1 కొరింథీ 11
11
1నేను క్రీస్తు మాదిరిని అనుసరించినట్లే, నా మాదిరిని అనుసరించండి.
ఆరాధనలో తలపై ముసుగు ధరించుట
2మీరు అన్ని విషయాలలో నన్ను జ్ఞాపకం చేసుకుంటూ, మీకు నేను అందించిన సంప్రదాయాలను అలాగే కొనసాగిస్తున్నందుకు నేను మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. 3అయితే ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అని, స్త్రీకి శిరస్సు పురుషుడని, క్రీస్తుకు శిరస్సు దేవుణ్ని మీరు గ్రహించాలని నేను కోరుతున్నాను. 4కనుక ఏ పురుషుడైనా తన తల మీద ముసుగు వేసుకుని ప్రార్థించినా లేక ప్రవచించినా అతడు తన తలను అవమానిస్తున్నాడు. 5అయితే ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకోకుండా ప్రార్థించినా లేక ప్రవచించినా ఆ స్త్రీ తన తలను అవమానపరుస్తున్నది. అలా చేస్తే ఆమె తలను క్షౌరం చేసినట్లుగా ఉంటుంది. 6స్త్రీ తన తలపై ముసుగు వేసుకోకపోతే, తన వెంట్రుకలను కత్తిరించుకోవాలి. అయితే వెంట్రుకలు కత్తిరించుకోవడం గాని లేదా తల క్షౌరం చేయించుకోవడం స్త్రీకి అవమానంగా అనిపిస్తే, ఆమె తలపై ముసుగు వేసుకోవాలి.
7పురుషుడు దేవుని పోలికగా మహిమగా ఉన్నాడు కనుక అతడు తన తలపై ముసుగు వేసుకోకూడదు; కాని స్త్రీ పురుషునికి మహిమగా ఉంది. 8ఎందుకంటే, పురుషుడు స్త్రీ నుండి రాలేదు గాని, స్త్రీ పురుషుని నుండి వచ్చింది. 9పురుషుడు స్త్రీ కొరకు సృష్టించబడలేదు గాని, పురుషుని కొరకు స్త్రీ సృష్టించబడింది. 10ఈ కారణంగా, దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తలపై ఉండాలి. 11అయితే, ప్రభువులో స్త్రీకి వేరుగా పురుషుడు, పురుషునికి వేరుగా స్త్రీ ఉండరు. 12పురుషుని నుండి స్త్రీ ఎలా కలిగిందో, అలాగే పురుషుడు స్త్రీ నుండి జన్మిస్తున్నాడు. అయితే సమస్తం దేవుని నుండి వచ్చాయి.
13మీకు మీరే విమర్శించుకోండి; స్త్రీ తలపై ముసుగు వేసుకోకుండా దేవునికి ప్రార్థన చేయడం సరియైనదేనా? 14పురుషుడు పొడవైన వెంట్రుకలు కలిగి ఉండడం అతనికి అవమానమని స్వభావ సిద్ధంగా మీకు బోధించలేదా? 15అయితే స్త్రీకి పొడవైన జుట్టు ఆమె తలను కప్పుకోవడానికి ఇవ్వబడింది కనుక పొడవైన జుట్టు కలిగి ఉండడం ఆమెకు గౌరవం కాదా? 16కాని, ఎవరైన దీని గురించి వాదించాలనుకుంటే, మనలో గాని దేవుని సంఘంలో గాని మరి ఏ ఇతర ఆచారం లేదని గ్రహించాలి.
ప్రభురాత్రి భోజనం యొక్క దుర్వినియోగాన్ని సరిదిద్దుట
17ఈ మార్గదర్శకాలను ఇస్తూ నేను మిమ్మల్ని మెచ్చుకోను, ఎందుకంటే మీ సమావేశాలు మంచి కంటే చెడునే ఎక్కువగా చేస్తున్నాయి. 18మొదటి విషయం, మీరు దేవుని సంఘంగా ఒకచోట చేరినప్పుడు మీలో విభేదాలు ఉన్నాయని నేను విన్నాను, ఇది కొంతవరకు నేను నమ్ముతున్నాను. 19మీలో ఎవరు దేవుని ఆమోదం పొందారో తెలియడానికి మీ మధ్యలో భేదాలు ఉన్నాయనడంలో సందేహం లేదు. 20అయితే మీరు సమావేశమైనప్పుడు మీరు తినేది ప్రభువు రాత్రి భోజనం కాదు. 21ఎందుకంటే, మీరు తింటున్నపుడు, మీలో కొందరు తమ భోజనాన్ని ముందుగానే చేసేస్తున్నారు. దాని ఫలితంగా ఒకరు ఆకలితో మిగిలిపోతే మరొకరు మత్తులై పోతున్నారు. 22తినడానికి, త్రాగడానికి మీకు ఇళ్లు లేవా? లేక ఏమి లేనివారిని అవమానించడం ద్వారా మీరు దేవుని సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా? నేను మీకు ఏమి చెప్పాలి? మిమ్మల్ని పొగడాలా? ఈ విషయంలో ఖచ్చితంగా కాదు.
23ఎందుకంటే, నేను మీకు అందించిన దాన్ని ప్రభువు నుండి పొందాను. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి రొట్టెను తీసుకుని, 24కృతజ్ఞతలు చెల్లించి, దాన్ని విరిచి ఇలా అన్నారు, “ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరం; నన్ను గుర్తు చేసుకోవడానికి ఇలా చేయండి.” 25అలాగే భోజనం అయిన తరువాత ఆయన పాత్రను తీసుకుని, “ఈ పాత్ర నా రక్తంలో క్రొత్త నిబంధన, దీన్ని మీరు త్రాగునపుడెల్ల, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇలా చేయండి” అని చెప్పారు. 26కనుక మీరు ఈ రొట్టెను తిని, ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా, ప్రభువు వచ్చేవరకు ఆయన మరణాన్ని ప్రకటిస్తారు.
27కాబట్టి, ఎవరైతే అయోగ్యంగా ప్రభువు రొట్టెను తిని, లేక ఆయన పాత్రలోనిది త్రాగుతారో, ప్రభువు యొక్క శరీరం రక్తం పట్ల అపరాధులవుతారు. 28కాబట్టి, ప్రతి ఒక్కరు ఆ రొట్టెను తినడానికి మరియు ఆ పాత్రలోనిది త్రాగడానికి ముందు తనను తాను పరీక్షించుకోవాలి. 29ఎందుకంటే, ఎవరైనా ప్రభువు శరీరమని వివేచించకుండా ఆ రొట్టెను తిని, పాత్రలోనిది త్రాగితే వారు తమపైకి తామే తీర్పు తెచ్చుకోవడానికే తిని త్రాగుతారు. 30ఈ కారణంగానే, మీలో చాలామంది వ్యాధిగ్రస్తులుగా, బలహీనులుగా ఉన్నారు, చాలామంది మరణిస్తున్నారు. 31కాబట్టి మనలను మనమే విమర్శించుకుంటూ ఉంటే, అలాంటి తీర్పుకు గురికాము. 32ప్రభువు ద్వారా మనం తీర్పు పొందినప్పుడు, అంతంలో ఈ లోకంతో పాటు శిక్షకు గురికాకుండా ఉండడానికి మనం క్రమపరచబడుతున్నాము.
33కాబట్టి, సహోదరీ సహోదరులారా! మీరు భోజనం చేయడానికి చేరినప్పుడు మీరందరు కలిసి భోజనం చేయండి. 34ఒకవేళ, మీరు ఒకచోట సమావేశమైనప్పుడు మీరు దేవుని తీర్పుకు గురికాకుండా ఎవరికైనా ఆకలిగా ఉంటే వారు ఇంటి దగ్గరే ఏదైనా తినాలి.
నేను అక్కడికి వచ్చినపుడు మరిన్ని నిర్దేశకాలను ఇస్తాను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 కొరింథీ 11: TCV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.