యోబు 32
32
ఎలీహు
1యోబు తన దృష్టిలో తాను నీతిమంతునిగా ఉన్నాడని గ్రహించిన ఆ ముగ్గురూ అతనికి సమాధానం ఇవ్వడం మానేశారు. 2దేవుని కంటే తాను ఎక్కువ నీతిమంతుడని చెప్పుకుంటున్నాడని, రాము వంశస్థుడును, బూజీయుడైన బరకెయేలు కుమారుడైన ఎలీహు యోబు మీద చాలా కోప్పడ్డాడు. 3అతడు ముగ్గురు మిత్రులపై కూడా కోపంగా ఉన్నాడు, ఎందుకంటే వారు యోబు తప్పు అని నిరూపించడం చేతకాకపోయినా, వారు అతన్ని ఖండించారు.#32:3 ప్రా.ప్ర.లలో యోబును, తద్వార దేవున్ని ఖండించారు 4వారందరు తనకన్నా పెద్దవారు కాబట్టి యోబుతో మాట్లాడాలని ఎలీహు ఎదురుచూశాడు. 5కాని ఆ ముగ్గురు స్నేహితులు ఇంకేమి మాట్లాడకపోవడంతో అతనికి చాలా కోపం వచ్చింది.
6బూజీయుడైన బరకెయేలు కుమారుడైన ఎలీహు ఇలా అన్నాడు:
నేను వయస్సులో చిన్నవాన్ని,
మీరు పెద్దవారు;
అందుకే నేను భయపడ్డాను,
నేను అనుకున్నది మీతో చెప్పడానికి ధైర్యం చేయలేదు.
7ముందుగా వయస్సు మాట్లాడాలి;
గడచిన సంవత్సరాలు జ్ఞానం బోధించాలని నేననుకున్నాను.
8అయితే అది ఒక వ్యక్తిలో ఉన్న ఆత్మ,
సర్వశక్తిమంతుని ఊపిరి వారికి వివేచన కలిగిస్తుంది.
9కేవలం వృద్ధులే జ్ఞానులు కారు,
పెద్ద వయస్సు వారే వివేచన గలవారని కాదు.
10కాబట్టి నేను చెప్తున్న: నేను చెప్పేది వినండి;
నాకు తెలిసింది మీకు చెప్తాను.
11మాట్లాడడానికి మీరు మాటల కోసం వెదకుతున్నప్పుడు,
మీ మాటల కోసం నేను వేచి ఉన్నాను;
నేను మీ అభిప్రాయాలను విన్నాను,
12మీరు చెప్పేవాటిని నేను జాగ్రత్తగా విన్నాను;
అయితే మీలో ఒక్కరు కూడా యోబు తప్పు అని నిరూపించలేదు;
అతని వాదనలకు ఎవరూ జవాబు చెప్పలేదు.
13మాకు జ్ఞానం లభించింది;
మనుష్యులు కాదు, దేవుడే అతన్ని తప్పు అని నిరూపించాలని మీరు అనకండి.
14కాని యోబు నాతో వాదించలేదు,
మీ వాదనలతో నేను అతనికి జవాబు ఇవ్వను.
15వారు ఆశ్చర్యపడి ఇక ఏమి చెప్పలేదు;
వారికి మాటలు దొరకలేదు.
16వారు జవాబేమి చెప్పలేదా అలా ఉండిపోయారు,
వారు మౌనంగా ఉండగా నేను ఇంకా వేచి ఉండాలా?
17నేను కూడా చెప్పాల్సింది చెప్తాను;
నేను కూడా నాకు తెలిసింది చెప్తాను.
18ఎందుకంటే నా మనస్సునిండ మాటలున్నాయి,
నాలోని ఆత్మ నన్ను బలవంతం చేస్తోంది.
19నా అంతరంగం మూసివేసిన ద్రాక్షరసం తిత్తిలా ఉంది,
క్రొత్త తిత్తివలె అది పగిలిపోవడానికి సిద్ధంగా ఉంది.
20నేను మాట్లాడి ఉపశమనం పొందాలి;
నా నోరు తెరచి సమాధానం ఇస్తాను.
21నేను పక్షపాతం చూపించను,
ఏ మనుష్యుని పొగడను;
22ఎలా పొగడాలో నాకు చేతకాదు. ఒకవేళ నేను అలా పొగిడితే
వెంటనే నా సృష్టికర్త నన్ను చంపుతారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యోబు 32: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.