2 దిన 29
29
హిజ్కియా మందిరాన్ని శుద్ధి చేయడం
29:1-2; 2రాజులు 18:2-3
1హిజ్కియా పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు అతని వయసు 25 సంవత్సరాలు. అతడు 29 ఏళ్ళు యెరూషలేములో పాలించాడు. అతని తల్లి జెకర్యా కుమార్తె, ఆమె పేరు అబీయా. 2అతడు తన పూర్వీకుడు దావీదు చేసిన ప్రకారం యెహోవా దృష్టికి యధార్థంగా ప్రవర్తించాడు. 3అతడు తన పరిపాలనలో మొదటి సంవత్సరం మొదటి నెల యెహోవా మందిరం తలుపులు తెరిచి వాటిని బాగుచేసి, 4యాజకులనూ లేవీయులనూ పిలిపించి, తూర్పువైపున రాజవీధిలో వారిని సమకూర్చి 5వారికిలా ఆజ్ఞాపించాడు. “లేవీయులారా, నా మాట వినండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకుని, మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మందిరాన్ని ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలం నుంచి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి తీసికెళ్ళండి.”
6“మన పూర్వీకులు అవిధేయులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడచి ఆయన్ని విసర్జించి, ఆయన నివాస స్థలం వైపు నుంచి ముఖం తిప్పుకుని నిర్లక్ష్యం చేశారు. 7వారు వసారా తలుపులు మూసివేశారు. దీపాలు ఆర్పివేశారు. పరిశుద్ధ స్థలం లో ఇశ్రాయేలీయుల దేవునికి ధూపం వేయలేదు. దహనబలులు అర్పించలేదు.
8అందుచేత యెహోవా ఉగ్రత యూదామీదా, యెరూషలేము మీదా పడింది. మీరు కన్నులారా చూస్తున్నట్టు ఆయన వారిని భీతికీ భయానికీ నిందకూ గురి చేశాడు. 9అందుకే మన తండ్రులు కత్తి చేత కూలారు, మన కొడుకులూ కూతుళ్ళూ భార్యలూ బందీలయ్యారు. 10ఇప్పుడు మనమీదున్న ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారేలా ఆయనతో మనం నిబంధన చేయాలని ఉద్దేశించాను. 11నా కుమారులారా, ఆయనకు పరిచారకులై ఉండి ధూపం వేయడానికీ ఆయన ఎదుట నిలబడి సేవచేయడానికీ యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఈ సమయంలో మీరు అశ్రద్ధ చేయవద్దు.”
12అప్పుడు లేవీయులు పనికి సిద్ధపడ్డారు. వారెవరంటే కహాతీయుల్లో అమాశై కొడుకు మహతు, అజర్యా కొడుకు యోవేలు, మెరారీయుల్లో అబ్దీ కొడుకు కీషు, యెహల్లెలేలు కొడుకు అజర్యా, గెర్షోనీయుల్లో జిమ్మా కొడుకు యోవాహు, యోవాహు కొడుకు ఏదెను, 13ఎలీషాపాను సంతానంలో షిమ్రీ, యెహీయేలు, ఆసాపు సంతానంలో జెకర్యా, మత్తన్యా 14హేమాను సంతానంలో యెహీయేలు, షిమీ, యెదూతూను సంతానంలో షెమయా, ఉజ్జీయేలు.
15వీరు తమ సోదరులను సమకూర్చి తమ్మును ప్రతిష్ఠించుకుని యెహోవా మాటలనుబట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం యెహోవా మందిరాన్ని బాగు చేయడానికి వచ్చారు. 16బాగు చేయడానికి యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగానికి పోయి యెహోవా మందిరంలో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరం ఆవరణంలోకి తీసుకు వచ్చారు. లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేశారు. 17మొదటి నెల మొదటి రోజు వారు శుద్ధి చేయడం మొదలు పెట్టి, ఆ నెల ఎనిమిదవ రోజున యెహోవా వసారా వరకూ వచ్చారు. వారు మరో ఎనిమిది రోజులు యెహోవా మందిరాన్ని శుద్ధి చేస్తూ మొదటి నెల 16 వ రోజున పని ముగించారు.
18అప్పుడు వారు రాజ భవనం లోపల ఉన్న రాజైన హిజ్కియా దగ్గరికి పోయి “మేము యెహోవా మందిరమంతా బాగు చేసాం. దహన బలిపీఠాన్ని దాని సామానంతటిని, సన్నిధి రొట్టెలుంచే బల్లనూ బాగు చేసాం. 19రాజైన ఆహాజు పాలించిన కాలంలో అతడు ద్రోహం చేసి పారవేసిన సామానంతా కూడా మేము సిద్ధం చేసి ప్రతిష్టించాం. అవి యెహోవా బలిపీఠం ఎదుట ఉన్నాయి” అని చెప్పారు.
20అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడ లేచి, పట్టణపు అధికారులను సమకూర్చి యెహోవా మందిరానికి వెళ్ళాడు. 21వారు రాజ్యం కోసం పరిశుద్ధస్థలం కోసం యూదావారి కోసం పాపపరిహారార్థబలి చేయడానికి ఏడు కోడెలు, ఏడు పొట్టేళ్ళు, ఏడు గొర్రెపిల్లలు, ఏడు మేకపోతులను తెచ్చారు. యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించమని అహరోను వంశం యాజకులకు అతడు ఆజ్ఞాపించాడు.
22అప్పుడు వారు ఎద్దులను వధించారు. యాజకులు వాటి రక్తాన్ని తీసుకు బలిపీఠం మీద చల్లారు. పొట్టేళ్లను వధించి ఆ రక్తాన్ని బలిపీఠం మీద చల్లారు. గొర్రెపిల్లలను కూడా వధించి ఆ రక్తాన్ని బలిపీఠం మీద చల్లారు. 23పాపపరిహారార్థబలి కోసం రాజు ఎదుటకకూ, సమాజం ఎదుటకూ మేకపోతులను తెచ్చారు. వారు తమ చేతులను వాటి మీద ఉంచిన తరువాత యాజకులు వాటిని వధించారు. 24ఇశ్రాయేలీయులందరి కోసం దహనబలీ, పాపపరిహారార్థ బలీ అర్పించాలని రాజు ఆజ్ఞాపించాడు. కాబట్టి యాజకులు ఇశ్రాయేలీయులందరి కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి బలిపీఠం మీద వాటి రక్తం ప్రోక్షించి పాపపరిహారార్థబలి అర్పించారు.
25మునుపు దావీదూ, రాజుకు దీర్ఘ దర్శి అయిన గాదూ, ప్రవక్త అయిన నాతానుల ఆజ్ఞ ప్రకారం హిజ్కియా యెహోవా మందిరంలో తాళాలనూ తీగె వాయిద్యాలనూ సితారాలనూ వాయించడానికి అతడు లేవీయులను ఏర్పాటు చేశాడు. అలా జరగాలని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉన్నాడు. 26దావీదు చేయించిన వాద్యాలను వాయించడానికి లేవీయులను బూరలు ఊదడానికి యాజకులను నియమించారు.
27బలిపీఠం మీద దహనబలులను అర్పించమని హిజ్కియా ఆజ్ఞాపించాడు. దహనబలి అర్పణ ఆరంభం కాగానే బూరలతో, ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యాలతో యెహోవాకు స్తుతిగానం ఆరంభమయింది. 28సమాజమంతా ఆరాధిస్తూ వుంటే గాయకులు పాటలు పాడారు, బూరలూదారు. దహనబలి అర్పణ ముగిసే వరకూ ఇదంతా జరుగుతూ ఉంది.
29వారు బలులు అర్పించడం ముగించిన తరువాత రాజు, అతనితో ఉన్న వారంతా తలవంచి ఆరాధించారు. 30దావీదూ, దీర్ఘ దర్శి ఆసాపూ, రాసిన పాటలు పాడి యెహోవాను స్తుతించమని రాజైన హిజ్కియా, అధికారులూ లేవీయులకు ఆజ్ఞాపిస్తే వారు ఆనందంతో స్తుతి గానం చేసి, తలవంచి ఆరాధించారు.
31అప్పుడు హిజ్కియా “మీరిప్పుడు యెహోవాకు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకున్నారు. దగ్గరికి రండి. యెహోవా మందిరంలోకి బలులూ కృతజ్ఞతార్పణలనూ తీసుకురండి” అని చెప్పాడు. సమాజపు వారు బలులనూ కృతజ్ఞతార్పణలనూ తీసుకొచ్చారు. దహన బలులను అర్పించడానికి ఎవరికి ఇష్టమయిందో వారు వాటిని తీసుకొచ్చారు. 32సమాజపు వారు తీసుకొచ్చిన దహనబలి పశువులు ఇవి: 70 కోడెలు, 100 పొట్టేళ్లు, 200 గొర్రెపిల్లలు. వీటన్నిటినీ యెహోవాకు దహనబలులుగా తెచ్చారు. 33ప్రతిష్టించబడినవి 600 ఎద్దులు, 3,000 గొర్రెలు.
34యాజకులు కొద్దిమందే ఉన్నారు కాబట్టి వారు ఆ దహనబలి పశువులన్నిటి చర్మాలను ఒలవలేకపోయారు. ఆ పని పూర్తి అయ్యేవరకూ, ఇతర యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకొనే వరకూ, వారి సోదరులైన లేవీయులు వారికి సహాయం చేశారు. తమను తాము ప్రతిష్ఠించుకోవడంలో యాజకులకంటే లేవీయులు యధార్థ హృదయం గలవారు. 35వీటితోపాటు సమాధాన బలిపశువుల కొవ్వూ దహనబలి పశువులూ దహనబలులకు ఏర్పడిన పానార్పణలూ సమృద్ధిగా ఉన్నాయి. ఈ విధంగా యెహోవా మందిర సేవను మళ్లీ స్థాపించారు. 36ఈ పని త్వరగానే జరిగింది కాబట్టి దేవుడు ప్రజలకు సిద్ధపరచిన దాన్ని చూసి హిజ్కియా, ప్రజలంతా సంతోషించారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 దిన 29: IRVTel
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.