యెహెజ్కేలు 11

11
యెరూషలేముపై దేవుని ఖచ్చితమైన తీర్పు
1అప్పుడు ఆత్మ నన్ను పైకి లేపి తూర్పు వైపున ఉన్న యెహోవా మందిరపు ద్వారం దగ్గరకు తీసుకువచ్చాడు. ద్వారం దగ్గర ఇరవై అయిదుగురు మనుష్యులు ఉన్నారు, వారిలో ప్రజల నాయకులైన అజ్జూరు కుమారుడైన యాజన్యా, బెనాయా కుమారుడైన పెలట్యా నాకు కనిపించారు. 2యెహోవా నాతో ఇలా అన్నారు, “మనుష్యకుమారుడా, వీరు చెడు కుట్రలు పన్నుతూ ఈ పట్టణంలో దుష్ట సలహాలు ఇస్తున్నారు. 3వారు, ‘మన ఇల్లు కట్టుకోవడానికి ఇది సమయం కాదు; ఈ పట్టణం ఒక కుండ అయితే మనం దానిలో మాంసం’ అని అంటున్నారు. 4కాబట్టి వారికి వ్యతిరేకంగా ప్రవచించు; మనుష్యకుమారుడా, ప్రవచించు.”
5అప్పుడు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఇలా చెప్పమని నాతో చెప్పారు: “యెహోవా ఇలా చెప్తున్నారు: ఇశ్రాయేలు నాయకులారా, మీరు చెప్పేది అదే కాని మీ మనస్సులో వచ్చే ఆలోచనలు నాకు తెలుసు. 6మీరు ఈ పట్టణంలో ఎంతోమందిని చంపారు; మీరు చంపిన శవాలతో పట్టణ వీధులు నిండిపోయాయి.
7“కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మీరు చంపి పట్టణంలో పడవేసిన వారి శవాలే మాంసం, ఈ పట్టణం ఒక కుండ అయితే నేను మిమ్మల్ని పట్టణంలో ఉండకుండా వెళ్లగొడతాను. 8మీరు ఖడ్గానికి భయపడుతున్నారు, కాబట్టి నేనే మీ మీదికి ఖడ్గాన్ని రప్పిస్తానని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. 9నేను మిమ్మల్ని పట్టణంలో నుండి వెళ్లగొట్టి విదేశీయుల చేతికి మిమ్మల్ని అప్పగించి మీకు శిక్ష విధిస్తాను. 10ఇశ్రాయేలు సరిహద్దుల లోపలే మీరు ఖడ్గంతో చంపబడేలా నేను మిమ్మల్ని శిక్షిస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు. 11ఈ పట్టణం మీకు కుండగా ఉండదు, మీరు దానిలో మాంసం కారు. ఇశ్రాయేలు సరిహద్దులలో నేను మిమ్మల్ని శిక్షిస్తాను. 12మీ చుట్టూ ఉన్న జాతుల విధులను పాటించడానికి మీరు ఎవరి శాసనాలను అనుసరించకుండా ఎవరి విధులను పాటించలేదో ఆ యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు.”
13నేను ఈ విధంగా ప్రవచిస్తుండగానే బెనాయా కుమారుడైన పెలట్యా చనిపోయాడు. అప్పుడు నేను సాష్టాంగపడి గట్టిగా ఏడుస్తూ, “అయ్యో ప్రభువైన యెహోవా! ఇశ్రాయేలీయులలో మిగిలి ఉన్నవారిని కూడా పూర్తిగా నిర్మూలిస్తావా?” అని మొరపెట్టాను.
ఇశ్రాయేలీయులు తిరిగి వస్తారని వాగ్దానం
14అప్పుడు యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: 15“మనుష్యకుమారుడా, మీ తోటి బందీల గురించి ఇతర ఇశ్రాయేలీయులందరి గురించి యెరూషలేము ప్రజలు, ‘వారు యెహోవాకు చాలా దూరంగా ఉన్నారు; ఈ దేశం మా స్వాస్థ్యంగా ఇవ్వబడింది’ అని అంటున్నారు.
16“కాబట్టి వారికి ఈ మాట ప్రకటించు: ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: దూరంగా ఉన్న జాతుల మధ్యకు నేను వారిని పంపినా, దేశాల మధ్య వారిని చెదరగొట్టినా వారు వెళ్లిన దేశాల్లో కొంతకాలం వారికి నేను పరిశుద్ధాలయంగా ఉన్నాను.’
17“వారికి ఈ మాట ప్రకటించు: ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: ఆ జాతులలో నుండి మిమ్మల్ని సమకూర్చి, మీరు చెదిరిపోయిన దేశాల నుండి మిమ్మల్ని తిరిగి రప్పించి ఇశ్రాయేలు దేశాన్ని మీకు తిరిగి ఇస్తాను.’
18“వారు అక్కడికి వచ్చి అక్కడ తాము ఉంచిన అసహ్యమైన విగ్రహాలను హేయమైన వాటిని తొలగిస్తారు. 19నేను వారికి ఏక హృదయం ఇచ్చి వారిలో నూతన ఆత్మను ఉంచుతాను; నేను వారిలో నుండి రాతి హృదయాన్ని తీసివేసి వారికి మాంసపు హృదయాన్ని ఇస్తాను. 20అప్పుడు వారు నా శాసనాలను అనుసరించి నా కట్టడలను పాటించడంలో జాగ్రత్తగా ఉంటారు. వారు నా ప్రజలుగా ఉంటారు, నేను వారికి దేవుడనై ఉంటాను. 21అయితే తమ విగ్రహాలను అనుసరిస్తూ ఎప్పటిలాగే అసహ్యమైన పనులు చేసేవారికి వాటి ప్రతిఫలాన్ని వారి తల మీదికి రప్పిస్తానని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.”
22అప్పుడు కెరూబులు రెక్కలు విప్పాయి, చక్రాలు వాటి ప్రక్కనే ఉన్నాయి. ఇశ్రాయేలు దేవుని మహిమ వాటిపై ఉంది. 23యెహోవా మహిమ పట్టణంలో నుండి పైకి వెళ్లి తూర్పున ఉన్న కొండ పైన ఆగింది. 24దేవుని ఆత్మ వలన వచ్చిన దర్శనంలో ఆత్మ నన్ను పైకి ఎత్తి బబులోనీయుల#11:24 లేదా కల్దీయుల ఈ గ్రంథంలో అన్ని చోట్ల ఇది వర్తిస్తుంది దేశంలో బందీలుగా ఉన్న వారి దగ్గరకు తీసుకువచ్చింది.
అంతలో నాకు కనబడిన దర్శనం నన్ను విడిచి వెళ్లిపోయింది. 25అప్పుడు యెహోవా నాకు చూపించిన వాటన్నిటిని బందీలుగా ఉన్నవారికి చెప్పాను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెహెజ్కేలు 11: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి