1 కొరింథీ పత్రిక 2

2
1సహోదరీ సహోదరులారా నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని మానవ తెలివితేటలతో గాని దేవుని మర్మాన్ని మీకు ప్రకటించలేదు. 2నేను మీతో ఉన్నప్పుడు సిలువవేయబడిన యేసు క్రీస్తు తప్ప మరి దేని గురించి తెలియజేయకూడదని నిర్ణయించుకున్నాను. 3నేనైతే బలహీనతలో, అధిక భయంతో వణుకుతో మీ దగ్గరకు వచ్చాను. 4-5మీ విశ్వాసం మనుష్యల జ్ఞానం మీద కాకుండా దేవుని శక్తి మీదే ఆధారపడాలని, నా మాటలు నా బోధలు జ్ఞానంతో వాక్చాతుర్యంతో కాకుండా పరిశుద్ధాత్మ శక్తితో నిండి ఉన్నాయి.
ఆత్మ వలన దేవుని జ్ఞానం బయలుపరచబడింది
6అయితే పరిపూర్ణులైనవారి మధ్యలో మేము జ్ఞానాన్ని బోధిస్తున్నాము. అది ఈ యుగసంబంధమైన జ్ఞానం కాదు, వ్యర్థమైపోయే ఈ లోక అధికారుల జ్ఞానం కాదు. 7అయితే, మేము దేవుని జ్ఞానాన్ని ప్రకటిస్తున్నాము. అది ఈ లోకం ఉనికిలోనికి రాకముందే, దేవుడు రహస్యంగా మన ఘనత కోసం దాచియుంచిన మర్మం. 8దీని గురించి ఈ యుగానికి చెందిన లోకాధికారులలో ఎవరికి తెలియలేదు. అది వారికి తెలిసి ఉంటే వారు మహిమా స్వరూపియైన ప్రభువును సిలువ వేసి ఉండేవారు కారు. 9అయితే దీని గురించి:
“ఎవరూ చూడని
ఎవరూ వినని
ఏ మనుష్యుని మనస్సు ఊహించనివాటిని#2:9 యెషయా 64:4
దేవుడు తనను ప్రేమించేవారి కోసం సిద్ధపరచారు”
అని వ్రాయబడి ఉంది.
10ఈ విషయాలను దేవుడు తన ఆత్మ ద్వారా మనకు తెలియజేశారు.
ఆత్మ అన్నిటిని, దేవుని లోతైన సంగతులను కూడ పరిశోధిస్తుంది. 11ఎందుకంటే ఒకరి మనస్సులోని ఆలోచనలు వారికి తప్ప మరి ఎవరికి తెలుస్తాయి? అలాగే దేవుని మనస్సులో ఉన్న ఆలోచనలు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. 12దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని తెలుసుకోవడానికి, మనం ఈ లోక ఆత్మను కాకుండా దేవుని నుండి వచ్చిన ఆత్మనే పొందుకున్నాము. 13మానవ జ్ఞానం మాకు నేర్పే మాటలతో కాకుండా, ఆత్మ నేర్పించిన మాటలతోనే మేము మాట్లాడుతున్నాం, ఆ మాటలతోనే ఆత్మీయ సత్యాలను వివరిస్తున్నాము. 14అయితే ప్రకృతి సంబంధులైన వారు దేవుని ఆత్మ నుండి వచ్చిన వాటిని అంగీకరించలేరు, వాటిని కేవలం ఆత్మ ద్వారానే గ్రహించగలం కాబట్టి, అవి వారికి వెర్రితనంగా అనిపిస్తాయి; వారు వాటిని గ్రహించలేరు. 15ఆత్మను అనుసరించి నడుచుకొనేవారు అన్నిటి గురించి వివేచిస్తారు కాని వారు ఎవరిచేత వివేచించబడరు. 16ఎందుకంటే,
“ప్రభువు మనస్సును తెలుసుకున్న వారెవరు?
ఆయనకు బోధింప గలవారెవరు?”#2:16 యెషయా 40:13
మనమైతే క్రీస్తు మనస్సును కలిగి ఉన్నాము.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

1 కొరింథీ పత్రిక 2: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి