యెహెజ్కేలు 7
7
అంతం వచ్చింది
1యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: 2“మనుష్యకుమారుడా, ప్రభువైన యెహోవా ఇశ్రాయేలీయుల దేశానికి చెప్తున్న మాట ఇదే:
“ ‘అంతం! అంతం వచ్చేసింది
దేశం నలువైపులా వచ్చేసింది!
3ఇప్పుడు నీ మీద అంతం వచ్చేసింది!
నా కోపాన్ని నీపై కుమ్మరిస్తాను.
నీ ప్రవర్తన బట్టి నీకు తీర్పు తీర్చి
నీ అసహ్యకరమైన ఆచారాలన్నిటిని బట్టి నీకు తిరిగి చెల్లిస్తాను.
4నీ మీద ఏమాత్రం దయ చూపించను
నిన్ను వదిలిపెట్టను.
నీ ప్రవర్తనకు నీ మధ్య ఉన్న
అసహ్యకరమైన ఆచారాలన్నిటికి నీకు ప్రతిఫలమిస్తాను.
“ ‘నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు.’
5“ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే:
“ ‘విపత్తు! విపత్తు వెనకే విపత్తు
చూడండి, అది వచ్చేస్తుంది!
6అంతం వచ్చేసింది!
అంతం వచ్చేసింది!
అది నీ కోసమే చూస్తుంది;
ఇదిగో, వచ్చింది.
7దేశ నివాసులారా!
మీ మీదికి వినాశనం వస్తుంది.
సమయం దగ్గరకి వచ్చింది! ఆ రోజు సమీపంగా ఉంది!
ఆనందం కాదు భయమే పర్వతాలమీద వినపడుతుంది.
8నా ఉగ్రత మీపై కుమ్మరించబోతున్నాను.
నా కోపాన్ని మీమీద చూపిస్తాను.
మీ ప్రవర్తనకు మీరు చేసిన
అసహ్యకరమైన ఆచారాలన్నిటికి మీకు ప్రతిఫలమిస్తాను.
9మీమీద ఏమాత్రం దయ చూపించను;
మిమ్మల్ని వదిలిపెట్టను.
మీ ప్రవర్తనకు, మీ మధ్య ఉన్న
అసహ్యకరమైన ఆచారాలన్నిటికి మీకు ప్రతిఫలమిస్తాను.
“ ‘అప్పుడు యెహోవానైన నేనే మిమ్మల్ని శిక్షిస్తున్నానని మీరు తెలుసుకుంటారు.’
10“ ‘ఇదిగో ఆ రోజు!
అది వచ్చేస్తుంది!
నాశనం బయలుదేరి వచ్చేసింది
దండం వికసించింది.
గర్వం చిగురించింది.
11బలాత్కారం మొదలై
దుష్టులను శిక్షించే దండం అయింది.
ప్రజల్లో గాని
వారి గుంపులో గాని,
ఆస్తిలో గాని,
వారి ప్రఖ్యాతిలో గాని ఏదీ మిగల్లేదు.
12ఆ సమయం వచ్చింది!
ఆ రోజు వచ్చింది!
ఆ గుంపు అంతటి మీద నా ఉగ్రత ఉంది.
కాబట్టి కొనేవాడు సంతోష పడనక్కరలేదు
అమ్మే వానికి దుఃఖ పడనక్కరలేదు.
13అమ్మినవాడు కొన్న వాడు జీవించి ఉన్నంత కాలం
అమ్మినవాడు తాను అమ్మిన దానిని తిరిగిపొందడు.
ఈ దర్శనం ఆ గుంపు అంతటికి సంబంధించినది
అది తప్పక నెరవేరుతుంది.
వారి పాపాల కారణంగా వారిలో ఎవరూ
తమ ప్రాణాలను రక్షించుకోలేడు.
14“ ‘వారంతా సిద్ధపడి
యుద్ధానికి బూరలను ఊదుతారు.
ఆ గుంపు అంతటి మీద నా ఉగ్రత ఉంది
కాబట్టి వారిలో ఏ ఒక్కరూ యుద్ధానికి వెళ్లరు.
15బయట కత్తి ఉంది;
లోపల తెగులు కరువు ఉన్నాయి.
బయట ఉన్నవారు
కత్తి వలన చచ్చారు;
పట్టణంలో ఉన్నవారు
తెగులు కరువు వలన నాశనమవుతారు.
16వాటినుండి తప్పించుకున్నవారు
పర్వతాల మీదకు పారిపోయి
తమ పాపాలను బట్టి
వారిలో ప్రతి ఒక్కరు
లోయ పావురాల్లా మూల్గుతారు.
17ప్రతీ చేయి బలహీనం అవుతుంది;
ప్రతీ కాలు మూత్రంతో తడిసిపోతుంది.
18వారు గోనెపట్ట కట్టుకుంటారు
భయం వారిని ఆవరిస్తుంది.
ప్రతి ఒక్కరు సిగ్గుతో తలవంచుకుంటారు,
ప్రతి తల క్షౌరం చేయబడుతుంది.
19“ ‘వారు తమ వెండిని వీధుల్లో పారేస్తారు,
వారి బంగారం అపవిత్రంగా పరిగణించబడుతుంది.
యెహోవా ఉగ్రత దినాన
వారి వెండి బంగారాలు
వారిని రక్షించలేవు.
వారు పాపంలో పడడానికి అవి కారణంగా ఉన్నందుకు
వాటివలన వారి ఆకలి తీరదు
వారి కడుపు నిండదు.
20అందమైన ఆభరణాల బట్టి గర్వించి
హేయమైన విగ్రహాలను తయారుచేయడానికి వాటిని ఉపయోగించారు.
వారు దానిని నీచమైన చిత్రాలుగా మార్చారు;
కాబట్టి నేను దానిని వారి కోసం ఒక అపవిత్రమైనదానిగా చేస్తాను.
21నేను వారి సంపదను విదేశీయులకు ఎరగా
భూమిమీది దుర్మార్గులకు దోపుడు సొమ్ముగా అప్పగిస్తాను
వారే దానిని అపవిత్రపరుస్తారు.
22వారిని చూడకుండ నా ముఖాన్ని త్రిప్పుకుంటాను,
కాబట్టి దొంగలు నా నిధి ఉన్న స్థలాన్ని అపవిత్రపరుస్తారు.
వారు దానిలోనికి వెళ్లి
దానిని మలినం చేస్తారు.
23“ ‘దేశమంతా రక్తంతో
పట్టణమంతా హింసతో నిండిపోయింది
కాబట్టి సంకెళ్ళు సిద్ధం చేయండి.
24వారి ఇళ్ళను స్వాధీనం చేసుకోవడానికి
ప్రజల్లో అత్యంత దుష్ట జాతులను రప్పిస్తాను.
నేను వారి బలవంతుల గర్వాన్ని అణచివేస్తాను
వారి పరిశుద్ధాలయాలు అపవిత్రం చేయబడతాయి.
25భయం కలిగినప్పుడు
వారు సమాధానాన్ని వెదుకుతారు కాని అది దొరకదు.
26నాశనం వెంబడి నాశనం వస్తుంది,
పుకార్ల మీద పుకార్లు పుట్టుకొస్తాయి.
వారు ప్రవక్త దగ్గరకి దర్శనం కోసం వెళ్తారు
ధర్మశాస్త్ర జ్ఞానం యాజకులకు ఉండదు.
పెద్దలు ఆలోచన చేయరు.
27రాజు దుఃఖిస్తారు,
యువరాజు నిరాశకు గురవుతాడు,
దేశ ప్రజల చేతులు వణకుతాయి.
వారి ప్రవర్తనను బట్టి వారికి చేస్తాను,
వారి సొంత ప్రమాణాల ప్రకారమే నేను వారికి తీర్పు తీరుస్తాను.
“ ‘అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెహెజ్కేలు 7: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapistaging.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fte.png&w=128&q=75)
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.