యిర్మీయా 5

5
నీతిమంతుని కోసం వ్యర్ధమైన అన్వేషణ
1యెహోవా చెప్పేదేమంటే “యెరూషలేము వీధుల్లో అటూ ఇటూ తిరుగుతూ గమనించండి. దాని రాజవీధుల్లో విచారించండి.
న్యాయం జరిగిస్తూ నమ్మకంగా ఉండాలని ప్రయత్నం చేసే ఒక్కడు మీకు కనిపించినా సరే, నేను దాన్ని క్షమిస్తాను.
2యెహోవా మీద ఒట్టు అని పలికినప్పటికీ వారు చేసే ప్రమాణం మోసమే.”
3యెహోవా, యథార్థత చూడాలని కదా నీ కోరిక?
నువ్వు వారిని కొట్టావు కానీ వారు లెక్క చేయలేదు. వారిని క్షీణింప జేశావు గానీ వారు శిక్షను అంగీకరించలేదు.
రాతికంటే తమ ముఖాలు కఠినం చేసుకుని నీ వైపు తిరగడానికి ఒప్పుకోలేదు.
4నేనిలా అనుకున్నాను “వీరు కేవలం బీదవారు. యెహోవా మార్గాలు, తమ దేవుని న్యాయవిధులు తెలియని బుద్ధిహీనులు.
5కాబట్టి నేను ప్రముఖుల దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడతాను.
వారికి యెహోవా మార్గాలు, తమ దేవుని న్యాయవిధులు తెలిసి ఉంటాయి గదా.”
అయితే వారందరూ కాడిని విరిచేవారే, దేవునితో అంటుకట్టిన కట్లను తెంపుకొన్న వారే.
6అరణ్యం నుండి వచ్చిన సింహం వారిని చంపుతుంది.
అడవి తోడేలు వారిని నాశనం చేస్తుంది. చిరుతపులి వారి పట్టణాల దగ్గర కాచుకుని వాటిలోనుండి బయటకు వచ్చిన ప్రతివాణ్ణీ చీల్చివేస్తుంది.
ఎందుకంటే వారి అక్రమాలు మితిమీరిపోయాయి. వారు విశ్వాసఘాతకులయ్యారు.
7నీ పిల్లలు నన్ను విడిచి, దేవుళ్ళు కాని వారి పేరున ప్రమాణం చేస్తారు.
నేను వారిని సమృద్ధిగా పోషించాను కానీ వారు వ్యభిచారం చేస్తూ వేశ్యల ఇళ్ళలో సమావేశం అవుతారు. వారిని నేనెందుకు క్షమించాలి?
8బాగా బలిసిన గుర్రాల్లాగా వారిలో ప్రతి ఒక్కడూ ఇటూ అటూ తిరుగుతూ తన పొరుగువాని భార్యను చూసి సకిలిస్తాడు.
9అలాంటి పనుల కారణంగా నేను వారిని దండించకుండా ఉంటానా? అలాటి ప్రజల మీద నా కోపం చూపకూడదా? ఇదే యెహోవా వాక్కు.
10దాని ద్రాక్షతోటల్లోకి వెళ్ళి నాశనం చేయండి. అయితే వాటిని పూర్తిగా అంతం చేయవద్దు.
దాని కొమ్మలను నరికి వేయండి. ఎందుకంటే అవి యెహోవా నుండి వచ్చినవి కావు.
11ఇశ్రాయేలు, యూదా ప్రజలు నాకు పూర్తిగా ద్రోహం చేశారు. ఇదే యెహోవా వాక్కు.
12వారు నన్ను తోసిపుచ్చి “యెహోవా నిజమైనవాడు కాదు. మనపైకి ఏ కీడు గానీ ఖడ్గం గానీ కరువు గానీ రాదు.
13ప్రవక్తలు చెప్పేవన్నీ గాలి మాటలు. యెహోవా మాటలు పలికేవాడు వారిలో లేడు. వారు చెప్పింది వారికే జరుగుతుంది” అని చెబుతారు.
14కాబట్టి సేనల అధిపతీ, దేవుడూ అయిన యెహోవా చెప్పేదేమంటే,
వారు ఆ విధంగా పలికారు కాబట్టి నా వాక్కు వారిని కాల్చేలా దాన్ని నీ నోట అగ్నిగా ఉంచుతాను. ఈ ప్రజలను కట్టెలుగా చేస్తాను. ఇదే యెహోవా వాక్కు.
15ఇశ్రాయేలు ప్రజలారా, వినండి, దూరం నుండి మీ మీదికి ఒక జనాన్ని రప్పిస్తాను. అది చాలా పురాతనమైన జనం.
దాని భాష నీకు రాదు. ఆ జనం పలికే మాటలు నీకు అర్థం కావు.
