లేవీయకాండము 5
5
విభిన్న అకస్మాత్తు పాపాలు
1“ఒక వ్యక్తి హెచ్చరికను వినవచ్చు, లేక ఒక వ్యక్తి తాను యితరులతో చెప్పాల్సిన ఒక విషయాన్ని వినటమో, చూడటమో తటస్థిస్తుంది. ఆ వ్యక్తి తాను చూసిన దాన్ని లేక విన్నదాన్ని చెప్పకపోతే అతడు అపరాధి.
2“లేక ఒకవేళ ఏదైనా అపవిత్రమైన దాన్ని ఒక వ్యక్తి తాకవచ్చును. అది అపవిత్ర జంతువు శవం గాని, లేక అపవిత్ర పశు శవంగాని, లేక అపవిత్రమైన ఒక పాకెడు జంతువు శవమేగాని కావచ్చును. వాటిని ముట్టుకొన్నట్టు అతనికి తెలియకపోయినా అతడు మాత్రం అపరాధి అవుతాడు.
3“ఒక మనిషి నుండి అపవిత్రం అయినవి ఎన్నోవస్తాయి. ఒక వ్యక్తి అవతల వ్యక్తిలోని యిలాంటి అపవిత్రమైన వాటిలో దేనినైనా ముట్టుకోవచ్చు, అది అతనికి తెలియకపోవచ్చు. అపవిత్రమైనది ఏదో తాను ముట్టుకొన్నానని అతనికి తెలిసినప్పుడు అతడు అపరాధి అవుతాడు.
4“లేక ఒక వ్యక్తి మంచిగాని చెడుగాని ఒకటి చేస్తానని తొందరపడి వాగ్దానం చేయవచ్చు. మనుష్యులు తొందరపడి చాలా వాగ్దానాలు చేస్తూంటారు. ఒకడు అలాంటి వాగ్దానంచేసి, దానిని మరిచిపోయి, మరల ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొన్నప్పుడు అతను దానిని చేయక పోతే అపరాధి అవుతాడు. 5కనుక వీటిలో దేని విషయంలో అతడు అపరాధియైనా, అతడు చేసిన తప్పు ఏమిటో అతడు చెప్పాలి. 6అతడు చేసిన పాపానికి పరిహారంగా అపరాధ పరిహారార్థబలిని యెహోవాకు అర్పించాలి. గొర్రెల మందలోనుండి ఒక ఆడ జంతువును పాప పరిహారార్థబలిగా అతడు తీసుకొని రావాలి. అది గొర్రెపిల్ల కావచ్చును, లేక మేక కావచ్చును. అప్పుడు ఆవ్యక్తి పాపాన్ని తుడిచివేసేందుకు చేయాల్సిన వాటిని యాజకుడు చేస్తాడు.
7“ఆ వ్యక్తి గొర్రెపిల్లను ఇవ్వలేకపోతే అతడు రెండు గువ్వలనుగాని, రెండు పావురాలను గాని తీసుకొని రావాలి. ఇవి అతని అపరాధ పరిహారార్థబలి. ఒకటి పాపపరిహారార్థ బలికోసం, మరొకటి దహన బలికోసం. 8ఆ వ్యక్తి వాటిని యాజకుని దగ్గరకు తీసుకొని రావాలి. పాపపరిహారార్థ బలిగా మొదట ఒక దాన్ని యాజకుడు అర్పిస్తాడు. యాజకుడు దాని తలను మెడనుండి వేరు చేస్తాడు. కానీ ఆ పక్షిని రెండు భాగాలుగా మాత్రం యాజకుడు విడదీయడు. 9పాపపరిహారార్థబలి రక్తాన్ని బలిపీఠం ప్రక్కలో యాజకుడు చిలకరించాలి. తర్వాత మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడుగున యాజకుడు పోయాలి. అది పాపపరిహారార్థ బలి. 10తర్వాత యాజకుడు చట్టం ప్రకారం దహన బలిగా రెండో పక్షిని అర్పించాలి. ఈ విధంగా యాజకుడు ఆ వ్యక్తి పాపాన్ని తుడిచి వేస్తాడు. మరియు దేవుడు ఆ వ్యక్తిని క్షమిస్తాడు.
11“ఆ వ్యక్తికి రెండు పావురాలను, రెండు గువ్వలను యిచ్చే సామర్థ్యం లేకపోతే తూమెడు మంచి పిండిలో పదోవంతును అతడు తీసుకొని రావాలి. ఇది అతని పాపపరిహారార్థ బలి అర్పణ. ఆ పిండిమీద అతడు నూనె పోయకూడదు. అది పాపపరిహారార్థ బలి గనుక అతడు దానిమీద సాంబ్రాణి కూడా వేయకూడదు. 12అతడు ఆ పిండిని యాజకుని దగ్గరకు తీసుకొని రావాలి. ఆ పిండిలోనుండి యాజకుడు పిడికెడు పిండిని జ్ఞాపకార్థ అర్పణగా తీసుకోవాలి. యెహోవాకు హోమం వేయు బలిపీఠం మీద యాజకుడు ఆ పిండిని దహించాలి. అది పాపపరిహారార్థ బలి. 13ఈ విధంగా ఆ వ్యక్తి పాపాన్ని యాజకుడు నిర్మూలిస్తాడు. మరియు దేవుడు ఆ వ్యక్తిని క్షమిస్తాడు. ధాన్యార్పణలో వలెనే పాపపరిహారార్థ బలిలో మిగిలినది కూడా యాజకునికి చెందుతుంది.”
14యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: 15“యెహోవా పవిత్ర విషయాలకు వ్యతిరేకంగా ఒకడు పొరబాటున ఏదైనా తప్పు చేయవచ్చును. అప్పుడు అతడు ఏ దోషమూ లేని ఒక పొట్టేలును మందలో నుండి తీసుకొని రావాలి. ఇది యెహోవాకు అతని అపరాధ పరిహారార్థ బలి అర్పణ. పవిత్ర స్థానపు అధికారిక కొలత ప్రకారం ఆ పొట్టేలుకు నీవు ధర నిర్ణయించాలి. 16పవిత్ర విషయానికి విరుద్ధంగా అతడు చేసిన పాపానికి అతడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆ ధరకు అయిదో వంతు అతడు కలపాలి. ఈ మొత్తాన్ని అతడు యాజకునికి ఇవ్వాలి. ఈ విధంగా అపరాధ పరిహారార్థ బలి పోట్టేలుతో ఆ వ్యక్తి పాపాన్ని యాజకుడు నిర్మూలిస్తాడు. దేవుడు ఆ వ్యక్తిని క్షమిస్తాడు.
17“ఒకడు పాపం చేసి, చేయగూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనా చేసినప్పుడు అది అతనికి తెలియకపోయినా ఆ వ్యక్తి అపరాధి అవుతాడు. అతడు తన పాపానికి బాధ్యత వహించాలి. 18ఆ వ్యక్తి ఏ దోషమూ లేని ఒక పొట్టేలును మందలోనుండి యాజకుని దగ్గరకు తీసుకొని రావాలి. ఆ పొట్టేలు అపరాధ పరిహారార్థబలి అర్పణ. ఆ వ్యక్తి తెలియక చేసిన పాపాన్ని ఈ విధంగా యాజకుడు నిర్మూలిస్తాడు. దేవుడు ఆ వ్యక్తిని క్షమిస్తాడు. 19ఆ వ్యక్తి చేస్తున్నది పాపం అని అతనికి తెలియకపోయినా అతడు అపరాధి అవుతాడు. కనుక అపరాధ పరిహారార్థ బలిని అతడు యెహోవాకు అర్పించాలి.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
లేవీయకాండము 5: TERV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International