1 కొరింథీ 5
5
అక్రమ సంబంధంగల వారితో వ్యవహరించుట
1మీ మధ్య వ్యభిచారం ఉన్నదని మేము విన్నాం. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట గదా! ఇలాంటి వ్యభిచారం యూదేతరులు కూడా సహించరు. 2ఇలా ఉండి కూడా మీరు గర్విస్తున్నారా! నిజానికి ఈ విషయం గురించి మీరు దుఃఖంతో ఈ పని చేసిన వానిని మీ సహవాసం నుండి వెలివేయవలసి ఉండింది కదా! 3నా మట్టుకైతే, నేను శారీరకంగా మీతో అక్కడ లేకపోయినా, నా ఆత్మలో నేను మీతోనే ఉన్నాను. కనుక మీతో ఉన్న వానిగానే మన ప్రభువైన యేసు నామంలో ఈ పని చేసిన వాని మీద తీర్పు ఇదివరకే తెలియజేసాను. 4ఎలాగంటే, ప్రభు యేసు నామంలో మీరు సమకూడినప్పుడు ప్రభువైన యేసు శక్తి ద్వారా నేను ఆత్మలో మీ సమక్షంలో మీతో ఉన్నాను. 5కనుక వానిని సాతానుకు అప్పగించాలి, అప్పుడు వాని శరీరం నశించినా కానీ ప్రభువు దినాన వాని ఆత్మ రక్షించబడుతుంది.
6మీరు ఆ విషయంలో గర్వించడం మంచిది కాదు. కొంచెం పులిసిన పిండి ముద్ద అంతా పులిసేలా చేసినట్లు సంఘమంతటికి చెడ్డపేరు తెస్తుందని మీకు తెలుసు కదా! 7క్రీస్తు అనే మన పస్కా గొర్రెపిల్ల మీ కొరకు వధింపబడి ప్రాయశ్చిత్తం చేశాడు కనుక మీరు పులియని క్రొత్త పిండి ముద్దగా ఉండడానికి పులిసిన పాత పిండిని పారవేయండి. 8కాబట్టి అసూయ, దుర్మార్గం అనే పులిసిన పాత పిండితో కాకుండా నిజాయితీ సత్యమనే పులియని రొట్టెతో పస్కా పండుగ ఆచరిద్దాం.
9లైంగిక దుర్నీతి కలిగినవారితో సహవాసం చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసాను. 10అయితే నేను వ్రాసింది, ఈ లోకపు వ్యభిచారులతో గాని, అత్యాశపరులతో గాని, మోసం చేసేవారితో గాని, విగ్రహారాధికులతో గాని ఏ మాత్రం కలిసి ఉండవద్దని చెప్పడం లేదు, అలాగైతే మీరు లోకాన్నే విడిచి వెళ్ళవలసి ఉంటుంది గదా! 11ఇప్పుడైతే, సహోదరి లేదా సహోదరుడని పిలువబడే సంఘసభ్యుల గురించి వ్రాస్తున్నాను. ఎవరైనా, వ్యభిచారిగా, అత్యాశపరునిగా, విగ్రహారాధికునిగా లేదా నిందలువేసే వారిగా, త్రాగుబోతుగా లేదా మోసగానిగా ఉంటే అలాంటి వారితో కలిసి ఉండవద్దు. అలాంటి వారితో భోజనం కూడా చేయవద్దని మీకు వ్రాస్తున్నాను.
12సంఘానికి వెలుపటనున్న వారిని విమర్శించడం నాకెందుకు? మీకు సంఘసభ్యులను తీర్చు తీర్చే బాధ్యత లేదా? 13సంఘం వెలుపలి వారికి దేవుడే తీర్పు తీరుస్తాడు. కనుక వాక్యంలో ఉన్నట్లు: “ఆ దుష్టున్ని మీ మధ్య నుండి వెలివేయండి.”#5:13 ద్వితీ 13:5; 17:7; 19:19; 21:21; 22:21,24; 24:7
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 కొరింథీ 5: TCV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.