1 థెస్సలోనికయులకు 2

2
థెస్సలొనీకయలో పౌలు పరిచర్య
1సహోదరీ సహోదరులారా! మేము మీ దగ్గరకు రావడం వ్యర్థం కాలేదని మీకు తెలుసు. 2మీకు తెలిసినట్టే, మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి దౌర్జన్యాన్ని అనుభవించాం కాని మన దేవుని సహాయంతో తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతున్నా ధైర్యంగా ఆయన సువార్తను మీకు ప్రకటించాము. 3సువార్త విషయమై మిమ్మల్ని ప్రాధేయపడడంలో మాకేమి తప్పుడు ఉద్దేశాలు లేవు, మేము మిమ్మల్ని మోసం చేయడం లేదు. 4దానికి బదులు, దేవుడు మాకు ఈ సువార్తను అప్పగించడానికి ఆయనచే యోగ్యులుగా ఎంచబడిన వారిలా మేము బోధిస్తున్నాము. కాబట్టి మేము మనుష్యులను మెప్పించడానికి కాకుండా మన హృదయాలను పరిశీలించే దేవుని మెప్పించడానికి ప్రయత్నిస్తున్నాము. 5మేము ఎన్నడు ముఖస్తుతి చేయలేదు, మేము అత్యాశను దాచిపెట్టే ముసుగును వేసుకోలేదని మీకు తెలుసు; దాని గురించి దేవుడే మాకు సాక్షి. 6మేము క్రీస్తు అపొస్తలులుగా మా అధికారాన్ని ప్రదర్శించే అవకాశం ఉన్నా ప్రజల నుండి గాని మీ నుండి గాని ఇతరుల నుండి గాని వచ్చే ఘనతను మేము ఆశించలేదు. 7కాని, మీ మధ్యలో చిన్నబిడ్డల్లా మృదువుగా ఉన్నాము.
పాలిచ్చు తల్లి తన పిల్లలను ఎలా చూసుకుంటుందో, 8మేము మిమ్మల్ని శ్రద్ధగా చూసుకున్నాము. ఎందుకంటే మేము మిమ్మల్ని ప్రేమించాం, కాబట్టి మేము మీతో దేవుని సువార్తను పంచుకోవడమే కాక మీ కోసం మా ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడ్డాము. 9సహోదరీ సహోదరులారా! మేము పడ్డ మా ప్రయాసాన్ని మా కష్టాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మేము ఎవరికి భారంగా ఉండకూడదని దేవుని సువార్తను మీ మధ్య ప్రకటించినప్పుడు, మేము రాత్రింబవళ్ళు పని చేసి మమ్మల్ని మేము పోషించుకున్నాము. 10విశ్వాసులైన మీ మధ్య మేము ఎంత భక్తిగా, నీతిగా ఎలాంటి నిందలేనివారిగా ఉన్నామో దానికి మీరే సాక్షులు, అలాగే దేవుడు సాక్షి. 11తండ్రి తన సొంత పిల్లల పట్ల ఉన్నట్లు మేము మీ పట్ల నడుచుకొన్నామని, 12మిమ్మల్ని తన రాజ్యంలోనికి, మహిమలోనికి పిలిచే దేవునికి తగినట్లుగా మీరు జీవించాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ, ఆదరిస్తూ వేడుకొంటున్నాను.
13అంతేకాక, మేము ప్రకటించిన దేవుని వాక్యాన్ని మీరు గ్రహించినందుకు, మీరు వాటిని మనుష్యుల మాటలుగా కాకుండా అవి నిజంగా దేవుని మాటలు అని, విశ్వసించినవారిలో అవి కార్యరూపం దాల్చుతాయని మీరు అంగీకరించినందుకు మేము దేవునికి మానక కృతఙ్ఞతలు తెలుపుచున్నాము. 14సహోదరీ సహోదరులారా, మీరు క్రీస్తు యేసులో ఉన్న యూదయలోని దేవుని సంఘాల్లా నడుచుకోవడం మొదలుపెట్టారు: యూదుల వలన ఆ సంఘాలు శ్రమపడిన విధంగానే మీరు కూడా మీ సొంత ప్రజల నుండి శ్రమపడ్డారు. 15వారే ప్రభువైన యేసు క్రీస్తును, ప్రవక్తలను చంపారు మనల్ని బయటకు తరిమేశారు. వారు దేవునికి కోపం కలిగిస్తారు, అందరితో విరోధంగా ఉంటారు. 16యూదేతరులకు రక్షణ కలిగించే బోధను మేము అందించకుండా వారు మమ్మల్ని అడ్డగించాలనే ప్రయత్నాలతో వారు తమ పాపాలను అంతులేకుండా పెంచుకుంటున్నారు. కాని దేవుని ఉగ్రత వారి మీదకు రానే వచ్చింది.
థెస్సలొనీయులను చూడాలని పౌలు కోరిక
17సహోదరీ సహోదరులారా, మీ నుండి కొంతకాలం శరీరరీత్య దూరంగా ఉన్నా, ఆలోచనలో మీకు ఎప్పుడు దగ్గరగానే ఉన్న మాకు గల గొప్ప ఆశను బట్టి మిమ్మల్ని చూడాలని ప్రతి ప్రయత్నం చేశాము. 18మేము మీ దగ్గరకు రావాలనుకున్నాము, నిజంగా పౌలును నేను అనేకసార్లు రావాలని ప్రయత్నించాను, కానీ సాతాను మమ్మల్ని ఆటంకపరిచాడు. 19మన ప్రభువైన యేసు క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఆయన ఎదుట మా నిరీక్షణ, ఆనందం, మా గౌరవ కిరీటం ఎవరు? అది మీరు కాదా? 20నిజానికి, మీరే మా గౌరవ కిరీటం, ఆనందమై ఉన్నారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

1 థెస్సలోనికయులకు 2: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి