలంకారముగాను ఉండును
23అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు
నీ పాదము ఎప్పుడును తొట్రిల్లదు.
24పండుకొనునప్పుడు నీవు భయపడవు
నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు.
25ఆకస్మికముగా భయము కలుగునప్పుడు
దుర్మార్గులకు నాశనము వచ్చునప్పుడు నీవు భయపడవద్దు
26యెహోవా నీకు ఆధారమగును
నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును.
27మేలుచేయుట నీ చేతనైనప్పుడు
దాని పొందదగినవారికి చేయకుండ వెనుకతియ్యకుము.
28ద్రవ్యము నీయొద్ద నుండగా
–రేపు ఇచ్చెదను పోయి రమ్మని నీ పొరుగువానితో
అనవద్దు.
29నీ పొరుగువాడు నీయొద్ద నిర్భయముగా నివసించునపుడు
వానికి అపకారము కల్పింపవద్దు.
30నీకు హాని చేయనివానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు.
31బలాత్కారము చేయువాని చూచి మత్సరపడకుము
వాడుచేయు క్రియలను ఏమాత్రమును చేయ గోరవద్దు
32కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు
యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును.
33భక్తిహీనుల యింటిమీదికి యెహోవా శాపము వచ్చును
నీతిమంతుల నివాసస్థలమును ఆయన ఆశీర్వదించును.
34అపహాసకులను ఆయన అపహసించును
దీనునియెడల ఆయన దయ చూపును.
35జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు.
బుద్ధిహీనులు అవమానభరితులగుదురు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
సామెతలు 3: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.