1 తిమోతి పత్రిక 3
3
సంఘపెద్దలకు, సంఘ పరిచారకులకు ఉండాల్సిన అర్హతలు
1ఈ మాట నమ్మతగింది: ఎవరైనా ఒక సంఘపెద్దగా ఉండాలని ఆశిస్తే అది మంచి పనిని కోరడమే. 2సంఘపెద్ద నిందలేనివానిగా, ఒకే భార్యకు నమ్మకమైన భర్తగా, కోరికలను అదుపులో ఉంచుకునేవానిగా, స్వీయ నియంత్రణ గలవానిగా, మర్యాదస్థునిగా, ఆతిథ్య ప్రియునిగా, సత్యాన్ని బోధించగల సామర్థ్యం గలవానిగా ఉండాలి. 3అతడు త్రాగుబోతై ఉండకూడదు, చేయి చేసుకునేవాడు కాక, మృదు స్వభావం గలవానిగా ఉండాలి, కొట్లాడేవానిగా, డబ్బును ప్రేమించేవానిగా ఉండకూడదు. 4అతడు పూర్తిగా గౌరవించదగిన రీతిలో తన కుటుంబాన్ని చక్కగా నడిపించుకొంటూ తన పిల్లలు తనకు లోబడి ఉండేలా చూసుకోవాలి. 5ఒకడు తన సొంత కుటుంబాన్నే సరిదిద్దుకోలేనప్పుడు, అతడు దేవుని సంఘాన్ని ఎలా చూసుకోగలడు? 6అతడు నూతన విశ్వాసిగా ఉండకూడదు, ఎందుకంటే అతడు తన స్థానాన్ని బట్టి గర్వంతో ఉబ్బిపోతాడేమో, సాతాను పొందిన శిక్షకే అతడు కూడా గురి అవుతాడు. 7అతడు సంఘస్థులు కాని వారి దగ్గర కూడా మంచి సాక్ష్యం కలవాడై ఉండాలి, అప్పుడు అతడు నిందల పాలు కాడు, సాతాను వలలో చిక్కులో పడడు.
8అదే విధంగా, సంఘ పరిచారకులు కూడా గౌరవించదగినవారిగా, నిష్కపటంగా ఉండాలి, మద్యానికి బానిసగా ఉండకూడదు, అక్రమ సంపాదన ఆశించకూడదు. 9వారు స్వచ్ఛమైన మనస్సాక్షితో విశ్వాసపు మర్మాలను గట్టిగా పట్టుకోవాలి. 10వారు ఖచ్చితంగా మొదట పరీక్షించబడాలి; ఏ దోషం లేనివారిగా నిరూపించబడితేనే వారు సంఘపరిచారకులుగా సేవ చేయవచ్చు.
11అదే విధంగా, సంఘపరిచారకుల భార్యలు కూడా గౌరవించదగినవారిగా ఉండాలి, ద్వేషంతో మాట్లాడేవారిగా కాకుండా కోరికలను అదుపులో ఉంచుకునేవారిగా ప్రతి విషయంలో నమ్మకమైనవారిగా ఉండాలి.
12సంఘ పరిచారకుడు తన భార్యకు నమ్మకంగా ఉంటూ, తన పిల్లలను, కుటుంబాన్ని సరిగా నడిపించేవాడై ఉండాలి. 13తమ పనులను సక్రమంగా నెరవేర్చే పరిచారకులు ప్రజలమధ్య ఉత్తమ స్థాయిని పొందుకొని, క్రీస్తు యేసులో వారికున్న విశ్వాసంలో బహు ధైర్యంగా ఉంటారు.
పౌలు హెచ్చరికలకు కారణాలు
14త్వరలో నేను మీ దగ్గరకు రావాలనే నిరీక్షణతో ఈ విషయాలను వ్రాస్తున్నాను. 15త్వరలో నీ దగ్గరకు రావాలని ఆశిస్తున్నాను, ఒకవేళ నేను రావడం ఆలస్యమైనా కాని సత్యానికి పునాదిగా స్తంభంగా ఉన్న జీవంగల దేవుని సంఘమైన దేవుని గృహంలో ప్రజలు ఎలా ప్రవర్తించాలో నీకు తెలియజేయాలనే నేను ఈ సూచనలు వ్రాస్తున్నాను. 16నిస్సందేహంగా నిజమైన దైవభక్తిని గురించిన మర్మం గొప్పది, అది ఏంటంటే:
ఆయన శరీరంతో ప్రత్యక్షమయ్యారు,
పవిత్రాత్మ ఆయనను నీతిమంతుడని నిరూపించాడు,
దేవదూతలు ఆయనను చూశారు,
ఆయన గురించి భూరాజ్యాలన్నిటిలో ప్రజలు ప్రకటించారు,
ఆయన గురించి లోకమంతా నమ్మింది,
ఆయనను దేవుడు మహిమలోనికి తీసుకెళ్లారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 తిమోతి పత్రిక 3: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.