యెహెజ్కేలు 12

12
బందీలకు సూచన
1యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: 2“మనుష్యకుమారుడా, నీవు తిరుగుబాటుదారుల మధ్య జీవిస్తున్నావు. వారు తిరుగుబాటు చేసే ప్రజలు కాబట్టి చూసే కళ్లు ఉన్నా చూడరు, వినే చెవులు ఉన్నా వినరు.
3“కాబట్టి మనుష్యకుమారుడా, దేశాంతరం వెళ్లడానికి నీ వస్తువులను సర్దుకుని, పగటివేళ వారు చూస్తుండగానే బయలుదేరి నీవు ఉన్న చోటు నుండి వేరొక ప్రదేశానికి వెళ్లు. వారు తిరుగుబాటుదారులే అయినా బహుశా వారు అర్థం చేసుకోవచ్చు. 4పగలు వారు చూస్తుండగా దేశం నుండి వెళ్లిపోడానికి సర్దుకున్న నీ సామాన్లు బయటకు తీసుకురా. సాయంత్రం వారు చూస్తుండగా దేశం విడిచి వెళ్తున్నట్లుగా బయలుదేరి వెళ్లు. 5వారు చూస్తుండగా, గోడను త్రవ్వి దానిలో నుండి నీ వస్తువులను బయటకు తీయి. 6వారు చూస్తుండగానే వాటిని నీ భుజంపై వేసుకుని సంధ్యా సమయంలో వాటిని తీసుకుని వెళ్లు. నేను నిన్ను ఇశ్రాయేలీయులకు సూచనగా చేశాను కాబట్టి నీకు నేల కనిపించకుండా నీ ముఖాన్ని కప్పుకో.”
7నాకు ఆజ్ఞాపించిన ప్రకారమే నేను చేశాను. దేశం విడిచి వెళ్తున్నట్లుగా పగలు నా సామాన్లు బయటకు తెచ్చాను. సాయంత్రం నా చేతితో గోడను త్రవ్వాను. రాత్రి వారు చూస్తుండగా నా సామాన్లు భుజంపై ఎత్తుకున్నాను.
8ఉదయాన యెహోవా వాక్కు నా దగ్గరకు వచ్చింది: 9మనుష్యకుమారుడా, నీవేం చేస్తున్నావని తిరుగుబాటుదారులైన ఇశ్రాయేలీయులు నిన్ను అడగలేదా?
10“వారితో ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: ఈ ప్రవచనం యెరూషలేములోని యువరాజుకు అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులందరికి సంబంధించినది.’ 11వారికి ఈ మాట చెప్పు: ‘నేను మీకు సూచనగా ఉన్నాను.’
“నేను చేసినట్లే వారికి కూడా జరుగుతుంది. వారు బందీలుగా దేశం నుండి కొనిపోబడతారు.
12“వారిలో యువరాజు రాత్రివేళ తన సామాన్లు భుజంపై వేసుకుని తాను వెళ్లడానికి గోడను త్రవ్వుతాడు. అతడు నేల కనిపించకుండా తన ముఖాన్ని కప్పుకుంటాడు. 13అతన్ని పట్టుకోడానికి వల వేయగా అతడు దానిలో చిక్కుకుంటాడు. నేను అతన్ని బబులోనీయుల దేశమైన బబులోనుకు తీసుకువస్తాను కానీ అతడు దానిని చూడకుండానే అక్కడే అతడు చనిపోతాడు. 14అతనితో ఉన్నవారందరిని అనగా అతని సహాయకులను అతని సైన్యాన్ని గాలికి చెదరగొడతాను. కత్తి దూసి వారినందరిని తరుముతాను.
15“నేను వారిని జాతుల మధ్యకు చెదరగొట్టి వివిధ దేశాలకు వెళ్లగొట్టినప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు. 16వారు వెళ్లే దేశాల్లోని ప్రజలకు వారు చేసే అసహ్యమైన ఆచారాల గురించి వివరించడానికి వారిలో కొంతమందిని ఖడ్గం నుండి కరువు తెగులు నుండి కాపాడి తప్పిస్తాను. అప్పుడు వారు నేనే యెహోవానని తెలుసుకుంటారు.”
17యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: 18“మనుష్యకుమారుడా, వణుకుతూ నీ ఆహారం తిను, భయంతో తడబడుతూ నీ నీళ్లు త్రాగు. 19దేశంలోని ప్రజలకు ఇలా చెప్పు: ‘యెరూషలేములో ఇశ్రాయేలు దేశంలో నివసిస్తున్నవారి గురించి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: అక్కడ నివసించే వారందరు చేసే హింస కారణంగా వారి దేశంలోని ప్రతిదీ తీసివేయబడుతుంది. కాబట్టి వారు ఆందోళనలో తమ ఆహారాన్ని తింటారు నిరాశతో నీరు త్రాగుతారు. 20నివాసులు ఉండిన పట్టణాలు వ్యర్థమైన శిథిలాలుగా, దేశం నిర్జనంగా మారుతాయి. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.’ ”
ఏమాత్రం ఆలస్యం ఉండదు
21యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: 22“మనుష్యకుమారుడా, ‘రోజులు గడిచిపోతున్నాయి, ప్రతీ దర్శనం విఫలమవుతుంది’ అని ఇశ్రాయేలు దేశంలో చెప్పే సామెతకు అర్థం ఏమిటి? 23వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: ఇకపై ఇశ్రాయేలు దేశంలో వినబడకుండ నేను ఆ సామెతకు ముగింపు ఇవ్వబోతున్నాను. ప్రతీ దర్శనం నెరవేరబోయే రోజులు ఎదురుగా ఉన్నాయని వారితో చెప్పు. 24ఇశ్రాయేలీయుల మధ్య తప్పుడు దర్శనాలు గాని పొగడ్తలతో కూడిన భవిష్యవాణి గాని ఉండవు. 25అయితే యెహోవానైన నేను, నేను ఏమి చేస్తానో అదే మాట్లాడతాను, అది ఆలస్యం లేకుండా నెరవేరుతుంది. ఎందుకంటే, తిరుగుబాటుదారులారా, మీ రోజుల్లో నేను చెప్పేది నెరవేరుస్తానని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”
26యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: 27“మనుష్యకుమారుడా, ఇశ్రాయేలీయులు, ‘అతడు చూసే దర్శనం నెరవేరడానికి చాలా సంవత్సరాల పడుతుంది, అతడు చాలా కాలం తర్వాత భవిష్యత్తులో జరిగే వాటి గురించి ప్రవచిస్తున్నాడు’ అని అంటున్నారు.
28“కాబట్టి వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఇకపై నా మాటల్లో ఏదీ ఆలస్యం కాదు; నేను చెప్పిన మాటలన్నీ నెరవేరుతాయి, అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెహెజ్కేలు 12: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి