యెషయా 62
62
సీయోను యొక్క క్రొత్త పేరు
1సీయోను నీతి ఉదయకాంతిలా ప్రకాశించే వరకు,
దాని రక్షణ కాగడాలా వెలిగే వరకు,
సీయోను పక్షంగా నేను మౌనంగా ఉండను.
యెరూషలేము పక్షంగా నేను ఊరుకోలేను.
2దేశాలు నీ నీతిని చూస్తాయి.
రాజులందరూ నీ మహిమను చూస్తారు.
యెహోవా నీకు ఇవ్వబోయే
క్రొత్త పేరుతో నీవు పిలువబడతావు.
3నీవు యెహోవా చేతిలో వైభవ కిరీటంగా,
నీ దేవుని చేతిలో రాజకిరీటంగా ఉంటావు.
4ఇకపై నీవు విడిచిపెట్టబడిన దానివని పిలువబడవు,
నీ దేశం పాడైపోయిందని పిలువబడదు.
అయితే నీవు హెఫ్సీబా#62:4 హెఫ్సీబా అంటే నా ఆనందం ఆమెలో ఉంది అని
నీ దేశం బ్యూలా#62:4 బ్యూలా అంటే పెళ్ళి అయ్యింది అని పిలువబడుతుంది;
యెహోవా నీలో ఆనందిస్తారు
నీ దేశానికి పెళ్ళి అవుతుంది.
5యువకుడు యువతిని పెళ్ళి చేసుకున్నట్లు
నిన్ను కట్టేవాడు నిన్ను చేసుకుంటాడు;
పెళ్ళికుమారుడు పెళ్ళికుమార్తెను చూసి సంతోషించినట్లు,
నీ దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తారు.
6యెరూషలేమా! నీ గోడల మీద నేను కావలివారిని నియమించాను;
పగలు గాని రాత్రి గాని వారు మౌనంగా ఉండరు.
యెహోవాకు మొరపెట్టే వారలారా
విశ్రాంతి తీసుకోకండి,
7యెరూషలేమును స్థాపించే వరకు
భూమి మీద దానికి ప్రసిద్ధి కలుగజేసే వరకు ఆయనకు విశ్రాంతి ఇవ్వకండి.
8యెహోవా తన కుడిచేతితో
తన బలమైన హస్తంతో ఇలా ప్రమాణం చేశారు:
“ఇకనుండి ఎప్పుడూ నీ ధాన్యాన్ని
నీ శత్రువులకు ఆహారంగా నేనివ్వను.
నీవు కష్టపడి తీసిన ద్రాక్షారసాన్ని
విదేశీయులు ఇక ఎన్నడు త్రాగరు;
9అయితే పంట పండించిన వారే దానిని తిని
యెహోవాను స్తుతిస్తారు.
ద్రాక్షలను సమకూర్చిన వారే
నా పరిశుద్ధాలయ ఆవరణాల్లో దాని త్రాగుతారు.”
10రండి, గుమ్మాల ద్వారా రండి!
ప్రజలకు మార్గం సిద్ధపరచండి.
నిర్మించండి, రహదారిని నిర్మించండి!
రాళ్లను తొలగించండి.
దేశాలు చూసేలా జెండాను ఎత్తండి.
11భూమి అంచుల వరకు
యెహోవా చేస్తున్న ప్రకటన:
“ ‘ఇదిగో నీ రక్షకుడు వస్తున్నాడు!
ఆయన ఇచ్చే బహుమానం ఆయన దగ్గరే ఉంది
ఆయన ఇచ్చే జీతం ఆయన దగ్గరే ఉంది’ అని
సీయోను కుమార్తెతో చెప్పండి.”
12వారు పరిశుద్ధ ప్రజలని,
యెహోవా విడిపించినవారని పిలువబడతారు;
నీవు అందరికి కావలసిన దానివని
పాడుబడని పట్టణమని పిలువబడతావు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెషయా 62: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.