యెషయా 28
28
ఎఫ్రాయిం, యూదా నాయకులకు శ్రమ
1ఎఫ్రాయిం త్రాగుబోతుల గర్వకారణమైన పూల కిరీటానికి శ్రమ,
వాడిపోతున్న పువ్వు వంటి అతని మహిమగల సౌందర్యానికి శ్రమ,
ద్రాక్షరసం మత్తులో పడిపోయిన వారి
సంపన్న లోయ తలమీద ఉన్న కిరీటానికి శ్రమ.
2చూడండి, బలం, పరాక్రమం కలిగిన ఒకడు ప్రభువుకు ఉన్నాడు.
వడగండ్లు, తీవ్రమైన గాలులు
కుండపోత వర్షం, తీవ్రమైన వరద కొట్టివేసినట్లు
ఆయన తన బలంతో దానిని నేలమీద పడవేస్తారు.
3ఎఫ్రాయిం త్రాగుబోతుల గర్వకారణమైన పూల కిరీటం
కాళ్లతో త్రొక్కబడుతుంది.
4ఫలవంతమైన లోయ తలపై ఉన్న
వాడిపోయిన పువ్వు లాంటి అతని వైభవం
కోతకాలం రాకముందే పండిన అంజూర పండులా ఉంటుంది.
ప్రజలు వాటిని చూడగానే తమ చేతిలోనికి తీసుకుని
వెంటనే వాటిని మ్రింగివేస్తారు.
5ఆ రోజున సైన్యాల యెహోవా
మిగిలిన తన ప్రజలకు
తానే మహిమగల కిరీటంగా
సుందరమైన పూల కిరీటంగా ఉంటారు.
6ఆయన న్యాయస్థానంపై కూర్చునే వారికి
వివేచన ఆత్మగా
గుమ్మం దగ్గరే యుద్ధాన్ని త్రిప్పికొట్టేవారికి
బలానికి మూలంగా ఉంటారు.
7అయితే వీరు కూడ ద్రాక్షరసం త్రాగి తూలుతారు
తీర్పు చెప్పవలసి వచ్చినప్పుడు తడబడతారు
యాజకులు ప్రవక్తలు మద్యం మత్తులో తూలుతారు
ద్రాక్షరసం వలన అయోమయంగా ఉంటారు;
మద్యం మత్తులో తడబడతారు
దర్శనం వచ్చినప్పుడు తూలుతారు
తీర్పు చెప్పవలసిన సమయం వచ్చినప్పుడు తడబడతారు.
8వారి బల్లలన్నీ వాంతితో నిండి ఉన్నాయి
మురికి లేనిచోటు ఉండదు.
9“ఆయన ఎవరికి బోధించే ప్రయత్నం చేస్తున్నారు?
ఆయన తన సందేశాన్ని ఎవరికి వివరిస్తున్నారు?
తల్లి రొమ్ము విడిచిన వారికా,
స్తన్యమును విడిచిన వారికా?
10ఇది చేయండి, అది చేయండి
దీనికి ఈ నియమం, దానికి ఆ నియమం;
కొంత ఇక్కడ, కొంత అక్కడ” అని వారు అనుకుంటారు.
11అప్పుడు పరదేశీయుల పెదాలతో వింత భాషలో
దేవుడు ఈ ప్రజలతో మాట్లాడతారు.
12గతంలో ఆయన వారితో,
“ఇది విశ్రాంతి స్థలం, అలసిపోయినవారిని విశ్రాంతి తీసుకోనివ్వండి;
ఇది నెమ్మది దొరికే స్థలం”
అని చెప్పారు కాని వారు వినలేదు.
13కాబట్టి వారికి యెహోవా వాక్కు ఇలా అవుతుంది:
ఇది చేయాలి, అది చేయాలి
దీనికి ఆజ్ఞ, దానికి ఆజ్ఞ
కొంత ఇక్కడ కొంత అక్కడ
అప్పుడు వారు వెళ్తుండగా వెనుకకు పడతారు;
వారు గాయపరచబడతారు, ఉచ్చులో పడతారు, పట్టబడతారు.
14కాబట్టి యెరూషలేములో ఉన్న ఈ ప్రజలను పాలిస్తున్న
ఎగతాళి చేసేవారలారా, యెహోవా వాక్కు వినండి.
15“మేము చావుతో నిబంధన చేసుకున్నాం,
పాతాళంతో ఒప్పందం చేసుకున్నాము.
ప్రమాదం ప్రవాహంలా వేగంగా వచ్చినప్పుడు
అది మమ్మల్ని తాకదు,
ఎందుకంటే అబద్ధాన్ని మాకు అండగా చేసుకున్నాం,
అసత్యాన్ని#28:15 లేదా అబద్ధ దేవుళ్ళు మా దాగు స్థలంగా చేసుకున్నాం”
అని మీరు అతిశయిస్తున్నారు.
16కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే:
“చూడండి, నేను సీయోనులో ఒక రాయిని,
పరీక్షించబడిన రాయిని వేశాను,
అది స్థిరమైన పునాదికి అమూల్యమైన మూలరాయి;
దానిపై నమ్మకముంచేవారు
ఎప్పుడూ భయాందోళనలకు గురికారు.
17నేను న్యాయాన్ని కొలమానంగా,
నీతిని మట్టపు గుండుగా చేస్తాను:
వడగండ్లు మీ అబద్ధం అనే ఆశ్రయాన్ని తుడిచివేస్తాయి.
మీ దాగుచోటు నీటికి కొట్టుకుపోతుంది.
18చావుతో మీరు చేసుకున్న నిబంధన కొట్టివేయబడుతుంది;
పాతాళంతో మీరు చేసుకున్న ఒప్పందం నిలవదు.
ప్రవాహంలా శాపం మీ మీదికి వచ్చినప్పుడు
మీరు దానిచే కొట్టబడతారు.
19అది వచ్చిన ప్రతిసారి మిమ్మల్ని ఈడ్చుకెళ్తుంది;
ప్రతి ఉదయం, ప్రతి పగలు, ప్రతి రాత్రి
అది ఈడ్చుకెళ్తుంది.”
ఈ సందేశాన్ని గ్రహించినప్పుడు
చాలా భయం పుడుతుంది.
20పడుకోడానికి మంచం పొడవు సరిపోదు.
కప్పుకోడానికి దుప్పటి వెడల్పు చాలదు.
21నిజంగా తన పనిని తన ఆశ్చర్యకరమైన పనిని
అపూర్వమైన తన పని చేయడానికి
ఆయన పెరాజీము అనే కొండమీద లేచినట్లుగా యెహోవా లేస్తారు.
గిబియోను లోయలో ఆయన రెచ్చిపోయినట్లు రెచ్చిపోతారు.
22ఇప్పుడు మీ ఎగతాళి మానండి
లేదంటే మీ సంకెళ్ళు మరింత భారమవుతాయి;
భూమంతా ఖచ్చితంగా నాశనం చేయబడుతుందని
సైన్యాల అధిపతియైన యెహోవా నాకు చెప్పారు.
23జాగ్రత్తగా నా మాట వినండి;
నేను చెప్పేది శ్రద్ధగా వినండి.
24రైతు నాటడానికి ఎప్పుడూ తన పొలాన్ని దున్నుతూనే ఉంటాడా?
అతడు మట్టి పెల్లలు ఎప్పుడూ పగులగొడుతూనే ఉంటాడా?
25అతడు నేల చదును చేసిన తర్వాత
సోంపు, జీలకర్ర విత్తనాలు చల్లడా?
గోధుమలను వాటి స్థలంలో నాటడా?
యవలను వాటి చోట వేయడా?
పొలం అంచుల్లో ధాన్యం నాటడా?
26అతని దేవుడు అతనికి నేర్పిస్తారు
సరిగా ఎలా చేయాలో ఆయనే అతనికి బోధిస్తారు.
27సోంపును యంత్రంతో నూర్చరు,
జీలకర్ర మీద బండి చక్రం నడిపించరు;
కర్రతో సోంపును
దుడ్డుకర్రతో జీలకర్రను కొట్టి దులుపుతారు.
28రొట్టె చేయడానికి ధాన్యాన్ని దంచాలి;
కాబట్టి ఎప్పుడూ దానిని నూర్చుతూనే ఉండరు.
నూర్చే బండి చక్రాలు దానిపై నడిపిస్తారు,
కాని వాటిని పిండి చేయడానికి గుర్రాలను ఉపయోగించరు.
29ఇదంతా సైన్యాల యెహోవా నుండి నేర్చుకుంటారు,
ఆయన ఆలోచన అద్భుతం,
ఆయన జ్ఞానం గొప్పది.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెషయా 28: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapistaging.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fte.png&w=128&q=75)
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.