16వారి అమ్ముల పొది తెరచిన సమాధిలాంటిది. వారంతా గొప్ప యోధులు.
17నీ పంట, నీ ఆహారం వారి చేతిలో నాశనం అవుతుంది. నీ కొడుకులనూ, కూతుళ్ళనూ, నీ గొర్రెలనూ, నీ పశువులనూ నాశనం చేస్తారు.
నీ ద్రాక్షచెట్ల, అంజూరు చెట్ల ఫలాన్ని నాశనం చేస్తారు. నీవు ఆశ్రయంగా భావించిన ప్రాకారాలుగల పట్టణాలను వారు కత్తి చేత కూలదోస్తారు.
18అయినా ఆ రోజుల్లో నేను మిమ్మల్ని పూర్తిగా నాశనం చెయ్యను. ఇదే యెహోవా వాక్కు. 19“మన దేవుడు యెహోవా మనకెందుకు ఇలా చేశాడు?” అని అడిగినప్పుడు నువ్వు వారితో#5:19 నువ్వు వారితో నీ ప్రజలతో ఇలా చెప్పు. మీరు నన్ను విసర్జించి మీ స్వదేశంలో అన్య దేవుళ్ళను పూజించారు కాబట్టి మీది కాని దేశంలో మీరు అన్య ప్రజలకు సేవ చేస్తారు అని యెహోవా సెలవిస్తున్నాడు.
20యాకోబు వంశ ప్రజలకు ఈ మాట చెప్పండి, యూదా వంశ ప్రజలకు ఈ సమాచారం చాటించండి.
21మీరు కళ్ళుండీ చూడడం లేదు, చెవులుండీ వినడం లేదు. మీరు తెలివి లేని మూర్ఖులు.
22యెహోవా చెప్పేదేమంటే, నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వణకరా?
నేను ఒక నిత్యమైన నిర్ణయం తీసుకుని సముద్రానికి ఒక సరిహద్దుగా ఇసుకను ఉంచాను.
దాని అలలు ఎంత పైకి లేచినా అవి దాన్ని దాటలేవు. ఎంత ఘోష పెట్టినా దాన్ని జయించలేదు.
23ఈ ప్రజలు తిరుగుబాటు, ద్రోహం చేసే మనస్సు గలవారు, వారు పక్కకు తొలగిపోతున్నారు.
24వారు “రండి, మన దేవుడైన యెహోవా పట్ల భయభక్తులు చూపుదాం. తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని వాటి కాలంలో కురిపించేవాడు ఆయనే కదా.
నిర్ణయించిన ప్రకారం కోతకాలపు వారాలను మనకు వచ్చేలా చేసేవాడు ఆయనే కదా” అని తమ మనస్సులో అనుకోరు.
25అవి క్రమంగా రాకుండా చేసింది మీ దోషాలే. మీకు మేలు కలగక పోవడానికి కారణం మీ పాపాలే.
26నా ప్రజల్లో దుర్మార్గులున్నారు, వేటగాళ్ళు పక్షుల కోసం పొంచి ఉన్నట్టు వారు పొంచి ఉంటారు.
వారు వల పన్ని మనుషులను పట్టుకుంటారు.
27పంజరం నిండా పిట్టలు ఉన్నట్టు వారి ఇళ్ళు కపటంతో నిండి ఉన్నాయి. దానితోనే వారు గొప్పవారు, ధనవంతులు అవుతారు.
28వారు కొవ్వు పట్టి బాగా బలిసి ఉన్నారు. దుర్మార్గంలో వారు ఎంతో ముందుకు వెళ్ళారు.
తండ్రి లేనివారు వ్యాజ్యంలో గెలవకుండేలా వారికి అన్యాయంగా తీర్పు తీరుస్తారు. బీదవారి వ్యాజ్యాల్లో సహకరించరు.
29అలాటి వారిని నేను శిక్షించకూడదా? ఈ ప్రజలపై ప్రతీకారం తీర్చుకోకూడదా? ఇదే యెహోవా వాక్కు.
30ఘోరమైన అకృత్యాలు దేశంలో జరుగుతున్నాయి.
31ప్రవక్తలు అబద్ధ ప్రవచనాలు చెబుతారు. యాజకులు తమ స్వంత అధికారాన్ని చెలాయిస్తారు.
అలా జరగడం నా ప్రజలకు కూడా ఇష్టమే. అయితే దాని అంతంలో జరగబోయే దానికి వారేం చేస్తారు?

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యిర్మీయా 5: IRVTel

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి