యెషయా 65
65
తీర్పు, రక్షణ
1“నన్ను అడగని వారికి నన్ను నేను బయలుపరచుకొన్నాను;
నన్ను వెదకనివారికి నేను దొరికాను.
‘నేనున్నాను, ఇదిగో నేనున్నాను’ అని
నా పేరిట మొరపెట్టని దేశంతో చెప్పాను.
2తమ ఊహల ప్రకారం చేస్తూ
చెడు మార్గంలో నడుస్తూ ఉన్న
మూర్ఖులైన ప్రజలకు నేను దినమంతా
నా చేతులు చాపాను.
3వారు తోటల్లో బలులు అర్పిస్తూ
ఇటుకల బలిపీఠం మీద ధూపం వేస్తూ
నా ముఖం మీద
నాకు కోపం తెప్పించిన ప్రజలు;
4వారు సమాధుల మధ్యలో కూర్చుని
రహస్య జాగారం చేస్తూ వారి రాత్రులు గడుపుతారు;
వారు పందిమాంసం తింటారు.
అపవిత్రమైన మాంసం కూర వారి పాత్రల్లో ఉంది;
5వారు, ‘నా దగ్గరకు రావద్దు. దూరంగా ఉండండి,
మీకంటే నేను ఎంతో పరిశుద్ధున్ని’ అని అంటారు.
అలాంటివారు నా నాసిక రంధ్రాలకు పొగలా,
రోజంతా మండే నిప్పులా ఉన్నారు.
6-7“చూడండి, ఇది నా ఎదుట గ్రంథంలో వ్రాయబడింది:
నేను మౌనంగా ఉండను, వారికి పూర్తి ప్రతిఫలం చెల్లిస్తాను;
మీ పాపాలకు మీ పూర్వికుల పాపాలకు,
నేను వారికి వారి ఒడిలో ప్రతిఫలం చెల్లిస్తాను”
అని యెహోవా అంటున్నారు.
“ఎందుకంటే, వారు పర్వతాలమీద ధూపం వేశారు,
కొండలమీద నన్ను అవమానించారు,
గతంలో వారు చేసిన వాటన్నిటికి వారి ఒడిలోనే
పూర్ణ ప్రతీకారాన్ని కొలిచి పోస్తాను.”
8యెహోవా చెప్పే మాట ఇదే:
“ద్రాక్షగుత్తిలో ఇంకా రసం కనబడినప్పుడు
ప్రజలు, ‘దానిలో ఆశీర్వాదం ఉంది,
దానిని నాశనం చేయకండి’ అని చెప్తారు కదా.
అలాగే నా సేవకులందరి కోసం చేస్తాను;
నేను వారందరిని నాశనం చేయను.
9యాకోబు నుండి యూదా నుండి వారసుల్ని తీసుకువస్తాను,
వారు నా పర్వతాల్ని స్వాధీనపరచుకుంటారు.
నేను ఏర్పరచుకున్న ప్రజలు వాటిని స్వతంత్రించుకుంటారు.
నా సేవకులు అక్కడ నివసిస్తారు.
10నన్ను వెదకే నా ప్రజల కోసం
షారోను గొర్రెలకు పచ్చికబయళ్లుగా,
ఆకోరు లోయ పశువులకు విశ్రాంతి తీసుకునే చోటుగా ఉంటాయి.
11“అయితే యెహోవాను విడిచి,
నా పరిశుద్ధ పర్వతాన్ని మరచి,
గాదు#65:11 అంటే అదృష్టం దేవునికి బల్లను సిద్ధపరచి,
మెనీ#65:11 అంటే విధి, తలరాత దేవునికి ద్రాక్షరస పాత్రలు నింపేవారలారా,
12నేను ఖడ్గానికి మిమ్మల్ని అప్పగిస్తాను,
మీరందరు వధకు గురై కూలిపోతారు;
ఎందుకంటే, నేను పిలిస్తే మీరు సమాధానం ఇవ్వలేదు,
నేను మాట్లాడితే మీరు వినలేదు.
నా దృష్టిలో మీరు చెడుగా ప్రవర్తించి
నాకు అయిష్టమైన వాటిని ఎంచుకున్నారు.”
13కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే:
“నా సేవకులు భోజనం చేస్తారు,
కాని మీరు ఆకలితో ఉంటారు;
నా సేవకులు త్రాగుతారు
కాని మీరు దాహంతో ఉంటారు;
నా సేవకులు సంతోషిస్తారు
కాని మీరు సిగ్గుపరచబడతారు.
14నా సేవకులు తమ ఆనంద హృదయాలతో
పాటలు పాడతారు,
మీరు హృదయ వేదనతో ఏడుస్తారు
నలిగిన ఆత్మలతో రోదిస్తారు.
15నేను ఏర్పరచుకున్నవారు వారి శాపవచనాల్లో
మీ పేరును ఉపయోగిస్తారు;
ప్రభువైన యెహోవా మిమ్మల్ని చంపుతారు.
ఆయన తన సేవకులకు మరొక పేరు పెడతారు.
16దేశంలో ఆశీర్వాదం ఉండాలని కోరుకునేవారు
ఖచ్చితంగా ఏకైక నిజ దేవుని పేరిట ఆశీర్వదించబడాలని కోరుకుంటారు;
దేశంలో ప్రమాణం చేసేవారు,
ఖచ్చితంగా ఏకైక నిజ దేవుని పేరిట ప్రమాణం చేస్తారు.
గతకాలపు సమస్యలన్నీ మరచిపోయాను.
అవి నా కళ్ల నుండి దాచబడ్డాయి.
క్రొత్త ఆకాశం క్రొత్త భూమి
17“చూడండి, నేను క్రొత్త ఆకాశాన్ని
క్రొత్త భూమిని సృష్టిస్తాను.
గత విషయాలు గుర్తు చేసుకోబడవు.
వాటి గురించి ఎవరూ ఆలోచించరు.
18అయితే నేను సృష్టించబోయే వాటి గురించి
మీరు ఎప్పుడూ సంతోషించి ఆనందించండి.
నేను యెరూషలేమును సంతోషకరమైన స్థలంగా
ప్రజలను ఆనందంగా చేస్తాను.
19నేను యెరూషలేము గురించి సంతోషిస్తాను
నా ప్రజల్లో ఆనందిస్తాను;
ఏడ్పు రోదన శబ్దం
ఇకపై దానిలో వినపడవు.
20“ఇకపై అక్కడ కొన్ని రోజులు మాత్రమే
బ్రతికి ఉండే శిశువులు ఉండరు.
తన కాలం పూర్తి కాకుండా చనిపోయే వృద్ధుడు ఉండడు;
వంద సంవత్సరాల వయస్సులో
చనిపోయేవారిని పిల్లలుగా పరిగణించబడతారు;
వంద సంవత్సరాలకన్నా ముందే చనిపోయే
పాపిని శాపగ్రస్తుడు అంటారు.
21వారు ఇల్లు కట్టుకుని వాటిలో నివసిస్తారు;
వారు ద్రాక్షతోటలు నాటి వాటి పండ్లు తింటారు.
22ఇకపై వారు కట్టుకున్న ఇళ్ళలో వేరొకరు నివసించరు.
వారు నాటిన వాటి పండ్లను వేరొకరు తినరు.
నా ప్రజల ఆయుష్షు
చెట్ల ఆయుష్షంత ఉంటుంది;
నేను ఏర్పరచుకున్నవారు తమ చేతిపనిని
పూర్తిగా అనుభవిస్తారు.
23వారు వృధాగా కష్టపడరు,
దురదృష్టాన్ని అనుభవించడానికి పిల్లల్ని కనరు;
వారు యెహోవాచేత ఆశీర్వదించబడిన ప్రజలుగా,
వారు, వారి వారసులు ఉంటారు.
24వారు మొరపెట్టక ముందే నేను జవాబిస్తాను;
వారు ఇంకా మాట్లాడుతుండగానే నేను వింటాను.
25తోడేలు గొర్రెపిల్ల కలిసి మేస్తాయి,
సింహం ఎద్దులా గడ్డి తింటుంది,
దుమ్ము సర్పానికి ఆహారమవుతుంది.
నా పరిశుద్ధ పర్వతం మీద
అవి హానిని గాని నాశనాన్ని గాని చేయవు”
అని యెహోవా చెప్తున్నారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెషయా 65: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapistaging.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fte.png&w=128&q=75)
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.