హెబ్రీయులకు 4

4
దేవుని ప్రజలకు విశ్రాంతి
1అందువల్ల, ఆయన విశ్రాంతిలోకి ప్రవేశిస్తామన్న వాగ్దానం ఇప్పటికీ ఉంది కనుక, మీలో ఎవరూ దాన్ని పొందలేని పరిస్థితిలో లేకుండా జాగ్రత్తపడదాము. 2ఎందుకంటే సువార్త వారికి ప్రకటించబడిన విధంగానే మనకు ప్రకటించబడింది; అయితే సువార్తకు విధేయత చూపించినవారితో వారు విశ్వాసంతో కలిసివుండలేదు కనుక విన్న సువార్త వారికి ప్రయోజనంగా లేదు. 3అయితే విశ్వసించిన మనం ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తాం. అయితే దేవుడు ఇలా అన్నారు,
“ ‘గనుక వారు ఎన్నడు నా విశ్రాంతిలో ప్రవేశింపరు,’
అని నేను కోపంలో ప్రకటించాను.”#4:3 కీర్తన 95:11; 5
ఆయన తన కార్యాలన్ని లోకాన్ని సృష్టించినప్పుడే పూర్తి చేశారు. 4దేవుడు ఏడవ దినాన్ని గురించి ఇంకొక చోట ఇలా అన్నారు: “దేవుడు ఏడవ దినాన తన కార్యాలన్నిటిని ముగించి విశ్రమించారు.”#4:4 ఆది 2:2 5పై వచనంలో ఆయన, “వారు ఎన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపరు” అని అన్నారు.
6అయితే కొందరు ఆ విశ్రాంతిని గురించిన సువార్తను విన్నా కూడ తాము విన్నవాటిని వారు నమ్మలేదు కనుక ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించలేకపోయారు. 7మరల దేవుడు ఒక దినాన్ని సిద్ధపరచి దాన్ని “నేడు” అని పిలుస్తున్నాడు.
“నేడు, ఆయన స్వరాన్ని మీరు వింటే,
మీ హృదయాలను కఠినపరచుకోవద్దు.”#4:7 కీర్తన 95:7,8
అని ముందుగా వాక్యంలో వ్రాయబడిన ప్రకారం చాలాకాలం తరువాత ఆయన దావీదు ద్వారా కూడా యిదే మాటను మాట్లాడారు. 8ఒకవేళ యెహోషువ వారికి విశ్రాంతి ఇచ్చివుంటే, దేవుడు మరొక దినాన్ని గురించి మాట్లాడివుండేవాడు కాడు. 9కనుక దేవుని ప్రజలకు ఏడవ రోజు సబ్బాతు దినం; 10ఎవరైనా దేవుని విశ్రాంతిలోకి ప్రవేశిస్తే, దేవుడు తన పనుల నుండి విశ్రాంతి పొందినట్లే, వారు కూడా తమ పనుల నుండి విశ్రాంతి పొందుతారు. 11కనుక, వారి అవిధేయత మాదిరిని అనుసరించి ఎవరూ నశించిపోకుండా ప్రతి ప్రయత్నాన్ని చేసి దేవుని విశ్రాంతిలో ప్రవేశిద్దాం.
12దేవుని వాక్యం సజీవమైనది చురుకైనది. అది రెండంచులు కలిగిన ఏ ఖడ్గం కన్నా పదును కలిగి, ప్రాణాన్ని, ఆత్మను, కీళ్ళను, మూలుగను వేరుచేస్తూ లోనికి చొచ్చుకొని పోతూ, హృదయం యొక్క ఆలోచనలను, వైఖరిని పరీక్షిస్తుంది. 13సృష్టి అంతటిలో దేవుని దృష్టి నుండి దాచబడింది ఏది లేదు. మనం ఎవరికి లెక్క అప్పగించాల్సి ఉందో ఆయన కళ్ళ ముందు ప్రతిదీ తెరవబడి స్పష్టంగా ఉంది.
యేసు గొప్ప ప్రధాన యాజకుడు
14కాబట్టి, పరలోకంలోకి ఎక్కివెళ్ళిన#4:14 పరలోకంలోకి ఎక్కివెళ్ళిన అనగా ఆకాశాల గుండా వెళ్ళినవాడు దేవుని కుమారుడైన యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం అంగీకరించిన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొందాం. 15అయితే మన ప్రధాన యాజకుడు మనలానే అన్ని విధాలుగా శోధించబడినప్పటికి ఆయన పాపం చేయలేదు కనుక మన బలహీనతల గురించి సానుభూతి చూపించేవాడు. 16కావున మన అవసర సమయంలో సహాయపడేలా కనికరం కృప పొందడానికి మనం ధైర్యంగా దేవుని కృపా సింహాసనాన్ని సమీపిద్దాం.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

హెబ్రీయులకు 4: TCV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి