హెబ్రీయులకు 3

3
యేసు మోషే కంటె గొప్పవాడు
1కనుక, పరలోక పిలుపులో భాగస్థులైన పరిశుద్ధ సహోదరీ సహోదరులారా, మన అపొస్తలునిగా ప్రధాన యాజకునిగా మనం అంగీకరించిన యేసు మీద మీ ఆలోచనలను ఉంచండి. 2దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నట్లు ఈయన తనను నియమించిన వానికి నమ్మకంగా ఉన్నాడు. 3ఇల్లు కంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు, మోషే కంటే యేసు అధికమైన మహిమకు అర్హుడుగా కనబడ్డాడు. 4ప్రతి ఇల్లు ఎవరో ఒకరి ద్వారా కట్టబడింది, అయితే దేవుడు ప్రతి దానికి నిర్మాణకుడు. 5“మోషే దేవుని సేవకునిగా దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వానిగా ఉన్నాడు”#3:5 సంఖ్యా 12:7 దేవుడు భవిష్యత్తులో చెప్పబోయేవాటికి సాక్షిగా ఉన్నాడు. 6అయితే క్రీస్తు, కుమారుడిగా దేవుని ఇంటిపైన నమ్మకంగా ఉన్నాడు. ఒకవేళ మన ధైర్యాన్ని, మనం కీర్తించే నిరీక్షణను గట్టిగా పట్టుకుంటే, మనమే ఆయన గృహం.
విశ్వాసంలేని వారికి హెచ్చరిక
7కనుక, పరిశుద్ధాత్మ చెప్పినట్లు:
“నేడు, ఆయన స్వరాన్ని మీరు వింటే,
8అరణ్యంలో శోధన సమయంలో,
మీరు తిరుగుబాటు చేసిన విధంగా,
మీ హృదయాలను కఠినపరచుకోవద్దు;
9అంటే అరణ్యంలో నలభై సంవత్సరాలు నేను చేసిన కార్యాలు చూసాక కూడా,
మీ పితరులు నన్ను శోధించారు.
10అందుకే ఆ తరం వారిపై నేను కోపగించి ఇలా అన్నాను;
‘వారి హృదయాలు ఎల్లప్పుడు దారి తప్పిపోతున్నాయి,
నా మార్గాలను వారు తెలుసుకోలేదు,’
11గనుక, ‘వారు ఎన్నడు నా విశ్రాంతిలో ప్రవేశింపరు’
అని నేను కోపంలో ప్రమాణం చేశాను.”#3:11 కీర్తన 95:7-11
12కనుక సహోదరీ సహోదరులారా, జీవంగల దేవుని నుండి దూరంచేసే పాప స్వభావం, అవిశ్వాసపు హృదయం మీలో ఎవరికి ఉండకుండ జాగ్రత్తగా చూసుకోండి. 13పాపం యొక్క మోసంచేత మీలో ఎవరూ కఠినపరచబడకుండ ఉండడానికి, నేడు అని పిలువబడుతున్న దినం ఉండగానే మీరు ప్రతి దినం ఒకరినొకరు ధైర్యపరచుకొంటూ ఉండండి. 14ఒకవేళ మనకున్న మొదటి నిశ్చయతను అంతం వరకు గట్టిగా పట్టుకొని వుంటే, మనం క్రీస్తులో పాలుపంచుకుంటాము. 15ఇప్పుడే చెప్పబడినట్లుగా,
“నేడు, ఆయన స్వరాన్ని మీరు వింటే,
మీరు తిరుగుబాటులో చేసినట్టుగా
మీ హృదయాలు కఠినం చేసుకోకండి.”
16దేవుని స్వరాన్ని విని ఆయన మాటను వ్యతిరేకించి తిరుగుబాటు చేసింది ఎవరు? వారందరు ఐగుప్తు నుండి మోషే చేత బయటకు నడిపించబడినవారు కారా? 17ఆయన ఎవరితో నలభై సంవత్సరాలు కోపంగా ఉన్నాడు? పాపం చేయడం వల్ల ఎవరి శరీరాలు అరణ్యంలో నశించాయో, వారితో కాదా? 18తన విశ్రాంతిలో ఎన్నడూ ప్రవేశించరని దేవుడు అవిధేయులతో కాక, మరెవరికి ప్రమాణం చేశాడు? 19కాబట్టి వారి అవిశ్వాసం వల్లనే వారు ప్రవేశించలేక పోయారని మనం చూస్తున్నాం.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

హెబ్రీయులకు 3: TCV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి