యెషయా 63

63
దేవుని తీర్పు, విమోచన దినం
1రక్తపు మరకలు కలిగిన బట్టలు వేసుకుని ఎదోము నుండి
బొస్రానుండి వస్తున్న ఇతడెవరు?
రాజ వస్త్రాలను ధరించి గంభీరంగా నడుస్తూ
గొప్ప బలంతో వస్తున్న ఇతడెవరు?
“విజయాన్ని ప్రకటిస్తూ
రక్షించగల సమర్థుడనైన నేనే.”
2నీ బట్టలు ద్రాక్షగానుగను త్రొక్కేవాని బట్టల్లా
ఎర్రగా ఎందుకు ఉన్నాయి?
3“నేను ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కాను;
దేశాల్లో ఏ ఒక్కరూ నాతో లేరు.
నా కోపంలో వారిని త్రొక్కివేశాను
నా ఉగ్రతలో వారిని అణగద్రొక్కాను;
వారి రక్తం నా బట్టలమీద చిందింది,
నా బట్టలన్నిటికి మరకలయ్యాయి.
4అది నేను పగతీర్చుకునే రోజు;
నేను విమోచించే సంవత్సరం వచ్చింది.
5నేను చూశాను కాని సహాయం చేయడానికి ఎవరూ లేరు;
ఎవరూ సహకారం అందించకపోవడం చూసి నేను ఆశ్చర్యపోయాను;
కాబట్టి నా సొంత చేయి నాకు రక్షణ ఇచ్చింది
నా కోపమే నన్ను ఆదుకుంది.
6నేను నా కోపంతో దేశాలను త్రొక్కివేశాను
నా ఉగ్రతలో వారు మత్తెక్కేలా చేశాను
వారి రక్తాన్ని నేలమీద పారబోశాను.”
స్తుతి, ప్రార్థన
7యెహోవా మనకు చేసినదంతటిని బట్టి,
యెహోవా కృపలను,
యెహోవా స్తుతులను నేను ప్రకటిస్తాను.
అవును, ఆయన తన కనికరాన్ని బట్టి, గొప్ప దయను బట్టి
ఇశ్రాయేలుకు ఆయన చేసిన అనేక మేలుల గురించి
నేను చెప్తాను.
8ఆయన అన్నారు, “నిజంగా వారు నా ప్రజలు,
నాకు నమ్మకంగా ఉండే పిల్లలు”;
కాబట్టి ఆయన వారికి రక్షకుడయ్యారు.
9వారి బాధంతటిలో ఆయన కూడా బాధ అనుభవించారు,
ఆయన సన్నిధి యొక్క దూత వారిని రక్షించాడు.#63:9 లేదా రక్షకుడు అక్కడ రాయబారి లేదా దూత కాదు కాని ఆయన సన్నిధే వారిని రక్షించింది
ఆయన ప్రేమతో, జాలితో వారిని విడిపించారు;
పూర్వ రోజులన్నిటిలో
ఆయన వారిని ఎత్తుకుంటూ, మోస్తూ వచ్చారు.
10అయినా వారు తిరుగుబాటు చేసి
ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపరిచారు.
కాబట్టి ఆయన వారికి శత్రువయ్యారు
తానే వారితో యుద్ధం చేశారు.
11అప్పుడు ఆయన ప్రజలు పూర్వ రోజులను,
మోషేను తన ప్రజలను జ్ఞాపకం చేసుకున్నారు
తన మందకాపరులతో పాటు
తమను సముద్రంలో నుండి తీసుకువచ్చిన ఆయనేరి?
తమలో తన పరిశుద్ధాత్మను
ఉంచిన ఆయనేరి?
12మోషే కుడిచేతి వైపు
మహిమగల తన చేతిని పంపిన ఆయనేరి?
తనకు శాశ్వతమైన కీర్తి రాడానికి
వారి ఎదుట నీళ్లను విభజించిన ఆయనేరి?
13మైదానంలో గుర్రం నడిచినట్లు
వారు పడిపోకుండా
లోతైన జలాల్లో నడిపించిన ఆయనేరి?
14లోయలోనికి దిగివెళ్లే పశువుల్లా
యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసింది.
మీకు ఘనమైన పేరు రావాలని
మీరు మీ ప్రజలను ఇలా నడిపించారు.
15పరలోకం నుండి,
గంభీరమైన, పరిశుద్ధమైన మహిమగల సింహాసనం నుండి క్రిందికి చూడండి.
మీ ఆసక్తి మీ బలము ఏవి?
మా పట్ల మీకున్న జాలి కనికరం మా నుండి నిలిపివేయబడ్డాయి.
16అయితే అబ్రాహాముకు మేము తెలియకపోయినా
ఇశ్రాయేలు మమ్మల్ని గుర్తించకపోయినా
మాకు తండ్రి మీరే;
యెహోవా! మాకు తండ్రి మీరే,
పూర్వకాలం నుండి మా విమోచకుడవని మీకు పేరు.
17యెహోవా! మేము మీ మార్గాల నుండి తొలగిపోయి తిరిగేలా ఎందుకు చేశారు?
మిమ్మల్ని భయపడకుండా మా హృదయాల్ని ఎందుకు కఠినపరిచారు?
మీ సేవకుల కోసం,
మీ స్వాస్థ్యమైన గోత్రాల కోసం తిరిగి రండి.
18మీ ప్రజలు కొద్ది కాలమే మీ పరిశుద్ధ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు
కాని ఇప్పుడు మా శత్రువులు మీ పరిశుద్ధాలయాన్ని త్రొక్కివేశారు.
19పూర్వం నుండి మేము మీ వారము;
కాని మీరెన్నడు వారిని పాలించలేదు,
వారు మీ పేరుతో పిలువబడలేదు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెషయా 63: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి