యెషయా 61

61
యెహోవా యొక్క దయా సంవత్సరము
1ప్రభువైన యెహోవా ఆత్మ నా మీద ఉన్నది.
బీదలకు సువార్త ప్రకటించడానికి
యెహోవా నన్ను అభిషేకించారు.
విరిగిన హృదయం గలవారిని బలపరచడానికి
బందీలకు విడుదలను
ఖైదీలకు చీకటి నుండి విముక్తిని ప్రకటించడానికి,
2యెహోవా హితవత్సరాన్ని,
మన దేవుని ప్రతీకార దినాన్ని ప్రకటించడానికి
దుఃఖిస్తున్న వారందరినీ ఓదార్చడానికి,
3సీయోనులో దుఃఖిస్తున్న వారికి
బూడిదకు బదులుగా
అందమైన కిరీటాన్ని
దుఃఖానికి బదులు
ఆనంద తైలాన్ని
భారమైన ఆత్మకు బదులు
స్తుతి వస్త్రాన్ని అందించడానికి నన్ను పంపారు.
యెహోవా తన వైభవాన్ని కనుపరచడానికి,
నీతి అనే సింధూర చెట్లని
యెహోవా నాటిన చెట్లని వారు పిలువబడతారు.
4పురాతన శిథిలాలను వారు మరలా కడతారు
గతంలో నాశనమైన స్థలాలను వారు పునరుద్ధరిస్తారు;
పాడైపోయిన పట్టణాలను
తరతరాల నుండి నాశనమైన ఉన్న స్థలాలను వారు నూతనపరుస్తారు.
5అపరిచితులు మీ మందల్ని మేపుతారు;
విదేశీయులు మీ పొలాల్లో ద్రాక్షతోటల్లో పని చేస్తారు.
6మీరు యెహోవా యాజకులని పిలువబడతారు,
మా దేవుని సేవకులు అని మీకు పేరు పెట్టబడుతుంది.
దేశాల సంపదను మీరు అనుభవిస్తారు
వారి ఐశ్వర్యాన్ని పొంది అతిశయిస్తారు.
7మీ అవమానానికి బదులుగా
రెట్టింపు ఘనత పొందుతారు.
నిందకు బదులుగా
మీ స్వాస్థ్యంలో మీరు సంతోషిస్తారు.
మీరు మీ దేశంలో రెట్టింపు స్వాస్థ్యాన్ని పొందుతారు,
శాశ్వతమైన ఆనందం మీకు కలుగుతుంది.
8“ఎందుకంటే యెహోవానైన నాకు న్యాయమంటే ఇష్టము;
దోపిడి చేయడం, చెడు చేయడం నాకు అసహ్యము.
నా నమ్మకత్వాన్ని బట్టి నా ప్రజలకు ప్రతిఫలమిస్తాను
వారితో శాశ్వతమైన నిబంధన చేస్తాను.
9వారి వారసులు దేశాల మధ్య
వారి సంతానం జనాంగాల మధ్య ప్రసిద్ధి పొందుతారు.
వారు యెహోవా ఆశీర్వదించిన ప్రజలని
వారిని చూసినవారందరు గుర్తిస్తారు.”
10యాజకునిలా తలపాగా ధరించిన పెండ్లికుమారునిలా
నగలతో అలంకరించుకున్న పెండ్లికుమార్తెలా
ఆయన నాకు రక్షణ వస్త్రాలను ధరింపచేశారు
ఆయన నీతి అనే పైబట్టను నాకు ధరింపచేశారు
కాబట్టి యెహోవాలో నేను ఎంతో ఆనందిస్తున్నాను.
నా దేవునిలో నా ఆత్మ సంతోషిస్తుంది.
11భూమి మొలకను మొలిపించినట్లు,
విత్తనాలు ఎదిగేలా చేసే తోటలా,
అన్ని దేశాల ఎదుట ప్రభువైన యెహోవా
నీతిని, స్తుతిని మొలకెత్తేలా చేస్తారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెషయా 61: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి