లేవీయకాండము 4

4
అకస్మాత్తు పాపాలకు బలులు
1మోషేతో యెహోవా మాట్లాడి ఇలా అన్నాడు: 2“ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: ప్రమాదవశాత్తు ఎవరైనా పాపం చేసి, చేయకూడదని యెహోవా చెప్పిన వాటిని చేస్తే, అప్పుడు అతడు ఇలా చేయాలి:
3“అభిషేకించబడిన యాజకుడు#4:3 అభిషేకించబడిన యాజకుడు నియమింపబడిన సమయములో సేవ చేయుటకు ఏర్పరచబడ్డ యాజకుడు. ప్రత్యేకమైన నూనె చేత అభిషేకించబడి సేవ చేయుటకు దేవుని చేత ఏర్పరచబడిన వాడు. పాపం చేసి, ప్రజలమీదికి దోషం రప్పిస్తే, అప్పుడు అతడు తాను చేసిన పాపం నిమిత్తం యెహోవాకు ఒక అర్పణను అర్పించాలి. ఏ దోషమూ లేని ఒక కోడెదూడను అతడు అర్పించాలి. పాపపరిహారార్థ బలిగా ఆ కోడెదూడను అతడు అర్పించాలి. 4సన్నిధి గుడార ద్వారం దగ్గర యెహోవా ఎదుటకు అభిషేకించబడిన యాజకుడు ఆ కోడెదూడను తీసుకొనిరావాలి. అతడు కోడెదూడ తల మీద తన చేతులు ఉంచి, యెహోవా ఎదుట దానిని వధించాలి. 5అభిషిక్తుడైన యాజకుడు అప్పుడు ఆ దూడ రక్తాన్ని కొంత తీసుకొని, దానిని సన్నిధిగుడారం దగ్గరకు తీసుకొని రావాలి. 6యాజకుడు ఆ రక్తంలో తన వేలు ముంచి, పవిత్రగది తెర ముందు యెహోవా ఎదుట ఏడు సార్లు ఆ రక్తాన్ని చిలకరించాలి. 7యాజకుడు సుగంధద్రవ్వాల ధూప వేదిక మీద ఆ రక్తంలో కొంత పూయాలి, (ఈ ధూపవేదిక సన్నిధిగుడారంలో యెహోవా ఎదుట ఉంటుంది). ఆ కోడెదూడ రక్తాన్ని అంతా దహన బలిపీఠం అడుగున యాజకుడు పోయాలి. ఆ బలిపీఠం సన్నిధి గుడారపు ద్వారం దగ్గర ఉంటుంది. 8మరియు అతడు పాప పరిహారార్థపు కోడెదూడ కొవ్వునంతా తీసివేయాలి. లోపలి భాగాలమీద, చుట్టూ ఉండే కొవ్వు అంతా అతడు తీసివేయాలి. 9రెండుమూత్ర పిండాలను, వాటిమీది కొవ్వును, నడుం దగ్గరనున్న కొవ్వును అతడు తీసుకోవాలి. కార్జాన్ని కప్పి ఉన్న కొవ్వును అతడు తీసుకోవాలి. మరియు అతడు మూత్రపిండాలతో బాటు కార్జాన్ని కూడా తీసుకోవాలి. 10సమాధాన బలిలో బలియివ్వబడే కోడెదూడనుండి తీసినట్టే అతడు వీటన్నింటినీ తీయాలి.#4:10 సమాధాన … తీయాలి లేవీ. 3:1-5 చూడండి. యాజకుడు దహన బలి పీఠంమీద దాని భాగాలన్నింటినీ కాల్చాలి. 11కాని, ఆ కోడెదూడ చర్మాన్ని, దాని మాంసం అంతటినీ, దాని తల, కాళ్లు, లోపలి భాగాలను, దాని పేడను యాజకుడు బయటకు తీసుకొనిపోవాలి. 12బసకు వెలుపల బూడిద పారబోసే ప్రత్యేకమైన చోటుకు ఆ కోడెదూడ కళేబరాన్ని యాజకుడు తీసుకుపోవాలి. అక్కడ కట్టెల మీద నిప్పుతో ఆ కోడెదూడను యాజకుడు కాల్చివేయాలి. బూడిద పారబోసే చోట ఆ కోడెదూడ కాల్చివేయబడుతుంది.
13“ఒక వేళ ఇశ్రాయేలు జనులంతా తెలియకుండా పాపం చేయటం తటస్థించవచ్చు. చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనా వారు చేసినట్లయితే వారు అపరాధులు అవుతారు. 14ఆ పాపం విషయమై వారు తెలుసుకొంటే, అప్పుడు ఆ జనాంగం అంతటి నిమిత్తం పాప పరిహారార్థబలిగా ఒక కోడెదూడను అర్పించాలి. సన్నిధి గుడారం ఎదుటికి వారు ఆ కోడెదూడను తీసుకొనిరావాలి. 15సమాజపు పెద్దలందరూ, యెహోవా ఎదుట ఆ కోడెదూడ మీద వారి చేతులు ఉంచాలి. యెహోవా ఎదుట ఆ కోడెదూడ వధించబడాలి. 16అప్పుడు అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడెదూడ రక్తంలో కొంత సన్నిధి గుడారం దగ్గరకు తీసుకొనిరావాలి. 17యాజకుడు ఆ రక్తంలో తన వేలు ముంచి, తెరముందు యెహోవా ఎదుట ఏడు సార్లు దాన్ని చిలకరించాలి. 18అప్పుడు యాజకుడు బలిపీఠం కొమ్ములకు కొంత రక్తం పూయాలి. ఆ బలిపీఠం సన్నిధి గుడారంలో యెహోవా ఎదుట ఉంది. రక్తాన్నంతా దహన బలిపీఠం అడుగున యాజకుడు పోయాలి. ఆ బలిపీఠం సన్నిధి గుడార ద్వారం దగ్గర ఉంది. 19అప్పుడు యాజకుడు దాని కొవ్వు అంతా తీసి బలిపీఠంమీద దహించాలి. 20పాప పరిహారార్థ బలిపశువుకు చేసినట్టే అతడు ఈ కోడెదూడకు కూడా చేయాలి#4:20 పాప … చేయాలి లేవీ. 4:3-12 చూడండి. ఈ విధంగా యాజకుడు ప్రజల పాపాలకు ప్రాయశ్చిత్తం చేస్తాడు. మరియు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు క్షమిస్తాడు. 21యాజకుడు ఆ కోడెదూడను బస బయటకు తీసుకొని వెళ్లి దానిని కాల్చివేయాలి. ఇదీ మొదటి కోడెదూడకు చేసినట్టే. ఇది మొత్తం సమాజానికి పాప పరిహారార్థ బలి.
22“చేయకూడదని యెహోవా చెప్పిన ఆజ్ఞలలో దేనినైనా ఒక అధికారి పొరబాటున అతిక్రమన చేసినట్లయితే, అప్పడు ఆ అధికారి అపరాధి అవుతాడు. 23అతడు తన పాపం విషయమై తెలుసుకొంటే, అతడు ఏ దోషమూ లేని ఒక మగ మేకను తీసుకొని రావాలి. అది అతని అర్పణ. 24ఆ అధికారి ఆ మేక మీద తన చేయి ఉంచి, యెహోవా ఎదుట వారు దహనబలి పశువును వధించు చోట దానిని వధించాలి. ఆ మేక పాపపరిహారార్థ బలి. 25యాజకుడు పాప పరిహారార్థబలిలో కొంత రక్తాన్ని తన వేలితో తీసుకోవాలి. యాజకుడు ఆ రక్తాన్ని దహన బలిపీఠం కొమ్ములకు పూయాలి. మిగిలిన రక్తాన్ని యాజకుడు దహన బలిపీఠం అడుగున పోయాలి. 26ఆ మేక కొవ్వు అంతటినీ యాజకుడు బలిపీఠం మీద దహించాలి. సమాధాన బలిలో కొవ్వును దహించినట్లు అతడు దానిని దహించాలి. ఈ విధంగా యాజకుడు అధికారి పాపమునకు ప్రాయశ్చితంచేస్తాడు. మరియు దేవుడు ఆ అధికారిని క్షమిస్తాడు.
27“చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనా ఒక సామాన్యుడు పొరబాటున చేయటం తటస్థించవచ్చు. 28అతడు తన పాపాన్ని గుర్తించినట్లయితే ఏదోషం లేని ఒక ఆడ మేకను అతడు తీసుకొని రావాలి. అది ఆ వ్యక్తి అర్పణ. అతడు చేసిన పాపం నిమిత్తం అతడు ఆ మేకను తీసుకొని రావాలి. 29అతడు దాని తల మీద తన చేతిని ఉంచి, దహనబలి స్థలంలో దానిని వధించాలి. 30అప్పుడు యాజకుడు ఆ మేక రక్తంలో కొంచెం తన వేలితో తీసుకొని, దహనబలిపీఠం కొమ్ములకు దానిని పూయాలి. ఆ మేక రక్తాన్నంతా బలిపీఠం అడుగున యాజకుడు పోయాలి. 31తర్వాత సమాధాన బలినుండి కొవ్వు అంతా తీసి వేసినట్టే ఆ మేక కొవ్వు అంతటినీ యాజకుడు తీసివేయాలి. దానిని యెహోవాకు ఇష్టమైన సువాసనగా బలిపీఠం మీద యాజకుడు దహించాలి. ఈ విధంగా ఆ వ్యక్తి పాపాన్ని యాజకుడు తుడిచి వేస్తాడు. మరియు ఆ వ్యక్తిని దేవుడు క్షమిస్తాడు.
32“ఈ వ్యక్తి తన పాపపరిహారార్థ బలిగా ఒక గొర్రె పిల్లను తీసుకొని వస్తే, అది ఏదోషమూలేని ఆడ గొర్రెయై ఉండాలి. 33అతడు దాని తలమీద తన చేయి ఉంచి, దహనబలి పశువును వధించే స్థలంలో, పాపపరిహారార్థ బలిగా దానిని కూడా వధించాలి. 34ఆ పాప పరిహారార్థ బలి రక్తాన్ని యాజకుడు తనవేలితో తీసుకొని, దహన బలిపీఠం కొమ్ములకు పూయాలి. తర్వాత ఆ గొర్రె రక్తాన్నంతా బలిపీఠం అడుగున అతడు పోయాలి. 35సమాధాన బలిలో గొర్రెపిల్ల కొవ్వునంతా తీసివేసినట్టే, ఆ గొర్రెపిల్ల యొక్క కొవ్వు అంతటినీ యాజకుడు తీసివేయాలి. యాజకుడు యెహోవాకు అర్పించే హోమంలా బలిపీఠం మీద ఆ ముక్కలను దహించాలి. ఈ విధంగా, ఆ వ్యక్తి పాపాలను యాజకుడు తుడిచి వేస్తాడు. మరియు దేవుడు ఆ వ్యక్తిని క్షమిస్తాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

లేవీయకాండము 4: TERV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి