1 కొరింథీ 10

10
ఇశ్రాయేలీయుల చరిత్ర నుండి హెచ్చరికలు
1సహోదరీ సహోదరులారా, మీరు సత్యం తెలియనివారిగా ఉండాలని నేను కోరడంలేదు, మన పూర్వికులందరూ మేఘం క్రింద ఉన్నారు, సముద్రం గుండా ప్రయాణించారు. 2వారందరు మేఘంలో సముద్రంలో మోషే బట్టి బాప్తిస్మం పొందారు. 3వారందరు ఒకే ఆత్మీయ ఆహారం తిన్నారు. 4అందరు ఒకే ఆత్మీయ నీటిని త్రాగారు, ఎందుకంటే, తమతో కూడా ఉన్న ఆత్మీయ బండ నుండి వారు త్రాగారు, ఆ బండ క్రీస్తే. 5అయినాసరే, వారిలో అనేకమంది దేవుణ్ణి సంతోషపరచలేదు; కనుక వారి శరీరాలు అరణ్యంలో చెల్లాచెదురుగా పడ్డాయి.
6వారిలా మన హృదయాలను చెడ్డ విషయాలపై నిలుపకుండా ఈ సంగతులు మనకు ఉదాహరణలుగా ఉన్నాయి. 7“ప్రజలు తినడానికి మరియు త్రాగడానికి కూర్చుని ఆనందించడానికి లేచారు”#10:7 నిర్గమ 32:6 అని వ్రాయబడిన ప్రకారం: వారిలో కొందరిలా మీరు విగ్రహారాధికులుగా ఉండకండి; 8వారిలో కొందరు చేసినట్టుగా మనం లైంగిక దుర్నీతికి పాల్పడకూడదు. దానివల్ల ఒక్క రోజులోనే వారిలో ఇరవై మూడు వేలమంది చనిపోయారు. 9వారిలో కొందరు శోధించినట్లుగా మనం క్రీస్తును శోధించకూడదు, అలా శోధించినవారు సర్పాలతో చంపబడ్డారు. 10వారిలో కొందరు సణిగినట్లు మనం సణుగకూడదు, వారిలో కొందరు సణిగి నాశనం చేసే దూతచేత చంపబడ్డారు.
11మనకు ఉదాహరణలుగా ఉండడానికి ఈ సంగతులు వారికి సంభవించి, రాబోయే యుగాంతంలో మనకు హెచ్చరికగా ఉండడానికి వ్రాయబడ్డాయి. 12కాబట్టి, తాము దృఢంగా నిలిచివున్నామని భావించేవారు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. 13సాధారణంగా మనష్యులకు కలిగే శోధనలు తప్ప మరి ఏ ఇతర శోధనలు మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహించగలిగిన దాని కంటె ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధించబడనివ్వడు. కాని మీరు శోధించబడినప్పుడు దానిని సహించడానికి తప్పించుకొనే మార్గాన్ని కూడా ఆయనే అందిస్తాడు.
విగ్రహపు విందులు మరియు ప్రభువు రాత్రి భోజనం
14కాబట్టి నా ప్రియ స్నేహితులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. 15నేను తెలివిగల వారితో మాట్లాడుతున్నాను; నేను చెప్పిన దాన్ని మీకు మీరే పరీక్షించుకోండి. 16మనం కృతజ్ఞతలు తెలియజేయడానికి ఆశీర్వాదపు పాత్రలోనిది త్రాగడం క్రీస్తు రక్తంలో పాలుపుచ్చుకోవడమే కదా? మనం రొట్టె విరిచి తినడం క్రీస్తు శరీరంలో పాలుపంచుకోవడమే గదా? 17మనమందరం ఆ ఒకే రొట్టెను పంచుకుంటున్నాం, రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనం ఒకే శరీరంగా ఉన్నాం.
18ఇశ్రాయేలు ప్రజలారా చూడండి: బలి అర్పించిన వాటిని తిన్నవారు బలిపీఠంలో భాగస్థులు కారా? 19ఇక నేను చెప్పేది ఏంటంటే, విగ్రహాలకు అర్పించిన ఆహారంలో ఏమైన ప్రత్యేకత ఉందా? విగ్రహం ఏమైన ప్రత్యేకమైనదా? 20కాదు, అయితే యూదేతరుల బలులు దయ్యాలకు అర్పించబడినవి కాని దేవునికి అర్పించినవి కావు, మీరు దయ్యాలతో భాగస్వాములుగా ఉండకూడదని నా కోరిక. 21మీరు ప్రభువు పాత్రను దయ్యపు పాత్రను రెండింటిని త్రాగలేరు. ప్రభువు బల్లలో దయ్యపు బల్లలో రెండింటిలో పాల్గొనలేరు. 22ప్రభువు యొక్క రోషాన్ని రేపడానికి మనం ప్రయత్నిస్తున్నామా? ఆయన కంటె మనం బలవంతులమా?
విశ్వాసుల స్వాతంత్ర్యం
23“ఏది చేయడానికైనా నాకు హక్కు ఉంది” అని మీరు అనుకోవచ్చు, కాని అన్ని ప్రయోజనకరమైనవి కావు. “ఏది చేయడానికైనా నాకు హక్కు ఉంది” కాని అన్నీ అభివృద్ధిని కలిగించవు. 24ఎవరైనా సరే తమ మంచినే చూసుకోకూడదు ఇతరుల మంచిని కూడా చూడాలి.
25మనస్సాక్షిని బట్టి ఏ ప్రశ్నలు వేయకుండా, మాంసం విక్రయించే సంతలో అమ్మే వేటినైనా తినవచ్చును. 26ఎందుకంటే, “భూమి దానిలో వుండే సమస్తం ప్రభువుకు చెందినవే.”#10:26 కీర్తన 24:1
27ఒక అవిశ్వాసి మిమ్మల్ని భోజనానికి పిలిచినపుడు మీరు వెళ్లాలనుకుంటే, మనస్సాక్షిని బట్టి ఏ ప్రశ్నలు వేయకుండా మీ ముందు ఉంచిన వాటిని తినండి. 28కాని ఎవరైన మీతో “ఇది విగ్రహాలకు అర్పించిన ఆహారం” అని చెబితే దాన్ని తినవద్దు. మీకు చెప్పినవాని కొరకు, మనస్సాక్షి కొరకు దాన్ని తినవద్దు. 29మీ మనస్సాక్షి గురించి కాదు, ఇతరుల మనస్సాక్షి గురించి నేను తెలియజేస్తున్నాను, ఎందుకంటే వేరొకరి మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర్యం ఎందుకు విమర్శించబడాలి? 30నేను కృతజ్ఞతతో ఒకవేళ భోజనంలో పాల్గొంటే, దేని కొరకు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించానో దాని కొరకు నేను ఎందుకు నిందించబడాలి?
31నీవు ఏమి తిన్నా, ఏమి త్రాగినా లేదా ఏమి చేసినా వాటన్నిటిని దేవుని మహిమ కొరకే చేయాలి. 32యూదులైనా, గ్రీసు దేశస్థులైనా, దేవుని సంఘమైనా మరి ఎవరైనా సరే తప్పిపోవడానికి కారణం కాకండి. 33అలాగే నేను కూడా ప్రతి ఒక్కరిని అన్ని విధాలుగా సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. నా స్వలాభాన్ని ఆశించకుండా, అనేకమంది రక్షింపబడాలని వారి మంచి కోరుతున్నాను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

1 కొరింథీ 10: TCV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి